
న్యూఢిల్లీ: ఇకపై ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని విభజన గాయాల సంస్మరణ దినంగా పాటించనున్నట్లు ప్రధాని∙మోదీ శనివారం ప్రకటించారు. దేశ విభజన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఆ సమయంలో ప్రజలు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారని, ఎన్నెన్నో త్యాగాలు చేశారని, వాటిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 14ను విభజన గాయాల సంస్మరణ దినం జరుపుకుందామని పిలుపునిచ్చారు. దేశ విభజన సృష్టించిన మతిలేని ద్వేషం, హింస కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక విభజనలు తొలగిపోవాలని, సామరస్యం పెంపొందాలని, ఏకత్వం అనే స్ఫూర్తి బలోపేతం కావాలని, మానవ సాధికారత పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఆశయాలను విభజన అకృత్యాల సంస్మరణ దినం మనకు గుర్తు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్
నుంచి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆగస్టు 14ను విభజన గాయాల సంస్మరణ దినంగా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానమంత్రి నిర్ణయాన్ని హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. దేశ విభజన గాయాన్ని, సన్నిహితులను కోల్పోయామని వారి ఆవేదనను మాటల్లో వర్ణించలేమని అన్నారు. దేశ విభజన సమయంలో ఎందరో భరతమాత బిడ్డలు తమ జీవితాలను త్యాగం చేశారని కేంద్ర హోంశాఖ శ్లాఘించింది. బ్రిటీష్ వలస పాలకుల దుర్నీతి కారణంగా 1947లో భారతదేశం రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్ రెండు ముక్కలై పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఆగస్టు 14న పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం రాగా, భారత్ ఆగస్టు 15న వలస పాలకుల చెర నుంచి విముక్తి పొందింది. భారతదేశ విభజన మానవ చరిత్రలోనే అతిపెద్ద వలసలకు బీజం చేసింది. ఈ విభజన వల్ల 2 కోట్ల మంది ప్రభావితమైనట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment