Booster Dose: ఇకపై ఫ్రీగా కరోనా బూస్టర్‌ డోస్‌ | Free Covid-19 Precaution Doses for18-59 Age group from July 15 | Sakshi
Sakshi News home page

కేంద్రం గుడ్‌న్యూస్‌: ఉచితంగా కరోనా బూస్టర్‌ డోస్‌.. ఎప్పటి నుంచి అంటే..

Published Wed, Jul 13 2022 3:49 PM | Last Updated on Wed, Jul 13 2022 4:32 PM

Free Covid-19 Precaution Doses for18-59 Age group from July 15 - Sakshi

ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 199.72 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు 18-59 ఏళ్ల వారికి రెండు డోసులు ఉచితంగా అందించింది కేంద్రం. ఆ తర్వాత ఏప్రిల్‌ 10న ప్రికాషన్‌ డోసుల పంపిణీ ప్రారంభించింది. అయితే.. 18-59 ఏళ్ల వారు ప్రికాషన్‌ డోస్‌ను ప్రైవేటు కేంద్రాల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. అలాగే 60 ఏళ్లుపైబడిన వాళ్లకు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు మూడో డోసు ఫ్రీగానే అందించింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రికాషన్‌ డోస్‌పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవటం వల్ల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.

ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా ప్రికాషన్‌ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. జులై 15న మొదలై 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా మూడో డోసు అందించనున్నారు. 'దేశ జనాభాలో ఎక్కువ మంది తొమ్మిది నెలల క్రితమే రెండు డోసులు తీసుకున్నారు.

ఐసీఎంఆర్‌, ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలింది. 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో 18-59 ఏళ్ల వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్‌ డోసు అందించనున్నారు. జులై 15న ప్రారంభం కానుంది.' అని అధికారులు తెలిపారు. 

కేవలం ఒక శాతమే..
ఇప్పటి వరకు దేశంలోని 77 కోట్ల మంది ఉన్న 18-59 ఏళ్ల వయసు వారిలో కేవంల 1 శాతం మాత్రమే ప్రికాషన్‌ డోసు తీసుకున్నారు. అర్హత కలిగిన 60 ఏళ్లు పైబడినవారు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 16 కోట్ల మంది ఉండగా.. అందులో 26 శాతం మంది మూడో డోసు తీసుకున్నారు.   

వ్యవధి తగ్గింపు.. 
కొద్ది రోజుల క్రితమే ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌ తీసుకోవాల్సి ఉండగా.. ఆ సమయాన్ని ఆరు నెలలకు కుదించింది. వ్యాక్సినేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌ వేగం పెంచేందుకు ఇంటింటికీ టీకా 2.O పథకాన్ని జూన్‌ 1న ప్రారంభించింది కేంద్రం. ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 96 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 87 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు.

ఇదీ చదవండి: కోవిడ్‌ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement