బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దల్(సెక్యులర్) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సోమవారం లేఖ రాశారు. కేరళలోని కాసరగాడ్ జిల్లాలో కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడాన్ని అడ్డుకోవాలని ఆ లేఖలో కోరారు. వాటి పేర్లను మార్చినప్పటికి అర్థం మారదని, పాత పేర్లతోనే వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘కేరళలో నివసిస్తున్న కన్నడిగుల సంప్రదాయాలను కాపాడటం కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రుల బాధ్యత.
కన్నడ గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చినప్పటికి వాటి అర్థం మాత్రం మారదు. అందుకని, వాటి పేర్లను మార్చకుండా.. పాత కన్నడ పేర్లను కొనసాగించాలని కోరుకుంటున్నాను. కాసరగాడ్ భాషా సామరస్యానికి నిదర్శనంగా ఉంది. అక్కడ కన్నడ, మలయాళం మాట్లాడే ప్రజలు సమాన సంఖ్యలో ఉన్నప్పటికి సామరస్యంగా జీవిస్తున్నారు. భాషా ప్రాతిపదికన వాళ్లు ఎప్పుడూ గొడవలు పడలేదు. అలాంటి సామరస్యాన్ని భవిష్యత్తులో కూడా కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment