న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపడానికి రైతులకు అనుమతి లభించింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడు నెలలకు పైగా ఉద్యమిస్తున్న రైతులు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సమీపంలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలకు అనుమతి కోరగా... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సింఘు బార్డర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. టిక్రి బార్డర్ వద్ద కూడా సెక్యూరిటీ పెంచారు. రోడ్డు మీద మేకులు పర్చడమే కాక ముళ్ల కంచె కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ ఏక్తా మోర్చా సభ్యులు మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నుంచి కిసాన్ పార్లమెంట్ ప్రారంభం అవుతుంది. వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు ప్రతి రోజు 200 మంది రైతులు పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేస్తారు. మా అంతిమ లక్ష్యం నూతన రైతు చట్టాలను రద్దు చేయడమే’’ అని తెలిపారు.
మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. నేడు ప్రధానంగా ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదన్న కేంద్రం సమాధానంపై ప్రతిపక్షాల నోటీసులు ఇచ్చాయి. పెగాసెస్ వ్యవహారం పార్లమెంట్‌ను మరోసారి కుదిపేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment