
అహ్మదాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళిగా గుజరాత్‌లోని ఓ చెక్ డ్యామ్‌కు ఆమె పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
దాదాపు రూ. 15 లక్షలతో రాజ్‌కోట్-కలావడ్ రోడ్డులోని వాగుదాడ్ గ్రామ సమీపంలో న్యారీ నది వద్ద ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. గిర్ గంగా పరివార్ ట్రస్ట్.. ఈ డ్యామ్ నిర్మాణ బాధ్యతలను చూసుకుంటోంది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే దర్షితా షా, రాజ్‌కోట్ మేయర్ ప్రదీప్ దావ్ సమక్షంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ తల్లికి నివాళిగా ఈ చెక్ డ్యామ్‌కు హీరాబా స్మృతి సరోవర్ అని నామకరణం చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు గిర్ గంగా పరివార్ ట్రస్ట్ వాళ్లు. తద్వారా అయినవాళ్లు దూరమైనప్పుడు ఓ మంచి పని చేయాలనే ఆలోచన మరికొందరిలో కలుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు.
గిర్ గంగా పరివార్ ట్రస్ట్.. పూర్తిగా విరాళాల సేకరణతోనే గత నాలుగు నెలల్లో 75 చెక్ డ్యామ్‌లు కట్టించింది. ప్రస్తుత డ్యామ్ నాలుగు వందల ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు ఉంటుందని, ఒక్కసారి డ్యామ్ నిండితే తొమ్మిది నెలల వరకు నీరు ఎండిపోదని, చుట్టుపక్కల గ్రామాలకు నీటి సమస్య తీరనుందని ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment