
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ కొన్ని రాష్ట్రాలు తమకు లబ్ధి కలిగేలా కొత్త పేర్లు పెట్టడం ఇకపై కుదరదు. పార్లమెంట్ ఆమోదం పొందిన పథకాల పేర్లను మార్చడం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పాత్రను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేయడమే అవుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పథకాల పేర్లను మార్చే రాష్ట్రాలకు నిధులు నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై), ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు వివిధ రాష్ట్రాలు తమకు అనుకూల పేర్లను పెట్టి అమలు చేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను పంజాబ్ ప్రభుత్వం ‘ఆమ్ ఆద్మీ క్లినిక్’లుగా మార్చింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పీఎంఏవై పథకాన్ని బంగ్లా ఆవాస్ యోజనగా మార్చి ఆ రాష్ట్ర సీఎం ఫోటోతో ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీలో దీనిని న్యూఢిల్లీ ఆవాస్ యోజన అని పిలుస్తున్నారు. అలాగే తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌ల్లోనూ ఈ పథకం పేరు మార్చారంటూ పార్లమెంట్ సమావేశాల్లో కొందరు ఎంపీలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
నిబంధనలు పాటిస్తేనే నిధులు..
ఈ క్రమంలో కేంద్ర పథకాల పేర్లను మార్చకుండా నిబంధనల మేరకు అమలు చేస్తున్న రాష్ట్రాలకే నిధులు పొందే అర్హత ఉంటుందన్న షరతును కచి్చతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం. ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్‌కు కేంద్రం పెట్టిన పేరు మార్చాయి. ఇది నిబంధనల ఉల్లంఘనే. ఈ పద్ధతి నిధుల విడుదల నిలిపివేయడానికి దారి తీస్తుంది’అని హెచ్చరించడం గమనార్హం.
చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు
Comments
Please login to add a commentAdd a comment