న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాను స్వార్థపరుడిని కాదని, తన దృష్టి దేశ అభివృద్ధిపైనే ఉందని అన్నారు. తాను దృష్టి కేవలం సొంత రాష్ట్రం కర్ణాటకపైన లేదని, మొత్తం భారత్ దేశం అంతటా అభివృద్ది చెందాలని ఉన్నట్లు తెలిపారు. ఆయన భారీ పరిశ్రమల శాఖమంత్రిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీ కర్ణాటకలో తన ఫ్యాక్టరీ పెట్టాలని ఆసక్తి చూపుతుందా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై స్పందించారు.
‘‘ టెస్లా వంటి కంపెనీని కర్ణాటకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే నా ప్రాధ్యాన్యత కేవలం కర్ణాటకకు పరిమితం కాదు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అభివృద్ధి. దాని ప్రకారమే పని చేస్తాం. నేను అంత స్వార్థపరుడిని కాదు. దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తా’’ అని హెచ్‌డీ కుమార స్వామి అన్నారు.
నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా ప్రమాస్వీకారం చేసిన సందర్భంగా టెస్లా సీఈఓ ఇలాన్ మాస్క్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తన కంపెనీలు ఇండియాలో పని చేయాలని ఎదురుచూస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
ఇక.. బీజేపీ కూటమిలో భాగంగా కుమార స్వామి జేడీఎస్ పార్టీ రెండు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కుమారస్వామి కేంద్రమంతి పదవి దక్కించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్డీయే కూటమి పార్టీలు 28 స్థానాలకు గాను 19 సీట్లతో విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment