
కరోనా బారినపడిన మాజీ ప్రధాని ఎట్టకేలకు కోలుకున్నారు. పది రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా బారినపడిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు కోలుకున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ రావడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఏప్రిల్ 19వ తేదీన మన్మోహన్ కరోనా బారినపడ్డారు. రెండుసార్లు (మార్చి 4, ఏప్రిల్ 3) కరోనా టీకాలు తీసుకున్న తర్వాత కూడా ఆయన కరోనా బారినపడడం కలకలం రేపింది. కరోనా నిర్ధారణ అయిన అనంతరం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
పది రోజుల పాటు ఎయిమ్స్‌లో చికిత్స పొందిన అనంతరం మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ రావడంతో మన్మోహన్ సింగ్‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే మన్మోహన్ సింగ్ దేశంలో కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. పలు సూచనలు చేయగా వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: ఇప్పటివరకు లాక్‌డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..