మెడికల్‌ కాలేజీలకు ఐటీ భారీ షాక్‌  | Income Tax Raids underway in Medical Colleges in Karnataka | Sakshi

మెడికల్‌ కాలేజీలకు ఐటీ భారీ షాక్‌ 

Feb 18 2021 1:16 PM | Updated on Feb 18 2021 1:44 PM

Income Tax Raids underway in Medical Colleges in Karnataka - Sakshi

కోవిడ్‌ చికిత్సలకు సంబంధించి నకిలీ బిల్లుల్ని సృష్టించి రూ.కోట్లలో వసూళ్లు చేశారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో దాడులు చేసినట్లు సమాచారం.

సాక్షి, బెంగళూరు: కర్ణాటక వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో, బడా ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖాధికారులు బుధవారం ఉదయం నుంచి కొరడా ఝుళిపించారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కోవిడ్‌ చికిత్సలకు సంబంధించి నకిలీ బిల్లుల్ని సృష్టించి రూ.కోట్లలో వసూళ్లు చేశారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో దాడులు చేసినట్లు సమాచారం. బెంగళూరు, మంగళూరు, దావణగెరె, తుమకూరు తదితర నగరాల్లో 20 వైద్య కాలేజీలకు సంబంధించి 103 చోట్ల వాటి అధిపతుల నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు చేయగా, సుమారు రూ.5 కోట్ల నగదు లభించినట్లు సమాచారం.  ఐటీ దాడులు గురువారం కూడా కొనసాగుతున్నాయి.

బెంగళూరులో పలు చోట్ల..
బెంగళూరులోని సప్తగిరి మెడికల్‌ కాలేజీతో పాటు చైర్మన్‌ దయానంద్‌ ఇంట్లో, బీజీఎస్‌ మెడికల్‌ కాలేజీ లో సోదాలు సాగాయి. బీజీఎస్‌ను నిర్వహిస్తున్న ఆదిచుంచునగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీని ఐటీ అధికారులు కలిసి పలు విషయాలపై ఆరా తీశారు. బెంగళూరు శివార్లలోని ఆకాశ్‌ మెడికల్‌ కాలేజీ పాలనా మండలి సభ్యుల ఇళ్లలో తనిఖీలు చేసి, కాలేజీ చైర్మన్‌ మునిరాజును విచారించారు.

మంగళూరులో..
మంగళూరు జిల్లా కేంద్రంలోని దేరళకట్టిలో ఉన్న కణచూరు విద్యాసంస్థ, ఏజే మెడికల్‌ కాలేజీ, యెనెపోయె మెడికల్‌ కాలేజీ, తుమకూరులోని శ్రీదేవి మెడికల్‌ కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. మంగళూరులోని కణచూరు విద్యాసంస్థ చైర్మన్‌ మోను, ఏజే మెడికల్‌ కాలేజీ చైర్మన్‌ ఏజే శెట్టి, యెనెపోయె విద్యాసంస్థ యజమాని మాలిక్‌ అబ్దుల్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.  


మంగళూరులో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన ఓ ఇల్లు  

తుమకూరు, దావణగెరెల్లో..
తుమకూరు జిల్లా కేంద్రంలో బీజేపీ నేత ఎంఆర్‌ హులినాయకర్‌కు చెందిన శ్రీదేవి మెడికల్‌ కాలేజీలో రికార్డులను పరిశీలించారు. ఆయన ఇల్లు, ఆఫీసులో సోదాలు సాగాయి. తుమకూరు నగర వ్యాప్తంగా 10 చోట్ల తనిఖీలు చేశారు. దావణగెరెలో మాజీ మంత్రి శామనూరు శివశంకరప్పకు చెందిన జేజేఎం, ఎస్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ, బాపూజీ డెంటల్‌ కాలేజీలో తనిఖీలు జరిగాయి. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరించారు. సోదాలు, సేకరించిన సమాచారం పరిశీలన కొనసాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement