అభిషేక్ సింఘ్వీ
న్యూఢిల్లీ: పెగసస్ అంశంపై చర్చకు నిరాకరిస్తున్న ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను ముందుగానే ముగించేందుకు సాకులు వెదుకుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్లమెంట్‌లో ప్రస్తుత ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ‘పార్లమెంట్ సమావేశాలను ప్రభుత్వమే అడ్డుకుంటోంది.
ఈ సమావేశాలను ముందుగానే ముగించేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. అంతిమంగా ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి’ అని ఆయన మీడియాతో అన్నారు. పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్ నుంచి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఏ రూపంలోనైనా ప్రభుత్వ ఏజెన్సీలు సంపాదించాయా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేకపోతోందన్నారు.
ఒకవేళ ఆ సాంకేతికతను పొందితే ఎవరెవరిపై ప్రయోగించారో తెలపాలని అడిగినా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment