ప్రతీకాత్మక చిత్రం
కాసేపట్లో పరీక్ష హాలుకు చేరుకోవాల్సిన ఓ విద్యార్థి.. అనంత లోకాలకు చేరుకున్నాడు. పరీక్ష పేరుతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆపై ఛాతీ నొప్పితో కుప్పకూలి.. గుండె పోటుతో కన్నుమూశాడు. గుజరాత్‌లో ఈ వారం వ్యవధిలో ఇది రెండో విషాద ఘటన కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్ నవసారిలో ఫ్లస్ టూ చదువుతున్న ఉత్సవ్ షా.. పరీక్ష కోసం సిద్ధమయ్యాడు. అయితే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్తున్న క్రమంలో ఛాతీలో నొప్పి వస్తోందని తండ్రికి చెప్పాడు. ఈ తరుణంలో దగ్గర్లో ఉన్న ఆస్ప్రతికి తీసుకెళ్లగా.. వైద్యులతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయాడు. గుండె పోటుతో అతను కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు.
పరీక్ష కోసం రాత్రంతా నిద్రపోకుండా చదవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడంతో ఉత్సవ్‌కు గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఉత్సవ్‌కు అనారోగ్య సమస్యలేవీ లేవు. కాకపోతే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాడు. చనిపోయిన ఉత్సవ్ కళ్లను దానం చేసేందుకు ఆ తల్లిదండ్రులు ముందుకు వచ్చారు.
ఇదిలా ఉండగా.. ఈ వారంలో ఇది రెండో ఘటన. సోమవారం అహ్మదాబాద్‌లో ఇదే రీతిలో మరో విద్యార్థి గుండె పోటుతో కన్నుమూశాడు. గోమ్టిపూర్‌లో ఉండే మహ్మద్ అరిఫ్ పరీక్ష రాస్తున్న సమయంలో తీవ్రంగా వాంతులు చేసుకున్నాడు. దీంతో అతన్ని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో కన్నుమూశాడు. అరిఫ్ పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కావడం గమనార్హం.
లైఫ్ స్టయిల్, కరోనా తర్వాత మారిన పరిస్థితులతో గుండె జబ్బులు వయసు తారతమ్యం లేకుండా.. అన్ని వయసుల వాళ్లకు రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలని, ప్రత్యేకించి పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడి చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment