సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీలో మహిళలకు ఎక్కడ భద్రత ఉందో..? తాను తండ్రిగా భావించే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మహిళా నేత, సినీ నటి గాయత్రి రఘురాం వ్యాఖ్యానించారు. మహిళలను అవమాన పరిచే జోకర్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న విమర్శల గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ మహిళ నేత, సినీ నటి గాయత్రి రఘురాం అధ్యక్షుడికి వ్యతిరేకంగా తరచూ తీవ్ర వ్యాఖ్యల తూటాలను పేల్చుతూ వస్తున్నారు. తాజాగా అధ్యక్షుడు అన్నామలైకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. ఇందులో తనను తీవ్రంగా అవమానపరిచి, అత్యంత నీచాతి నీచంగా తనతో వ్యవహరించిన అధ్యక్షుడికి జెడ్ కేటగిరీ భద్రత ఎందుకో..? అని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీలో మహిళ భద్రత సూపర్ అని ఎద్దేవా చేస్తూ, ప్రధాని నరేంద్రమోదీని తాను తండ్రిస్థానంలో చూస్తానని పేర్కొన్నారు. రాజకీయ జోకర్‌కు ఈ భద్రత అవసరమా..? అని విమర్శించారు. ఇలాంటి వారి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం శోచనీయమన్నారు.
దూరంగా శాసన సభాపక్ష నేత..
అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ మద్దతు ఇచ్చారు. రామసేత వంతెనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై అందుకు భిన్నంగా మీడియాతో స్పందించారు. ఇది ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాలను ఈ విషయం స్పష్టం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం తిరునల్వేలిలో జరిగిన సంక్రాంతి వేడుకలకు అన్నామలై హాజరైనా నయనార్ నాగేంద్రన్ దూరంగా ఉండటం చర్చకు దారి తీసింది. తిరునల్వేలి జిల్లాలో సీనియర్‌నేతగా నాగేంద్రన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment