రిటైర్డ్ పోలీసు అధికారులు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణంగా మారింది. పోలీసు ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్ తీసుకుని, యూపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అసీమ్ అరుణ్ బీజేపీకి చెందిన ప్రముఖ నేతల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇదేవిధంగా పలు రాష్ట్రాల పోలీసు అధికారులు రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంజయ్ పాండే ముంబైలోని వెర్సోవా నియోజకవర్గం నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు.
తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఈ నేపధ్యంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ డీజీపీ పాండే మీడియాకు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తాను ఉంటున్న నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, అన్ని వర్గాల మద్దతును స్వాగతిస్తున్నానని పాండే పేర్కొన్నారు.
ముంబై పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేసిన పాండే తాను ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీని సంప్రదించలేదని, సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, దానిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పాండేను 2022 సెప్టెంబర్‌లో సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు నేపధ్యంలోనే సంజయ్ పాండే వార్తల్లో నిలిచారు. ఆయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో చదువుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment