ఇంఫాల్: మణిపూర్‌లో తవ్వేకొద్దీ దారుణాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ చేతికి మొత్తం 20 కేసులను అప్పగించగా తాజాగా వారికి మరో సంచలనాత్మక కేసును అప్పగించారు మణిపూర్ పోలీసులు. ఆనాటి అల్లర్లలో బులెట్ గాయమైన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రికి తీసుకెళ్తోన్న తల్లి, మేనత్తలను బిడ్డతో సహా సజీవ దహనం చేసిన ఈ సంఘటన అధికారులను సైతం కలచివేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 4న టాన్సింగ్(7) సహాయక శిబిరంలో ఉండగా మెయిటీ అల్లరి మూకలు జరిపిన కాల్పుల్లో ఒక బులెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. వెంటనే సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడి ఎస్పీతో మాట్లాడి బాలుడి తోపాటు తల్లి, మేనత్తలను మాత్రమే వెంట ఆసుపత్రికి పంపాల్సిందిగా సూచించారు. ఎందుకంటే బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కుకీ తెగకు చెందిన వారు కాగా తల్లి మీనా హాంగ్సింగ్ మాత్రం మెయిటీ తెగకు చెందింది. ఆమెనైతే మెయిటీలు ఏమీ చేయరన్న ఉద్దేశ్యంతో అలా చేసినట్టు ఆర్మీ అధికారి తెలిపారు.
అధికారి చెప్పినట్టుగానే బాలుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ఎస్పీ. అంబులెన్స్ కు తోడుగా ఇంఫాల్ వెస్ట్ సూపరింటెండెంట్ సహా పోలీసుల ఎస్కార్టును కూడా పంపించారు ఆర్మీ ప్రతినిధులు. సరిగ్గా ఇంఫాల్ సరిహద్దుకు చేరుకోగానే సుమారు 2000 మంది గుంపు చుట్టూ మూగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంచెం వెనక్కి తగ్గినట్టే తగ్గి అలరిమూక ఒక్కసారిగా దాడి చేసి అంబులెన్సుకు నిప్పు పెట్టేశారు. పోలీసులు చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో చిక్కుకోగా అందులోని బాలుడు, అతడి తల్లి, మేనత్త సజీవ దహనమయ్యారు.
బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కాంగ్పోక్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. లాంఫెల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే కేసు నమోదైంది. దీంతో సీబీఐ ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి రెండు కేసులు ఒక్కటేనని తేల్చి దర్యాప్తు చేసే పనిలో పడింది. మణిపూర్‌లో రెండున్నర నెలలుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment