Harish Rawath
-
‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన టైం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌పై(పీఓకే) కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్. ప్రస్తుతం పాకిస్థాన్ బలహీన పరిస్థితుల్లో ఉందని, పీఓకేను వెనక్కి తీసుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పీఓకేను సొంతం చేసుకోవటం మన బాధ్యత అని సూచించారు. పీఓకేను తిరిగి పొందాలనే భారత లక్ష్యం ఎన్నటికీ నెరవేరదని, తమ దేశాన్ని రక్షించుకునేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని పాక్ సైన్యాధిపతిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పీఓకే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘పీఓకేను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. దానికి స్వేచ్ఛను కల్పించి, తిరిగి తీసుకోవటం మన బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. పీఓకేను తిరిగి తీసుకోవటం మోదీ ప్రభుత్వ అజెండాలో భాగమని నమ్ముతున్నాను. కేవలం చర్చలకే పరిమితం కాకూడదు. పాకిస్థాన్ ప్రభుత్వం బలహీనంగా ఉంది. పీఓకేను తిరిగి పొందేందుకు ఇదే సరైన సమయం.’ అని పేర్కొన్నారు హరీశ్ రావత్. అంతకు ముందు ఈ ఏడాది అక్టోబర్ 28న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పీఓకేపై సూత్రప్రాయ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని శరణార్థులు తిరిగి తమ స్వదేశానికి వస్తారని పేర్కొన్నారు. పీఓకేను తిరిగి పొందేందుకు తమ సైన్యం సిద్ధమవుతున్నట్లు భారత సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైతం కొద్ది రోజుల క్రితం పేర్కొన్నారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు దిమ్మతిరిగే షాక్
-
అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్
డెహ్రాడూన్/చండీగఢ్: బీజేపీకి చెందిన అమిత్‌షా తదితర నేతలతో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మంతనాలు జరుపుతుండటంపై పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జి హరీశ్ రావత్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు అమరీందర్ లౌకికతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు. సైద్ధాంతికంగా ఏమాత్రం పొసగని నాయకులతో అంటకాగవద్దనీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ నాయకత్వానికే మద్దతు ఇవ్వాలని కెప్టెన్‌ను రావత్ కోరారు. బీజేపీ వలలో పడవద్దని హితవు పలికారు. పంజాబ్ కాంగ్రెస్‌కు మూడు సార్లు అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి పార్టీ అవమానించిందని భావించడం సరికాదని చెప్పారు. ఆయనకు ఎటువంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. సీఎంగా విద్యుత్, డ్రగ్స్ వంటి కీలకమైన అంశాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కెప్టెన్ విఫలమయ్యారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సహా తనకు ఎవరి సలహా అక్కర్లేదన్న అహంభావంతో వ్యవహరించారని ఆరోపించారు. స్పందించిన కెప్టెన్ తన నిబద్ధతపై హరీశ్‌రావత్ సందేహాలు వ్యక్తం చేయడంపై కెప్టెన్ అమరీందర్ తీవ్రంగా స్పందించారు. తన బద్ధశత్రువులు, తీవ్రంగా విమర్శించే వారు సైతం లౌకికత విషయంలో తనను అనుమానించలేరన్నారు. ఇన్నేళ్లుగా విశ్వాసంగా పనిచేసిన తనకు ఆ పార్టీలో గౌరవం లేదని ఆయన వ్యాఖ్యలతో పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. సిద్దూ నేతృత్వంలోని తిరుగుబాటుదారులకు మద్దతు పలకడంతోపాటు తనను విమర్శించే స్వేచ్ఛ ఇచ్చారన్నారు. ‘సీఎల్పీ సమావేశంలో నన్ను దాదాపుగా తొలగించేందుకు రంగం సిద్ధం అయింది. ఆ అవమానం పొందడం ఇష్టంలేక ముందుగానే వైదొలిగాను. ఇది అందరికీ తెలిసిన విషయమే’అని ఆయన తెలిపారు. వాస్తవాలిలా ఉంటే, హరీశ్‌రావత్ మాత్రం ఇందుకు విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
త్వరలో సిద్ధూ, అమరీందర్‌లతో రావత్ చర్చలు
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీశ్ రావత్ ముందుకొచ్చారు. త్వరలో పంజాబ్‌లో పర్యటించి అమరీందర్, సిద్ధూలను కలుస్తానని, సయోధ్యకు ప్రయత్నిస్తానని రావత్ ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలపై పార్టీ నేత రాహుల్‌గాంధీతో ఆయన శనివారం చర్చించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండు మూడు రోజుల్లో నేను పంజాబ్‌కి వెళతాను. సయోధ్య కుదిర్చేందుకు అమరీందర్, సిద్ధూలతో మాట్లాడతాను. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేత లందరితోనూ మాట్లాడతాను’ అని రావత్ చెప్పారు. గత కొన్ని నెలలుగా అంతర్గత పోరుతో కాంగ్రెస్ పార్టీ అల్లాడిపోతోంది. సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఈ వర్గ పోరు ఒక కొలిక్కి రాలేదు. సిద్ధూ సలహాదారు మాల్వీందర్ సింగ్ కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సీఎం శిబిరం ఒత్తిడితో ఆయన సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరోవైపు తాను డమ్మీ చీఫ్‌గా ఉండలేనని, నిర్ణయాలు తీసుకునే స్వతంత్రం కావాలని సిద్ధూ డిమాండ్ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ సమస్యని అధిష్టానం ఎలా పరిష్కరించనుందో వేచి చూడాలి. -
నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వండి
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో సిద్ధూ– అమరీందర్ సింగ్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ స్పష్టంచేయడంతో పార్టీ రాష్ట్ర చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ నిరసన స్వరం మరింత పెంచారు. ఒక రాష్ట్ర విభాగానికి అధ్యక్ష హోదాలో తనను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోనివ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సిద్ధూ వ్యాఖ్యానించారు. కీలు బొమ్మలాగా, కేవలం ప్రదర్శనకు ఉంచిన ఒక వస్తువులాగా ఉండిపోదల్చుకోలేదని ఆయన అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతిని తగ్గించేందుకు సీఎం అమరీందర్ గురువారం పరోక్షంగా బల ప్రదర్శన చేశారు. గురువారం చండీగఢ్‌లో క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్‌సింగ్ ఇంట్లో జరిగిన విందు కార్యక్రమానికి దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారు. ఇది మంత్రుల భేటీగా వార్తలొచ్చినా.. సీఎం పరోక్షంగా బలప్రదర్శన చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిద్ధూ దీటుగా స్పందించారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు పార్టీ రాష్ట్ర విభాగాల అధ్యక్షులు ఉందని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించిందని సిద్ధూ గుర్తుచేశారు. శుక్రవారం అమృత్‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దూ మాట్లాడారు. ‘నన్నూ నిర్ణయాలు తీసుకోనివ్వండి. అలా అయితేనే పార్టీ మరో 20 ఏళ్లుపాటు అధికారంలోనే ఉండేలా చేస్తా. ఇందుకు ప్రణాళికలు సైతం సిద్ధంచేశా. నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వకుంటే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సిద్ధూ ధిక్కార స్వరంతో మాట్లాడారు. ఇన్చార్జ్గా తప్పించండి: హరీశ్ రావత్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అక్కడ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షునిగా బిజీగా ఉంటానని, అందుకే పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పిస్తే బాగుంటుందని హరీశ్ రావత్ అన్నారు. తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చి పార్టీ చీఫ్ సోనియాగాంధీతో ఈ విషయమై చర్చించారు. ‘ఇంతకాలం పంజాబ్ వ్యవహారాలు చూశా. ఇకపైనా చూడమంటే చూస్తా. అధిష్టానానిదే తుది నిర్ణయం’ అని రావత్ వ్యాఖ్యానించారు. సిద్ధూ వ్యాఖ్యలపైనా రావత్ స్పందించారు. ‘సిద్ధూ ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నారో కనుక్కుంటా. రాష్ట్ర అధ్యక్షులది నిర్ణయాత్మక పాత్ర కానపుడు ఇంకెవరి నిర్ణయాలను అమలుచేస్తారు? ’ అని రావత్ అన్నారు. మరోవైపు, కశ్మీర్, పాక్ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారు మల్వీందర్ సింగ్ ఇకపై ఆ పదవిలో కొనసాగబోనని చెప్పారు. సలహాలు ఇవ్వడం ఆపేస్తే మంచిదని రావత్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం మల్వీందర్ తప్పుకోవడం గమనార్హం. -
పంజాబ్ రాజకీయ సంక్షోభం కొలిక్కి
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య సయోధ్య కుదరకపోయినప్పటికీ అమరీందర్ ఒక మెట్టు దిగారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా తమందరికీ ఆమోదయోగ్యమేనని అమరీందర్ శనివారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇష్టానికి వ్యతిరేకంగా నవజోత్ సింగ్ సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ హరీశ్ రావత్ చండీగఢ్ వెళ్లారు. రావత్‌తో సమావేశానంతరం అమరీందర్ సింగ్ సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనంటూ ప్రకటన విడుదల చేశారు. అమరీందర్ వ్యక్తం చేసిన కొన్ని అంశాల్ని సోనియా దృష్టికి తీసుకువెళతానని రావత్ హామీ ఇచ్చినట్టు సీఎం సన్నిహితులు తెలిపారు. తనకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు, విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు సిద్ధూని కలవబోనని అమరీందర్ రావత్‌కి చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వరస సమావేశాలతో సిద్ధూ బిజీ సిద్ధూని పంజాబ్ పీసీసీ అ«ధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన రోజంతా బిజీ బిజీగా గడిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం అమరీందర్‌కు విధేయులైన నాయకుల్ని కలుసుకొని మంతనాలు సాగించారు. కెప్టెన్ సాబ్ కీలక ప్రకటన చేశారు : రావత్ అధినేత్రి సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ ముఖ్యమంత్రి అమరీందర్ çకీలకమైన ప్రకటన చేశారని హరీష్ రావత్ అన్నారు. బయట జరుగుతున్న చర్చల్లో చాలా అంశాలు అవాస్తవాలని తనకు అర్థమైందని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో సోనియా నిర్ణయాన్ని తాను కూడా పూర్తిగా గౌరవిస్తానంటూ ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్ హైకమాండ్ రాంగ్ సిగ్నల్?
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తెరదించేందుకు అధిష్టానం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులోభాగంగా ఎన్నికలకు కెప్టెన్ సారథ్యం వహిస్తారని, సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి వంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ గురువారం ఇచ్చిన స్నిగల్ పరిస్థితిని చక్కదిద్దకపోగా, మరింత ఆందోళనలకు కారణమైంది. కెప్టెన్ అమరీందర్‌పై సిద్ధూ అసంతృప్తి, తిరుగుబాటు శైలిని చూసి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకున్న హైకమాండ్ ప్లాన్ క్యాంపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. సిద్ధూ, కెప్టెన్ తమకు అనుకూలంగా ఉన్న మంత్రులు, శాసనసభ్యులతో క్యాంపు సమావేశాలు జరిపారు. నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలో సోనియాగాంధీని కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధూ అంతకుముందు జూన్ 30 న ఢిల్లీకి వచ్చి ప్రియాంకా గాంధీని కలిశారు. అదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం పార్టీ అధినేత్రితో భేటీ అయ్యారు. సోనియాతో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ పాల్గొన్నారు. కాగా సిద్ధూ సోనియాగాంధీని కలిసే ముందే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ పార్టీ అధినేత్రికి ఒక లేఖ పంపించారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కెప్టెన్, సిద్ధూలు కలిసి పనిచేయగల శాంతి సూత్రాన్ని కేంద్ర నాయకత్వం రూపొందిస్తోందని రావత్ అభిప్రాయపడ్డారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన రావత్ ‘నేను పంజాబ్‌లో పార్టీకి సంబంధించి నివేదికను సమర్పించడానికి పార్టీ అ«ధినేత్రిని కలిశాను. పంజాబ్ కాంగ్రెస్ విషయంలో పార్టీ అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయం గురించి నాకు సమాచారం వచ్చిన వెంటనే, మీ అందరికీ చెబుతాను’అని అన్నారు. అంతేగాక సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేస్తున్నారంటూ తను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. కాగా, పంజాబ్‌లో సిద్ధూ, ఆయన ప్రత్యర్థి శిబిరం మధ్య పోస్టర్ల యుద్ధం మొదలైంది. సిద్ధూ మద్దతుదారులు అమృత్సర్, లూధియానాతో సహా పంజాబ్‌లోని పలు చోట్ల వేసిన పోస్టర్లలో లూధియానాలో కొన్ని పోస్టర్లను చింపేశారు. పార్టీ తీసుకొనే కొన్ని నిర్ణయాలపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాలకు హరీష్ రావత్ తెరదించారు. ఈ విషయంలో కెప్టెన్‌కి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తామని రావత్ అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడైన ఎంపీ, సీనియర్ నేత మనీష్ తివారీ కూడా ఈ వివాదంలో తనదైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సామాజిక సమూహాల మధ్య సమతుల్యతను కాపాడటం ముఖ్యమని, సమానత్వం సామాజిక న్యాయానికి పునాది అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో సిక్కులు 57.75 శాతం, హిందువులు 38.49 శాతం, దళితులు 31.94 శాతం ఉన్నారని తెలిపారు. లోక్‌సభ సభ్యుడు మనీష్ తివారీ తన ట్వీట్లో కాంగ్రెస్ పంజాబ్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్‌ను ట్యాగ్ చేశారు. దీంతో సిద్ధూకి చెక్ పెట్టేలా సీఎం అమరీందర్‌కు అనుకూలంగా తివారీ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు. -
సయోధ్య సాధ్యమేనా..?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసమ్మతికి చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహ రచన పూర్తి చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను హైకమాండ్ సిద్ధం చేసింది. అందులో భాగంగా పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ పోరాడనున్నట్లు ఆయన గురువారం స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవజోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించవచ్చని హరీష్ రావత్ సూచించారు. గతంలో సిద్ధూ, అమరీందర్ సింగ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాటల యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించేందుకు పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ పంజాబ్‌లో పర్యటించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి నివేదికను హైకమాండ్‌కు సమర్పించింది. అనంతరం ఇరువురు నాయకులు పార్టీ పెద్దలతో వేరువేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 2022 అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పోరాడనుండగా, అదే సమయంలో నవజోత్ సింగ్ సిద్ధూకు కూడా పూర్తి గౌరవం ఇచ్చేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడం ఎంత అవసరమో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్ నాయకులను కాపాడటం కూడా అంతే ముఖ్యమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే నవజోత్‌సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు త్వరలో కీలక ప్రకటన జరగవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఫార్ములా సిద్ధం చేసిందని సమాచారం. ఒకవేళ నవజోత్‌సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడైతే, ఇద్దరు లేదా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే యోచనలో ఉంది. అదే సమయంలో ఇటీవల నవజోత్ సింగ్ సిద్దూ చేసిన ట్వీట్ పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో అమరీందర్, సిద్ధూల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సిద్ధూని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా చేయడంవల్ల పరిస్థితి ఇప్పుడు చల్లబడినప్పటికీ, రాబోయే రోజుల్లో గొడవ మరింత ముదిరే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల తర్వాత సిద్ధూ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నందున అమరీందర్ విధేయులు ఎమ్మెల్యేలుగా గెలవాలని ఆయన కోరుకొనే పరిస్థితి ఉండదని తెలిపారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో తమ విధేయులకు ఎక్కువ టికెట్లు కోరుతూ ఎవరికి వారు పోటీపడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ పంజాబ్‌లో సిద్ధూకి ఉన్న ప్రజాదరణ కారణంగా ఆయనను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్ ముందు నెలకొంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి రిస్క్ చేయదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం సిద్ధూపై దృష్టి సారించినందుకు వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలని హైకమాండ్ యోచిస్తోంది. -
బహుళ ప్రయోజనాల పోలవరం
న్యూఢిల్లీ, సాక్షి: రబీతో పాటు సాధారణ పంటల నీటి అవసరాలను తీర్చడం, సాగు, తాగునీటి వంటి ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చేపట్టినట్టుగా సీడబ్ల్యూసీ పేర్కొందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి హరీశ్ రావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యామ్నాయ డిజైన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా పరిశీలించినట్లు తెలి పారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ఈ ప్రతిపాదన రూపొందించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఇటు సాంకేతికంగా అటు ఆర్థికంగానూ అది సాధ్యం కాదనే నిర్ణయానికొచ్చింది. గోదావరి నదిపై వరుసగా బ్యారేజీలు నిర్మిం చాలంటూ ఆయన చేసిన ప్రతిపాదనే, ఎంపీ పాల్వా యి గోవర్ధన్‌రెడ్డి ద్వారా జల వనరుల మంత్రిత్వ శాఖకు కూడా అందింది. ఈ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ పరిశీలించింది..’ అని రావత్ చెప్పారు. బ్యారేజీలనేవి నదిలో నీరు అందుబాటులో ఉన్నప్పుడు పరిమితంగా నిల్వ చేసేందుకు ఉపయోగపడే మళ్లింపు నిర్మాణాలుగా సీడబ్ల్యూసీ అభిప్రాయపడినట్లు తెలిపారు.