ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరోసారి ఎదురు దెబ్బతగిలింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎయిరిండియా విమానాల రాకపోకలను డిసెంబరు 3 వరకు హాంకాంగ్ నిషేధించింది. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానాలను నిషేధించడం ఇది ఐదోసారి.
గత వారం ఎయిరిండియాలో ప్రయాణించిన కొంత మంది ప్రయాణికులకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని శుక్రవారం అధికారులు ధృవీకరించారు. భారత్ నుంచి హాంకాంగ్‌కు వచ్చే వారు ప్రయాణం చేయడానికి 72 గంటల ముందు కరోనా టెస్ట్ చేసుకోవాలి. నెగటివ్ అని నిర్ధారించిన సర్టిఫికెట్‌ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే జూలైలో హాంకాంగ్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణీకులందరూ విమానాశ్రయంలో దిగిన వెంటనే కోవిడ్-19 పరీక్ష చేసుకోవాలి. తాజాగా మరోసారి ఎయిరిండియా ప్రయాణీకులకు కరోనా నిర్ధారణ కావడంతో అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. (చదవండి: అలయెన్స్ ఎయిర్‌కు తొలి మహిళా సీఈవో)
ఇది ఐదో సారి
ఎయిరిండియా ఢిల్లీ-హాంకాంగ్ విమానాలను ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 వరకు, సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 3 వరకు, అక్టోబరు 17 నుంచి అక్టోబరు 30 వరకు నిషేధించగా, రెండవసారి ముంబై-హాంకాంగ్ సర్వీస్‌లను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 వరకు నిషేధించారు. గత వారం ఎయిరిండియాలో ప్రయాణించిన కొంత మంది ప్రయాణికులకు కొవిడ్-19 పాజిటివ్ రావడంతో హాంకాంగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌కు నవంబరు 20 నుంచి డిసెంబరు 3 వరకు నిషేధించారని, ఈ రోజల్లో హాంకాంగ్‌కు ఎటువంటి విమానాలను షెడ్యూల్ చేయలేదని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రయాణానికి కరోనా టెస్ట్ మస్ట్...
హాంకాంగ్ ప్రభుత్వ నియమాల ప్రకారం భారతదేశంతో పాటు, బంగ్లాదేశ్, ఇథియోపియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, కజకిస్థాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, రష్యా, దక్షిణాఫ్రికా, యుకె, అమెరికా ప్రయాణీకులందరికీ విమానం ప్రయాణానికి ముందు కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ క్రమంలో ఆయా సంస్థలు తప్పనిసరిగా ప్రయాణికుల కరోనా సోకలేదని నిర్ధారించిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వాలి.కాగా భారతదేశంలో కరోనా మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు. మే నుంచి వందే భారత్ మిషన్ కింద విమానయాన సంస్థలకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. జూలై నుంచి ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటువంటి ఒప్పందాలను భారత్ సుమారు 20 దేశాలతో చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment