ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ముంబైతోపాటు పక్కనే ఉండే థానే, పాల్ఘర్, రాయ్ గడ్ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. నడుములోతు నీళ్లలో పలువురు ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కేవలం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. దీంతో భారత వాతావరణ శాఖ ముంబై,, థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ము, న్సిపల్ పాఠశాలలతోపాటు కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
#WATCH | Maharashtra: The traffic slows down on Western Express Highway near Vile Parle as heavy rain lashes Mumbai city. pic.twitter.com/aAzQaayTqO
— ANI (@ANI) July 8, 2024
భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, కుర్లా–విక్రోలీ, బంధూప్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. డోంబివిలీ స్టేషన్‌లో ప్రజలు నీట మునిగిన ట్రాక్‌లపై రైళ్ల కోసం వేచి ఉన్నారు.
వర్లీ, బుంటారా భవన్, కుర్లా ఈస్ట్, ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతం, దాదర్, విద్యావిహార్ రైల్వే స్టేషన్‌లలో నీరు నిలిచిపోయింది. కాగా ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్‌లలో ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ లోకల్ రైలు సేవలను ఉపయోగిస్తుంటారు.
'బెస్ట్' బస్ ట్రాన్స్ పోర్ట్ సైతం భారీ వర్షాల కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బస్సులను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక జాబితాను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక థానే, వసాయ్ (పాల్ఘర్), మహద్ (రాయ్ గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సంగ్లీ, సటారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ లలో వరద సహాయ చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం మోహరించింది. ముంబైలోని అంధేరీలో మూడు బృందాలతోపాటు నాగ్ పూర్ లో అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది.
ఒక్క రోజు వర్షానికే ముంబై వణికిపోగా.. వచ్చే మూడు రోజులపాటు ముంబైతోపాటు మహారాష్ర్టలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 4.4 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment