ఇంఫాల్: మణిపూర్ ప్రజలు గడిచిన రెండున్నర నెలలుగా కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోందను కుంటున్న తరుణంలో అల్లర్ల సమయంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మరువక ముందే ఒక మహిళను ఇంట్లోనే పెట్టి సజీవ దహనం చేసిన మరో ఘటన సెరౌ పోలీస్ స్టేషన్లో నమోదైంది.
మే 28న కక్చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడి భార్య ఐబెతొంబి(80)ను అల్లర్ల సమయంలో ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో బాధితురాలు ఎటూ తప్పించుకోలేక అగ్నికి సజీవ దహనమైంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మనవడు ప్రేమకంఠ(22) పై సాయుధులైన నిరసనకారులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతడి చేతుల్లోకి తొడభాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.
అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చగా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆరోజున ప్రమాదాన్ని పసిగట్టిన మృతురాలు కొద్దిసేపైన తర్వాత తిరిగి రండని చెప్పి ఇంట్లో వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పి తాను మాత్రం ఇంట్లోనే ఉండిపోయి అగ్నికి ఆహుతైందని చెప్పుకొచ్చాడు ప్రేమకంఠ. రెండు నెలల తర్వాత తిరిగొచ్చిన అతను శిధిలమైన ఇంటి నుండి జ్ఞాపకాలను తన వెంట తీసుకుని వెళ్ళాడు. వాటిలో మృతురాలి భర్త ఎస్. చురాచంద్ సింగ్(లేటు) భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గౌరవ పురస్కారాన్ని స్వీకరించిన ఫోటో ఫ్రేము కూడా ఉంది.
మణిపూర్ అల్లర్లలో అత్యధికంగా నష్టపోయిన గ్రామాల్లో సెరౌ గ్రామం కూడా ఒకటి. రాజధానికి 45 కి.మీ దూరంలో ఉండే ఈ ప్రాంతం హింసాకాండలో బాగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సగం కాలిపోయిన ఇళ్ళు.. తూటాల రంధ్రాలతో నిండిన గోడలు దర్శనమిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రధాని పదవి నుండి తప్పుకుని సమర్ధులకి అప్పగించాలి.. అశోక్ గెహ్లాట్
Comments
Please login to add a commentAdd a comment