న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నో పోషకాలతో నోరూరించే భారతీయ తృణధాన్యాల వంటకాల రుచిని వీరికి చూపించనున్నారు. భారత్ మంటపంలో జరుగుతున్న శిఖరాగ్రం ఏర్పాట్లను జీ20 స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి ఆదివారం పీటీఐకి వివరించారు.
‘మన దేశ స్ట్రీట్ ఫుడ్, ప్రాంతీయ, స్థానిక వంటకాలను వారికి సరికొత్త రీతిలో పరిచయం చేయనున్నాం. ఢిల్లీలోని చాందినీ చౌక్ తదితర ప్రాంతాల్లోని స్ట్రీట్ ఫుడ్‌కు ఎంతో పేరుంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న మీడియా సెంటర్‌లో భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచిని ఆస్వాదించొచ్చు’అని పర్దేశి వివరించారు. ప్రపంచదేశాల నేతల సతీమణుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.
‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో షాపింగ్ అనుభవంతో కూడిన భారతీయ ప్రసిద్ధ హస్తకళల వారసత్వంపై లైవ్ షోలు ఏర్పాటుచేశాం. నేతలు, ప్రతినిధులకిచ్చే బహుమతుల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం’అని చెప్పారు. ‘ప్రపంచ నాయకులకిచ్చే బహుమతులు గౌరవభావాన్ని పెంచేలా, వారి మనస్సును ఆకట్టుకునేలా ఉండాలని ప్రధాని చెప్పారు.
ఆ మేరకు తివాచీలు, హస్తకళల వస్తువులు, పెయింటింగ్‌ల వంటి వాటితో జాగ్రత్తగా తయారు చేసిన జాబితాను అందజేశాం’అని తెలిపారు. శిఖరాగ్రానికి వివిధ దేశాల నుంచి 10 వేల మందికి పైగా తరలిరానున్నారని పర్దేశి చెప్పారు. ‘శిఖరాగ్రంలో చివరి సెషన్‌లో జీ20 తదుపరి అధ్యక్ష హోదాలో బ్రెజిల్ లాంఛనప్రాయంగా బాధ్యతలను చేపడుతుంది. నవంబర్ 30వ తేదీన ప్రధాని బ్రెజిల్‌కు వెళ్లి బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు’అని పర్దేశి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment