Flying Fishes Are Rare In Seawater, Know Interesting Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

Flying Fish Facts: ఆ చేపలు ఎగురుతాయి.. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో టేకాఫ్‌!

Published Sat, Jan 28 2023 12:27 PM | Last Updated on Sat, Jan 28 2023 1:43 PM

Flying Fishes Are Rare In Seawater - Sakshi

సాక్షి, అమరావతి: ఈ చేపలు నీటిలో ఈదటమే కాదు.. గాలిలో ఎగురుతాయి కూడా. వీటికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి రాత్రి పూట సముద్రం ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి. అట్లాంటిక్, పసిఫిక్‌ సముద్ర జలాల్లో కనిపించే ఈ జీవులు ఇటీవల భారత జలాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఈ చేపల కళ్లు నీటి అడుగు ప్రాంతాలను చూడటంతోపాటు గాలిలోనూ స్పష్టంగా చూడగలిగేలా మారిపోయాయట. ఈ చేపల విశేషాలేంటో మనమూ ఓ లుక్కేద్దాం.

నీటిలో ఈదే చేపలు గాల్లో ఎగురుతున్నాయి. నీటి అడుగున గంటకు 56 కిలోమీటర్ల టేకాఫ్‌ స్పీడ్‌తో పైకి దూసుకెళ్తున్నాయి. ఉష్ణమండల సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ‘ఫ్లయింగ్‌ ఫిష్‌’లు చేపల్లోనే అరుదైన జాతులుగా గుర్తింపు పొందాయి.  ప్రపంచంలో దాదాపు 40 రకాల ఎగిరే చేపలు ఉన్నాయి. ఈ సముద్ర చేపల కుటుంబాన్ని ఎక్సోకోటిడే అని పిలుస్తారు. లాటిన్‌ భాషలో ఎక్స్‌ అంటే ‘బయట’ అని ‘కొయిటోస్‌‘ అంటే మంచం అని అంటారు. ఇవి రాత్రి పూట సముద్రపు ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి కాబట్టే వీటిని లాటిన్‌లో అలా పిలుస్తారట.

రెండు.. నాలుగు రెక్కలతో.. 
సాధారణ చేపలు నీటి నుంచి ఎగిరి దూకుతుంటాయి. వాటి దూరం కూడా మహా అయితే అడుగు వరకే ఉంటుంది. కానీ.. ఫ్లయింగ్‌ ఫిష్‌ శరీరానికి ఇరువైపులా పొడవాటి, వెడల్పాటి పెక్టోరల్‌ రెక్కలు ఉంటాయి. ఇందులో ‘టూ వింగర్స్‌’ అనే చేపకు రెండు పెద్ద పెక్టోరల్‌ రెక్కలు ఉంటాయి. ‘ఫోర్‌ వింగర్స్‌’గా పిలిచే చేపలకు రెండు పొడవాటి పెక్టోరల్‌ రెక్కలతో పాటు రెండు పెల్విక్‌ (చిన్న) రెక్కలు ఉంటాయి.

వీటి సాయంతోనే ఇవి గాల్లో సులభంగా ఎగరగలుగుతుంది. వీటి వెన్నుపూస నిర్మాణం చూస్తే పడవ చుక్కానిలా కనిపిస్తుంది. ఇవి పక్షుల స్థాయిలో ఎగరలేవు కానీ.. దాదాపు 200 మీటర్ల వరకు ఎగరగలవు. పక్షలు రెక్కలు పైకీ, కిందకి ఆడించినట్టు ఇవి రెక్కలను ఊపలేవు. నీటినుంచి పైకి వచ్చిన వేగాన్ని బట్టి వాటి రెక్కలను విచ్చుకుని మాత్రమే కొంత దూరం ఎగురుతాయి.

పెద్ద చేపల నుంచి తప్పించుకునేందుకే.. 
ఈ అసాధారణ చేపలు 6 నుంచి 20 అంగుళాలు పొడవు ఉంటాయి. రెండు అంగుళాల పొడవు ఉన్నప్పుడే ఎగరడం ప్రారంభిస్తాయి. డాల్ఫిన్లు, వేగంగా ఈదే ఇతర పెద్ద చేపలకు ఆహారం కాకుండా తప్పించుకోవడానికి ఇవి ఎగిరే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి కళ్లు నీటి అడుగున మాత్రమే కాకుండా గాలిలో కూడా స్పష్టంగా చూడగలిగేలా మార్పు చెందాయి. ఇవి చిన్నచిన్న చేపలను, పాచిని తీని జీవిస్తాయి. ఇవి సెకనుకు దాదాపు మీటరు వేగంతో ఉపరితలం వైపు ఈదుతాయి.  

చెన్నయ్‌ తీరంలోనూ సందడి 
ఇవి ఉష్ణమండల, సమశీతోష్ణ సముద్ర జాతులకు చెందిన చేపలు. అట్లాంటిక్, పసిఫిక్‌ సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల వీటి గమనం బంగాళాఖాతంలోనూ కనిపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్, జపాన్, వియత్నాం, ఇండోనేషియా, తైవాన్, చైనా, వెనిజులా, బార్బడోస్‌ జలాల్లో ఎగిరే చేపలు ఉన్నాయి. మాల్దీవులు, చెన్నయ్‌ తీరాల్లోనూ ఇవి తరచూ కనిపిస్తున్నాయి.
 

400 మీటర్లు ఎగిరి.. 
గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం ఓ ఫ్లయింగ్‌ ఫిష్‌ 30 కిలోమీటర్ల వేగంతో 45 సెకన్ల పాటు గాల్లో ఎగిరింది. ఇది 2008లో జపాన్‌లోని కగోషిమాలో ఫెర్రీలో ప్రయాణిస్తున్న ఓ చిత్ర బృందం కెమెరాకు చిక్కింది. ఇది దాదాపు 1,312 అడుగుల మేర ఎగిరినట్టుగా నమోదైంది. సాధారణంగా ఫ్లయింగ్‌ ఫిష్‌లు 655 అడుగుల వరకు, నీటి ఉపరితలం నుంచి 26 అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి. నీటిలోకి తిరిగి దూకినప్పుడు కూడా వేగంగా ఈత కొట్టడం ప్రారంభిస్తాయి. ఇవి అలసి పోకుండా వరుసగా  12 సార్లు గాల్లో ఎగరగలవు.
చదవండి: మిసెస్‌ ఇండియా పోటీలకు విశాఖ మహిళ పైడి రజని

పట్టిన వెంటనే తినేయాలట
కరేబియన్‌ ద్వీప దేశాలైన బార్బడోస్, ట్రినిడాడ్, టొబాగోలకు ఈ చేపలే వాణిజ్య పరంగా కీలకంగా ఉన్నాయి. స్థానిక మత్స్యకారులు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఫ్లయింగ్‌ ఫిష్‌ మాంసం గట్టిగా లేత, తెలుపు రంగులో ఉంటుంది. దీనిని కాల్చి, వేయించి, ఆవిరితో వండుకుని తింటారు. ఎగిరే చేపలను పట్టుకున్న వెంటనే తినేయాలట. ఇవి ఎక్కువ దూరం రవాణా చేయడానికి సరిపడవు. ఇతర సముద్ర జీవుల మాదిరిగానే ఇవి కూడా కాంతికి ఆకర్షితం అవుతాయి. అందుకే  మత్స్యకారులు లైట్ల వెలుతురులో రాత్రిపూట వేట కొనసాగిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement