సాక్షి, ముంబై: వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా బాబా సంస్థాన్‌కు కానుకలు రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం వచ్చింది. బాబా ఆలయం ఆవరణలో, సమాధి మందిరంలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను సాయి సంస్థాన్ పదాధికారులు బుధవారం లెక్కించారు. అందులో నగదు, బంగారు, వెండి కానుకల రూపంలో ఆలయానికి మొత్తం రూ.6.68 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో రూ.26.22 లక్షలు విలువచేసే వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.1.07 లక్షలు విలువచేసే వెండి నగలున్నాయి. అయితే షిర్డీ పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో పోగైన నగదు, అన్‌లైన్‌లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.
లాక్‌డౌన్‌తో భారీగా పడిపోయిన ఆదాయం..
క్రిస్మస్‌తోపాటు థర్టీఫస్ట్ డిసెంబర్, నూతన సంవత్సరం ఇలా వరుసగా వచ్చిన సెలవుల కారణంగా షిర్డీ పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ ఆంక్షలు, ఆలయ దర్శన వేళలు కుదించినప్పటికీ పది రోజుల్లో భక్తులు పెద్దసంఖ్యలోనే బాబాను దర్శించుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్ వల్ల అనేక నెలలు షిర్డీసాయి ఆలయం మూసి ఉంచారు. దీంతో బాబా ఆలయానికి కానుకల రూపంలో లభించే ఆదాయానికి భారీగా గండిపడింది. కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో 2021 అక్టోబరు ఏడో తేదీ నుంచి ఆలయాన్ని తిరిగి తెరిచారు.
చదవండి: Covid-19: ప్రముఖ ఆస్పత్రిలో 61 మంది డాక్టర్లకు కరోనా
దీంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. కానీ కోవిడ్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తొలుత రోజుకు 12 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అనుమతి నిషేధించారు. కానీ ఈ సంఖ్య పెంచాలని బాబా ఆలయ సంస్ధాన్‌పై భక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో పెరుగుతున్న భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని రోజుకు 25 వేల మంది భక్తులను అనుమతించసాగారు. దీంతో హుండీలో భక్తులు సమర్పించుకుంటున్న కానుకలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా వచ్చిన సెలవుల వల్ల నవంబర్ 24 నుంచి జనవరి 4వ తేదీ వరకు భక్తులు బాబాకు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు.
ఇలా పది రోజుల్లో మొత్తం రూ.6.68 కోట్ల మేర విరాళాలు సమకూరాయని ఆలయ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు ఆదాయంతో పోలిస్తే ఈ విరాళాలు తక్కువే అని చెప్పారు. ఒక పక్క కోవిడ్ ఆంక్షలు, దర్శన వేళలు కుదించడం, మరోపక్క రోడ్డు, రైలు రవాణ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో షిర్డీకి వచ్చే భక్తుల తాకిడి సగానికి తగ్గిపోయింది. గతంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో బాబాకు కానుకల రూపంలో సుమారు రూ.10–12 కోట్లమేర ఆదాయం వచ్చేది. ఇప్పుడు సగానికి పడిపోయిందని వారు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment