పట్నా: ‘‘వైద్యో నారాయణో హరిః’’ అన్నారు. ఓ వైపు కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే కొంతమంది వైద్య సిబ్బంది మాత్రం రోగుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ ఆసుపత్రి సిబ్బంది మహిళ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్లోకల్ హాస్పిటల్ వైద్యులు, మరో ఇద్దరు సిబ్బంది లైంగిక వేదింపులకు పాల్పడినట్లు సదరు మహిళ పేర్కొన్నారు. నగరంలోని గ్లోకల్, మాయాగంజ్ ఆసుపత్రి సిబ్బంది తన భర్తకు చికిత్స అందించడానికి నిరాకరించారని 12 నిమిషాల వీడియోలో పేర్కొంది.
‘‘నేను, నా భర్త నోయిడాలో ఉంటాం. హోలి పండుగ జరుపుకోవడానికి బిహార్ వచ్చాం. ఏప్రిల్ 9న నా భర్త అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన జ్వరం వచ్చింది. దాంతో రెండుసార్లు కరోనా టెస్ట్ చేయిస్తే నెగెటివ్ వచ్చింది. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ కోసం ప్రయత్నిస్తే.. నోయిడాలోని ఓ వైద్యుడు సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. స్కానింగ్‌లో ఊపిరితిత్తులు 60శాతం దెబ్బతిన్నాయని తేలింది. మరుసటి రోజు నా భర్త, నా తల్లిని భాగల్‌పూర్ ఆసుపత్రిలో చేర్పించాం. నా తల్లి పరిస్థితి బాగుంది. కానీ ఆ సమయంలో నా భర్త మాట్లాడలేపోయారు.
ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆక్సిజన్ అందించడానికి కూడా నిరాకరించారు. బ్లాక్ మార్కెట్‌లో ఆక్సిజన్ కొన్నా ఫలితం దక్కలేదు. గ్లోకల్ ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ జ్యోతి కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. చున్నీ పట్టుకుని లాగుతూ వికృతంగా నవ్వాడు. ఆ సమయంలో నాకు భయం వేసింది. కానీ నా భర్త గురించిన ఆలోచనే ఉంది. మా అమ్మ, భర్త ఉన్నారు కదా అని ధైర్యం చెప్పుకొన్నాను. నిజానికి ఆసుపత్రి సిబ్బంది కనీసం మంచంపై బెడ్ షీట్స్ మార్చడానికి అనుమతించ లేదు. కోవిడ్-19 చికిత్స కోసం ఉపయోగించే రెమ్‌డెసివిర్ మందును వృథా చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నా భర్త ప్రాణాలు కోల్పోయారు ’’ అని ఆమె తన ఆవేదన వెళ్లగక్కింది.
కాగా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కరోనా వల్ల ప్రభావితమైన రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,000 కేసులు నమోదు కాగా, 67 మంది మరణించారు. ఇప్పటి వరకు బిహార్‌లో 5.91 లక్షల కేసులు నమోదు కాగా..4.77 లక్షల మంది కోలుకోగా.. 3,282 మంది మరణించారు. ఇక దేశంలో 2.27 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా..1.87 కోట్ల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోవిడ కారణంగా 2.46 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
(చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!)
Comments
Please login to add a commentAdd a comment