shirdi sai temple
-
షిర్డీ ఆలయానికి భారీ విరాళాలు.. రూ.6.68 కోట్ల ఆదాయం
సాక్షి, ముంబై: వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా బాబా సంస్థాన్‌కు కానుకలు రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం వచ్చింది. బాబా ఆలయం ఆవరణలో, సమాధి మందిరంలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను సాయి సంస్థాన్ పదాధికారులు బుధవారం లెక్కించారు. అందులో నగదు, బంగారు, వెండి కానుకల రూపంలో ఆలయానికి మొత్తం రూ.6.68 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో రూ.26.22 లక్షలు విలువచేసే వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.1.07 లక్షలు విలువచేసే వెండి నగలున్నాయి. అయితే షిర్డీ పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో పోగైన నగదు, అన్లైన్లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్‌తో భారీగా పడిపోయిన ఆదాయం.. క్రిస్మస్‌తోపాటు థర్టీఫస్ట్ డిసెంబర్, నూతన సంవత్సరం ఇలా వరుసగా వచ్చిన సెలవుల కారణంగా షిర్డీ పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ ఆంక్షలు, ఆలయ దర్శన వేళలు కుదించినప్పటికీ పది రోజుల్లో భక్తులు పెద్దసంఖ్యలోనే బాబాను దర్శించుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల అనేక నెలలు షిర్డీసాయి ఆలయం మూసి ఉంచారు. దీంతో బాబా ఆలయానికి కానుకల రూపంలో లభించే ఆదాయానికి భారీగా గండిపడింది. కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో 2021 అక్టోబరు ఏడో తేదీ నుంచి ఆలయాన్ని తిరిగి తెరిచారు. చదవండి: Covid-19: ప్రముఖ ఆస్పత్రిలో 61 మంది డాక్టర్లకు కరోనా దీంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. కానీ కోవిడ్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తొలుత రోజుకు 12 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అనుమతి నిషేధించారు. కానీ ఈ సంఖ్య పెంచాలని బాబా ఆలయ సంస్ధాన్‌పై భక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో పెరుగుతున్న భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని రోజుకు 25 వేల మంది భక్తులను అనుమతించసాగారు. దీంతో హుండీలో భక్తులు సమర్పించుకుంటున్న కానుకలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా వచ్చిన సెలవుల వల్ల నవంబర్ 24 నుంచి జనవరి 4వ తేదీ వరకు భక్తులు బాబాకు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఇలా పది రోజుల్లో మొత్తం రూ.6.68 కోట్ల మేర విరాళాలు సమకూరాయని ఆలయ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు ఆదాయంతో పోలిస్తే ఈ విరాళాలు తక్కువే అని చెప్పారు. ఒక పక్క కోవిడ్ ఆంక్షలు, దర్శన వేళలు కుదించడం, మరోపక్క రోడ్డు, రైలు రవాణ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో షిర్డీకి వచ్చే భక్తుల తాకిడి సగానికి తగ్గిపోయింది. గతంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో బాబాకు కానుకల రూపంలో సుమారు రూ.10–12 కోట్లమేర ఆదాయం వచ్చేది. ఇప్పుడు సగానికి పడిపోయిందని వారు అంటున్నారు. -
షిర్డీసాయికి రికార్డు స్థాయి ఆదాయం
షిర్డి: షిరిడీ సాయి ఆలయానికి కానుకల రూపంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గురు పౌర్ణిమ సందర్బంగా భక్తులు కానుకల రూపంలో రూ. 5.52 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత ఏడాది గురు పౌర్ణిమ వేడుకలకు వచ్చిన ఆదాయం రూ.1.40 కోట్ల మాత్రమేనని వివరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10 తేదీ వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులు రూ.2.94 కోట్లు నగదు రూపంలో వచ్చినట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(సీఈవో) రూబల్ అగర్వాల్ తెలిపారు. విరాళాల ద్వారా రూ. 1.40 కోట్లు, ఆన్‌లైన్‌ద్వారా రూ.52.48 లక్షలు సమకూరాయని వివరించారు. దీంతో పాటు రూ. 61.4 లక్షల విలువైన 2.233 గ్రాముల బంగారు, 8 కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా అందజేశారని తెలిపారు. మలేషియా, అమెరికా, లండన్, జపాన్, దుబాయ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి వచ్చిన భక్తులు రూ. 9.30 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కానుకగా సమర్పించారని అన్నారు. గురుపౌర్ణిమ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు మూడు లక్షల మంది భక్తులు షిర్డీకి వచ్చారని ఆయన తెలిపారు. -
న్యూజెర్సీలో ఘనంగా సాయి పాదుక యాత్ర ముగింపు
సౌత్ ప్లయిన్ఫీల్డ్ (న్యూజెర్సీ): అమెరికాలో షిరిడీ సాయి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడీ నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ పీఠం స్థలసేవ పేరుతో న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర 43 రాష్ట్రాలలోని పలు నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ న్యూజెర్సీ చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు భక్త జనం నీరాజనం పట్టింది. ఐదు మైళ్లపాటు జరిగిన ఈ ముగింపు యాత్రలో 100కు పైగా కార్లలో భక్తులు పాల్గొన్నారు. యాత్ర పొడవునా సాయి నాథుడికి నీరాజనాలు పట్టారు. తొలుత న్యూజెర్సీలోని మేడిచెర్ల మురళీ కృష్ణ నివాసంలో సాయి పాదుక పూజ నిర్వహించారు. అనంతరం పల్లకీ దాత కనికిచెర్ల లీలా కృష్ణ నివాసం లో ఆఖరి పాదుకా పూజ నిర్వహించి ఆ తర్వాత అక్కడ నుండి ప్రారంభమైన యాత్రకు సాయి నామ జపంతో భక్తజనం జేజేలు పలికారు. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా దీనికి తమ వంతు సహకారం అందించింది. పాదుక యాత్ర ప్రత్యేకత.. సాయి దత్త పీఠం స్థల సేవకు విరాళాల నిమిత్తం ఈ పాదుకయాత్ర చేపట్టింది. ఆ షిరిడీ నాథుడి పాదాలనే భక్తుల చెంతకు తీసుకెళ్లి అమెరికాలో షిరిడీ నిర్మాణ లక్ష్యాన్ని వివరించింది. పీఠం ప్రధాన నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండేళ్లపాటు అమెరికాలో 43 రాష్ట్రాల్లో 75000 మైళ్ల దూరం ఈ యాత్ర సాగింది. దాదాపు 2వేల ఇళ్లకు చేరుకుని సాయి పాదుక పూజ చేయడంతో పాటు 150 కి పైగా దేవాలయాలను చుట్టివచ్చింది. వందకు పైగా సమన్వయకర్తలు, 500మందికి పైగా స్వచ్చంద సాయి సేవకులు ఈ యాత్రలో తమ విలువైన సేవలు అందిస్తే 1,11,111 మందికి పైగా సాయి భక్తులను పలకరించింది. ఇంటింటికి పిలిచి సాయి పాదుక పూజను చేయించుకుని తరించారు. వైభవంగా సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం భారతీయ సంస్కృతి, సంప్రదయాలను ఆధ్యాత్మిక ప్రవాహాన్ని అమెరికాలో కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. భావి తరాలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రబోదిస్తున్న గురుకులం.. రెండేళ్లు పూర్తి చేసుకుంది. గురుకులంలో చిన్నారులకు శ్లోకాలు, పద్యాలతో పాటు భారతీయ కళలను ఇక్కడ నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులంలో చేర్పించి వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు. చిన్నారులు చేసిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ఔరా అనిపించాయి. -
షిర్డీ సాయి హుండీలో భారీగా పెద్దనోట్లు
సాక్షి, ముంబై: దేశంలోని సంపన్న దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన షిర్డీ సాయిబాబా దేవాలయానికి నోట్ల రద్దు ప్రకటన అనంతరం భక్తుల నుంచి భారీ ఎత్తున కానుకలు రావడం విశేషం. గత 24 రోజులలో హూండీలో భక్తులు ఏకంగా రూ. 9.50 కోట్ల బాబాకు కానుకలుగా సమర్పించడం విశేషం. వీటిలో పెద్ద ఎత్తున పాత నోట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రూ. 1.27 కోట్ల విలువ చేసే పాత రూ. 1000 నోట్లుండగా సుమారు రూ. కోటికిపైగా విలువ చేసే పాత రూ. 500 నోట్లు కానుకల ద్వారా అందినట్టు సాయిబాబా ట్రస్టు పేర్కొంది.