
న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ఎంపికల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం పట్ల యువతను ఆకర్షితులను చేసే దిశగా కేంద్రం ఒక ప్రకటన చేసింది. అగ్నివీర్ ద్వారా ఎంపికై నిబంధనల మేరకు నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని రిటైరైన అభ్యర్థులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు, గరిష్ట వయోపరిమితిలో కూడా సడలింపులు ఉంటాయని తెలిపింది.
ఇందుకు వీలు కల్పిస్తూ బీఎస్‌ఎఫ్ జనరల్ డ్యూటీ కేడర్(నాన్ గెజిటెడ్) రిక్రూట్‌మెంట్–2015 నిబంధనల్లో మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇవి మార్చి 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి బ్యాచ్ మాజీ అగ్నివీర్‌లకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని కేంద్ర హోం శాఖ అందులో వివరించింది. ఇతర బ్యాచ్‌ల వారికైతే మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్‌లకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది.