ఇంఫాల్: మణిపూర్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీలు రెండ్రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి రోజున వీరంతా బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా నగ్నంగా ఊరేగించబడిన మహిళల్లో ఒకరి తల్లి హృదయవిదారకమైన తన విన్నపాన్ని వారికి వివరించింది. నా భర్తను, కొడుకుని కూడా అదేరోజున చంపేశారు. దయచేసి వారి శవాలనైనా మాకు ఇప్పించండని వేడుకున్నారు.
వర్గవివక్ష కారణంగా చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు 21 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా వారు బాధితులను పరామర్శించారు. వారిలో నగ్నంగా ఊరేగించబడిన మహిళల్లో ఒకరి తల్లి మాట్లాడుతూ.. ఆరోజున నాకు జరిగిన నష్టం చాలా పెద్దది. నా కుమార్తెను వివస్త్రురాలికి చేసి దారుణంగా అవమానించారు. అడ్డుకున్న నా భర్త, కుమారుడిని చంపేశారు. కుకీలు, మెయిటీలు ఇకపై కలిసి ఉండటం జరగదని అన్నారు.
ఆమెతో మాట్లాడిన తర్వాత సుష్మితా దేవ్ స్పందిస్తూ.. పోలీసుల సమక్షంలోనే ఆమె కొడుకును, భర్తను చంపేశారు. అయినా కూడా ఏ ఒక్క పోలీసును సస్పెండ్ చేయలేదు. సుమారు వెయ్యిమంది ఆరోజున దాడిలో పాల్గొన్నారని బాధితురాలు చెబుతోంది. ఆమె కుమార్తెను దారుణంగా నగ్నంగా ఊరేగించారు. ప్రస్తుతం ఆ యువతి పోలీసులను చూస్తేనే భయపడిపోతోంది. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడమంటే అది రాజ్యాంగానికే మాయని మచ్చ. ఆమె తన భర్త, కొడుకుల శవాలనైనా ఇప్పించమని కోరుతున్నారు. నేను ఈ విషయాన్ని కచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు.
ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. పాపం ఆ బాధితురాలి భర్త దేశ సైన్యంలో పనిచేశారు. దేశానికి రక్షణ కల్పించారు కానీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోయారు. తనకు అంత నష్టం జరిగితే ఇంతవరకు ఆమెకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు.
ఆ రోజున..
మే 4న ఒక్కసారిగా అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తుండటంతో సేనాపతి జిల్లాలోని బి.ఫయనోమ్ గ్రామంలో ఓ పెద్దాయన(51) అతడి కుమారుడు(19), కుమార్తె(21), మరో ఇద్దరు మహిళలు కలిసి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు బయలుదేరారు. అంతలో 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు ఈ ఐదుగురిని సమీపించి మొదట యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె తండ్రిని, తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. తర్వాత యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ పొలాల్లోకి తీసుకెళ్ళి వారిలో ఒకరిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ వీడియో చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇది కూడా చదవండి: మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు
Comments
Please login to add a commentAdd a comment