ముంబై : ప్రభుత్వ మింట్‌లో 40 రూపాయలను దొంగిలించిన వ్యక్తిపై ముంబైలోని ఎంఆర్‌ఏ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్ట్ ప్రాంతంలోని మింట్‌లో త్వరలో విడుదల కాబోయే 20 రూపాయల నాణేలు రెండింటిని ఆర్‌ఆర్ చబుక్షర్ చోరీ చేశారు. ఈ నాణేలను ఆయన లాకర్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చబుక్షర్ ప్రభుత్వ మింట్ నుంచి తొలిసారి చోరీ చేశాడా, గతంలోనూ చోరీలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి లాకర్‌లో నాణేలున్నాయని సీనియర్ అధికారుల ఫిర్యాదుతో సీఐఎస్‌ఎఫ్ పోలీసులు లాకర్‌ను తెరిచిచూడగా నాణేలు బయటపడ్డాయి.
చోరీకి గురైన నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 381 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద నిందితుడికి ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2019 మార్చిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన పలు నాణేల్లో 20 రూపాయల నాణెం కూడా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ నాణెం విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. కాగా, నిందితుడు నాణేలను చోరీ చేసినా రోజువారీ తనిఖీలతో వాటిని బయటకు తీసుకువెళ్లలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తితో నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని, దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. చదవండి : ‘ఆరు రెట్లు అధిక ధరకు అమ్ముతూ చిక్కారు’
Comments
Please login to add a commentAdd a comment