
అమరీందర్‌తో సమావేశమైన రావత్
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య సయోధ్య కుదరకపోయినప్పటికీ అమరీందర్ ఒక మెట్టు దిగారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా తమందరికీ ఆమోదయోగ్యమేనని అమరీందర్ శనివారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇష్టానికి వ్యతిరేకంగా నవజోత్ సింగ్ సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ హరీశ్ రావత్ చండీగఢ్ వెళ్లారు.
రావత్‌తో సమావేశానంతరం అమరీందర్ సింగ్ సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనంటూ ప్రకటన విడుదల చేశారు. అమరీందర్ వ్యక్తం చేసిన కొన్ని అంశాల్ని సోనియా దృష్టికి తీసుకువెళతానని రావత్ హామీ ఇచ్చినట్టు సీఎం సన్నిహితులు తెలిపారు. తనకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు, విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు సిద్ధూని కలవబోనని అమరీందర్ రావత్‌కి చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
వరస సమావేశాలతో సిద్ధూ బిజీ
సిద్ధూని పంజాబ్ పీసీసీ అ«ధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన రోజంతా బిజీ బిజీగా గడిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం అమరీందర్‌కు విధేయులైన నాయకుల్ని కలుసుకొని మంతనాలు సాగించారు.
కెప్టెన్ సాబ్ కీలక ప్రకటన చేశారు : రావత్
అధినేత్రి సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ ముఖ్యమంత్రి అమరీందర్ çకీలకమైన ప్రకటన చేశారని హరీష్ రావత్ అన్నారు. బయట జరుగుతున్న చర్చల్లో చాలా అంశాలు అవాస్తవాలని తనకు అర్థమైందని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో సోనియా నిర్ణయాన్ని తాను కూడా పూర్తిగా గౌరవిస్తానంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment