Independence Day 2021
-
ఈ వెనుకచూపు ఎందుకు?
‘కాలం మారుతుంది... రేగిన గాయాలను మాన్పుతుంది’ అన్నారో కవి. కానీ, కాలగతిలో 75 ఏళ్ళు ప్రయాణించిన తరువాత, దేశం – కాలం – తరం మారిన తరువాత... మానుతున్న పాత గాయాన్ని మళ్ళీ రేపే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఏమనాలి? పాత చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవడానికే ఆ పని చేస్తున్నామని అంటే ఎలా నమ్మాలి? బ్రిటీషు పాలనలోని విశాల భారతదేశం 1947 ఆగస్టు 14న విభజనకు గురై, స్వతంత్ర పాకిస్తాన్, భారతదేశాలుగా విడిపోయిన క్షణాలు నేటికీ ఓ మానని గాయం. మతం, ప్రాంతం లాంటి అనేక అంశాలతో కొన్ని లక్షల మంది హింసకు గురై, నిర్వాసితులుగా విభజన రేఖకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళిన సందర్భం. మానవ చరిత్రలోనే మహా విషాదం. దాన్ని స్మరించుకోవడానికి, ఇక నుంచి ప్రతి ఆగస్టు 14వ తేదీని ‘దేశ విభజన బీభత్సాల సంస్మరణ దినం’గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 14న వరుస పోస్టులు, ఆ వెంటనే హడావిడిగా గెజిట్‌లో ప్రకటన, మరునాడు స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఆయన చేసిన ఆ ప్రస్తావన అనేక భయాలు, అనుమానాలకు తావిస్తోంది. భారత ఉపఖండ చరిత్రలో ఎన్నడూ ఎరుగని మానవ విషాదం– దేశ విభజన ఘట్టం. అందుకు అప్పటి రాజకీయ అవకాశవాదం, మత విద్వేషాల లాంటి అనేక కారణాలున్నాయి. నాటి బ్రిటీషు ప్రభుత్వానికీ ఆ నేరంలో భాగస్వామ్యం ఉంది. భౌగోళిక విభజన జరిగింది 1947 ఆగస్టు 14నే అయినప్పటికీ, అంతకు ముందు, ఆ తరువాత అనేక వారాలు మనుషుల్లో మానసిక విభజన కలిగించిన కష్టం, నష్టం అపారం. దాదాపు 20 లక్షల మంది దారుణంగా హతమయ్యారు. సుమారు లక్ష మంది అతివలు అపహరణకు గురై, అత్యాచారం పాలబడ్డారు. కోటిన్నర మందికి పైగా స్త్రీలు, పురుషులు, పిల్లలు వలస బాట పట్టారు. అనధికారిక లెక్కల్లో ఈ అంకెలు ఇంకా పెద్దవి. రిక్త హస్తాలతో దేశాన్ని విడిచిపోవాల్సిన బ్రిటీషువారు మతాల వారీ మానసిక విభజనతో భారత ఉపఖండాన్ని రక్తసిక్తం చేసి, గుండెల్లో చేసిన గాయం అది. సోదర భారతీయుల సంఘర్షణ... ముస్లిములపై – హిందువులు – సిక్కుల హింస... విభజన బాధిత పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లో దారుణ మారణకాండ... పురిటిగడ్డను వదిలేసి పొట్ట చేతపట్టుకొని కోట్లాది జనం వలస ప్రయాణం... ఇలా ఆనాటి ఘట్టాలు నేటికీ విషాద జ్ఞాపకాలు. పాలకులు పైకి ఏవేవో వివరణలు ఇస్తున్నా, ఆ పాత గాయాలను ఏటా స్మరించుకోవాలనే ఆకస్మిక నిర్ణయం వెనుక కారణాలేమిటన్నది ఆలోచించాలి. సామ్రాజ్యవాదం, ఏకపక్షంగా సరిహద్దుల నిర్ణయం, దేశపటాల రూపకల్పన, అధికారం కోసం మతవిద్వేషాలకు బీజం వేయడం లాంటివి ఎంత చెడు చేస్తాయన్నది దేశ విభజన నేర్పిన పాఠం. ఆ గుణపాఠాలను భావితరాలకు తెలియచెబితే సరే. కానీ, ఒక వర్గం ప్రజలను బుజ్జగించడం కోసమే అప్పటి పార్టీల నేతలు దేశాన్ని చీల్చారనే తప్పుడు భావన కలిగిస్తేనే ఇబ్బంది. అలా చేస్తే, మనుషుల మధ్య అంతరాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన 74 ఏళ్ళ తర్వాత మోదీ అనూహ్యంగా దేశ విభజన గాయాల పల్లవిని ఎత్తుకోవడం ఆశ్చర్యమే. ఆగస్టు 14 దాయాది దేశమైన పాకిస్తాన్ ఆవిర్భావ దినమని తెలిసీ, ఆ రోజును ఇలా స్మరించుకోవాలని మన పాలకులు ప్రకటించడంలోని లోగుట్టు పెరుమాళ్ళకెరుక! విశాల భారతావని చరిత్రలో విభజన గాయాలే ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయో తెలీదు. మతపరమైన ద్విజాతి సిద్ధాంతంతో మొదలైన పాకిస్తాన్ చివరకు 1971లో మరోదేశం బంగ్లాదేశ్‌కు జన్మనివ్వడం చూశాం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామరస్యం, సర్వమత సహజీవనం నమ్మిన భారతావని అన్ని రంగాల్లో సాధించిన పురోగతీ చూస్తున్నాం. మరి ఇప్పుడీ వెనుకచూపులు ఎందుకు? రాజకీయ అనివార్యత లేకుండా పాలకులు ఇలాంటి విధాన ప్రకటనలు చేయడం అరుదు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఇది కొత్త ఎత్తుగడ అని విమర్శకుల వాదన. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీ మాటల గారడీ పని చేయని వేళ, యూపీలో వచ్చే ఎన్నికలు జాతి మనోగతానికి ఒక సూచిక. పొరపాటున అక్కడా చతికిలబడితే నాయకత్వానికి సవాలు ఎదురుకావచ్చు. ఆగుతున్న అసమ్మతి వరద తోసుకురావచ్చు. అందుకే, మతపరంగా దేశాన్ని చీల్చిన ఘటనను పదే పదే స్మరిస్తూ, ఒక వర్గం ఓట్లను సంఘటితం చేసుకోవడమే పాలకపక్షం అసలు ఉద్దేశమని విపక్షాల ఆరోపణ. పురాస్మరణ కావాలి. చరిత్ర నేర్పిన పాఠాల పునఃస్మరణా కావాలి. కానీ అవి ఏ ప్రయోజనాలకన్నది పురోగామివాదులు, బుద్ధిజీవుల ప్రశ్న. ఎద్దు పుండు కాకికి రుచి. అలా మానుతున్న గాయాలను ఓట్ల కోసం మళ్ళీ ఎవరు కెలికినా అది సరికాదు. దాటి వచ్చిన గతాన్ని తవ్వి తలపోసుకోవడం వల్ల విద్వేషాలు పెరుగుతాయే తప్ప, విశాల సౌహార్దం వీలుకాదు. వివిధ మతాల మధ్య, విభజనతో ఏర్పడ్డ దాయాది దేశంతోనూ స్నేహం, సామరస్యం పెరగడానికి ఈ సరికొత్త స్మారక దినాలు ప్రతిబంధకమయ్యే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే, ఆ పాపం ఎవరిది? ‘గత జల సేతుబంధనం’పై కన్నా మళ్ళీ ఆ గాయాలు రేగకుండా, ఆగామి భవితవ్యంపై పాలకులు శక్తియుక్తుల్ని పెడితే నవీన భారతావనికి మేలు చేసినవారవుతారు. కొత్త తరం కోరుకోనేది అదే! -
వర్జీనియాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్ట్ 15న అమెరికా వర్జీనియాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ప్రతి నిధులు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా అధ్యక్షురాలు సుధారాణి కొండపు మాట్లాడుతూ.. ఇక్కడ పుట్టి పెరిగిన మన భావితరాలు ఆనందించేలా మన భారతీయతను ప్రతిబింబించే జెండా రంగులలోని కాషాయరంగు ,తెలుపు, ఆకుపచ్చ వర్ణాల అలంకరణతో పార్క్ ఏరియా కళకళలాడుతుందని అన్నారు. పిల్లలకు చాక్లెట్లను, బహుమతులను పంచుతూ తమ కార్యవర్గసభ్యులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, ట్రస్టీలు, గోపాల్ నున్న , వెంకట్ కొండపోలు కార్యవర్గసభ్యులు సతీష్ వడ్డి, దుర్గాప్రసాద్ గంగిశెట్టి , పార్ధ బైరెడ్డి ,హరీష్ కొండమడుగు , రామచంద్ర ఏరుబండి , రాజు గొడుగు, సతీష్ సుంకనపల్లి,రమణారెడ్డి, ఉదయ్ , సాయి, రంగా, కౌశిక్ , విష్ణు, వినీత్ , కృష్ణకిశోర్, సంధ్య, రాధిక, అవని, లావణ్య, సుప్రజ ,విజయ,హరిత తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ప్రజలు నిశ్శబ్దాన్ని వీడాలి: సోనియా
న్యూఢిల్లీ: ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం పాపమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రమంటే అర్ధం తెలుసుకోవాలని ప్రజలను కోరారు. దేశ ప్రజాస్వామ్యానికి రిపేర్లు అవసరమన్నారు. 75వ స్వతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఒక ఆంగ్ల పత్రికలో రాసిన కథనంలో ఆమె తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం పార్లమెంట్‌పై దాడి చేసి, సాంప్రదాయాలను భంగపరిచి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తరుణంలో ప్రజలు స్వాతంత్య్రానికి నిజమైన అర్ధం తెలుసుకోవాన్నారు. మోదీ హయంలో జర్నలిస్టులకు, మేథావులకు, పార్లమెంటసభ్యులకు.. ఇలా ఎవరికీ వాక్స్వాతంత్య్రం లేదని ఆమె విమర్శించారు. ఆక్సిజన్‌కొరత, జీఎస్టీ తదితర అంశాలపై పార్లమెంట్లో అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే అవకాశమే ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి చేస్తున్న డ్యామేజీని రిపేరు చేయాలని, ఇందుకు అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొన్ని దశాబ్దాలుగా సాధించిన వృద్ధి మోదీ వల్ల కనుమరుగైందని ఆరోపించారు. ఏడేళ్లుగా చర్చల్లేకుండా చట్టాలు వస్తున్నాయని సోనియా వాపోయారు. దీనివల్ల పార్లమెంటు రబ్బరు స్టాంపుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం ముందుకురాలేదని విమర్శించారు. పలు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలను మోదీ ప్రభుత్వం దురి్వనియోగం చేస్తోందని సోనియా ఆరోపించారు. -
చేతలకు... ఇదే సరైన సమయం!
సమయం, సందర్భం ఏదైనా... దాన్ని దేశవాసులకు స్ఫూర్తిదాయక ప్రబోధమిచ్చే అవకాశంగా మలుచుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిట్ట. అది భారత స్వాతంత్య్ర దినం లాంటి కీలక సందర్భమైనప్పుడు ఇక వేరే చెప్పేదేముంది? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు నిండి, 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా, ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాక, మోదీ గంటన్నర సేపు చేసిన సుదీర్ఘ ప్రసంగం అందుకు తాజా మచ్చుతునక. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ దేశప్రగతికి బృహత్ ప్రణాళికను ఆయన ఏకరవు పెట్టారు. దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణకు ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలతో, అంటే కోటి కోట్లతో ‘ప్రధానమంత్రి గతిశక్తి ప్రణాళిక’ను చేపట్టనున్నట్టు భారీ ప్రకటన చేశారు. స్వతంత్ర భారతం శతవసంతాల గడప వద్దకు ప్రయాణించే రానున్న పాతికేళ్ళ కాలాన్ని ‘అమృత ఘడియలు’గా మోదీ అభివర్ణించారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దేశ వాసుందరూ కలసికట్టుగా కృషిచేస్తే, దేశం సర్వతోముఖాభివృద్ధి దిశగా పురోగమిస్తుందని ప్రబో ధించారు. పాతికేళ్ళలో ఇంధన రంగంలో దేశం సొంత కాళ్ళ మీద నిలబడడం.., పట్టణ – గ్రామీణ, స్త్రీ–పురుష భేదాలను రూపుమాపి సమాజంలోని ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడం లాంటి లక్ష్యాలెన్నో నిర్దేశించారు. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలు మోదీ మార్కు ప్రసంగ శైలి. 2014లో ‘సబ్ కా సాథ్... సబ్ కా వికాస్’ (అందరి అభివృద్ధి) అని నినదించిన ప్రధాని, అయిదేళ్ళ తరువాత 2019 మే 26న ‘సబ్ కా విశ్వాస్’ (అందరి విశ్వాసం) కూడా దానికి కలిపారు. ఇప్పుడు లక్ష్యసాధనకు ‘సబ్ కా ప్రయాస్’ (అందరి కృషి) అవసరమని కొత్త నినాదం అందించారు. ఎర్రకోటపై నుంచి స్వాతంత్య్రదిన ప్రసంగం చేయడం మోదీకి ఇది 8వ సారి. ఎనిమిదేళ్ళుగా ఆయన తమ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను ఉపన్యాసాల్లో సమర్పిస్తూనే ఉన్నారు. ఆ ప్రసంగవత్ భవిష్యత్ దర్శనం ఏ మేరకు వాస్తవరూపం ధరించిందన్నది వేరే కథ. నిరుటి ప్రసంగంలో ‘ఆత్మ నిర్భర్’ (స్వయం సమృద్ధ) ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా ప్రవచించారు మోదీ. ఈసారి ‘ప్రపంచ శ్రేణి’, ‘భావితరం’ ఆర్థిక లక్ష్యాల వైపు దృష్టి సారించమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మౌలిక వసతులు, ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా ఆయన ప్రణాళిక ఉద్దేశాలు మంచివే. కానీ, ఆ లక్ష్యాలను సాధించే నిర్దిష్టమైన వ్యూహరచన ఏమిటన్నదే ప్రశ్న. 2017 నాటి ప్రసంగంలో 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవమైన 2022 కల్లా ‘నవీన భారత’ నిర్మాణాన్ని మోదీ లక్షించారు. తీరా 75వ ఏట అడుగిడిన ఈ ఏటి ప్రసంగంలోనేమో దాన్ని పాతికేళ్ళు జరిపి, శతవసంతాలు నిండే 2047 నాటికి ‘నవీన భారత’ నిర్మాణమన్నారు. కరోనా దేశ ప్రగతిని ఇంత వెనక్కి నెట్టిందా అన్నది బేతాళ ప్రశ్న. మోదీ మాటల్లో కొన్ని వివాదాస్పద అంశాలూ లేకపోలేదు. రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు తోడ్పడే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను కొనసాగిస్తామన్నారు. దేశ విభజన వేళ పడ్డ బాధలను గుర్తు చేసుకుంటూ, ఇకపై ఏటా ఆగస్టు 14వ తేదీని (పాకిస్తాన్ ఏర్పడ్డ రోజు) ‘విభజన విషాద స్మృతి దినం’గా జరపాలన్న మోదీ ప్రభుత్వ తాజా నిర్ణయం వివాదాస్పదమే. ఆ నిర్ణయం దశాబ్దాల నాటి పాత గాయాలను మళ్ళీ రేపి, అప్పటి విభేదాలకు ప్రాణం పోసే ప్రమాదం ఉంది. ఇక, తాజాగా ఆదివారం మోదీ ప్రకటించిన పథకాల్లో అనేకం పాత ప్రకటనలకే కొత్త రూపాలనే విమర్శను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఏకంగా రెండేళ్ళ క్రితం నాటివి. 2019లో ఎర్రకోటపై నుంచే ఆధునిక వసతి సౌకర్యాల కోసం కోటి కోట్ల ప్రణాళికను మోదీ ప్రకటించారు. దానినే నిరుడు ‘జాతీయ మౌలికసదుపాయాల పైప్‌లైన్ ప్రాజెక్ట్’ (ఎన్ఐపీ) పేరిట రూ. 110 లక్షల కోట్ల ప్రాజెక్టుగా ప్రస్తావించారు. వాటికే ఈ ఏడాది కొత్త రూపంగా కోటి కోట్ల ‘గతిశక్తి ప్రణాళిక’. ఇక, సైనిక స్కూళ్ళలో బాలికలకు ప్రవేశం రెండేళ్ళ క్రితమే రక్షణ శాఖ చెప్పినదైతే, ‘జాతీయ ఉదజని కార్యక్రమం’ ఈ ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించినది. రేషన్ షాపుల్లో – బడుల్లో విటమిన్లతో బలోపేతమైన బియ్యం పంపిణీ లాంటివి 2019లో అప్పటి ఆహార మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రకటించినది. ఇవన్నీ తవ్వితీసి, మోదీది పాత పథకాల మాటల మోళీ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ మాటెలా ఉన్నా, మోదీ గత ఏడాది లానే ఈసారీ ‘తీవ్రవాదానికీ, విస్తరణ వాదానికీ’ భారత్ వ్యతిరేకమంటూ పాక్, చైనాలపై పరోక్ష విమర్శకే పరిమితమయ్యారు. అంతర్జా తీయ సంబంధాలు, పొరుగున అఫ్గాన్ తాజా పరిణామాలతో తలెత్తిన సవాళ్ళపై పెదవి విప్పలేదు. ఏమైనా, అధికారంలో ఉండగా ప్రతి క్షణం విలువైనదేనని మోదీ గ్రహించినట్టున్నారు. మిగిలిన మూడేళ్ళలోనే ప్రజల్ని మాటలతో ఉత్తేజితుల్ని చేసి దేశాన్ని ముందుకు నడిపిస్తూ, బీజేపీని మళ్ళీ గద్దెపై నిలపాల్సింది తానే అన్న స్పృహ ఆయనకుంది. అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఆయన వదిలి పెట్టనిది అందుకే. మొత్తానికి, శత వసంత స్వతంత్ర భారతావనికి మోదీ స్ఫూర్తిదాయకమైన విజన్ అందించారు. ఆ స్వప్నం సాకారం కావాలంటే, ఆయనే అన్నట్టు అందరినీ కలుపుకొనిపోయే ‘సబ్కా ప్రయాస్’ అవసరం. ముందుగా స్వపక్ష, విపక్షీయులందరినీ కలుపుకొని పోవాల్సింది పాలకుడిగా ఆయనే! అంకెల మోళీతో పాటు ఆచరణాత్మక వ్యూహం కూడా అవసరం. అప్పుడే... మాటలే కాదు, చేతలూ కోటలు దాటగలుగుతాయి. మోదీ మాటల్లోనే చెప్పాలంటే – అందుకు ‘యహీ సమయ్ హై, సహీ సమయ్ హై, అన్మోల్ సమయ్ హై’ (ఇదే సమయం, సరైన సమయం, విలువైన సమయం)! -
మాట నిలబెట్టుకున్న ప్రధాని.. పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముందుగా తాను చెప్పినట్లుగానే.. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి ఐస్ క్రీం తిన్నారు. స్వాంత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిన్న ఎర్రకోటకు ఆథ్లెట్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అనంతరం మోదీ తన నివాసంలో ఒలింపిక్స్ అథ్లెట్స్ కి ఆతిథ్యం ఇచ్చారు. వారు చేసిన కృషిని అభినందించారు.. వారి విజయాలను ప్రశంసించారు. భారత అథ్లెట్స్ కి ఒలింపిక్స్ కి వెళ్లడానికి మందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాగా.. ఆ సమయంలో వారందరి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను మోదీ తెలుసుకున్నారు. పతకంతో తిరిగి వచ్చాక ఐస్‌క్రీమ్ తిందామని సింధుతో చెప్పిన ఆయన.. దాని ప్రకారమే నేడు సింధు తో కలిసి ప్రధాని ఐస్‌క్రీమ్ తిన్నారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో గెలుచుకున్న బ్రాంజ్ మెడల్ తో పాటు.. గతంలో రియో ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని కూడా ఈ సందర్భంగా సింధు తన వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధరించి.. ప్రధాని మోదీతో కలిసి ఆమె ఫోటో దిగింది. @Pvsindhu1 getting treated to an ice-cream by PM Modi at 7LKM #Olympics2021 pic.twitter.com/CZX6c8X114 — Megha Prasad (@MeghaSPrasad) August 16, 2021 -
మోదీ, కేసీఆర్‌లను ఓడిస్తేనే స్వాతంత్య్రం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం లో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించినప్పుడే రైతులు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అవుతుందని, ఈ ఇద్దరినీ గద్దెదించేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాం«దీభవన్‌లో ఆదివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, దేశంలోని వెనుకబడిన వర్గాలన్నింటికీ హక్కులు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తే, మోదీ ఫాసిస్టు ప్రభుత్వం మతాల పేరిట ప్రజలను విభజిస్తూ దేశాన్ని ప్రయోగశాలగా మార్చిందని విమర్శించారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్ భేటీ అయ్యారు. -
వచ్చే 25 ఏళ్లలో బీజేపీ లక్ష్యమదే: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాబోయే 25 ఏళ్లలో మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా భారత్‌ను విశ్వగురువుగా చేసే ఏకైక లక్ష్యం తో ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్‌కుమార్ అన్నారు. ఈ తరుణంలో ప్రతి తెలంగాణ వాది బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దాని ద్వారానే మనం నిర్దేశించుకున్న శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమని గుర్తించాలన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సంజయ్ మాట్లాడుతూ, ఈ లక్ష్యసాధనలో దేశప్రజలంతా భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, సినీ నటి విజయశాంతి, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి, గీతామూర్తి, జి.విజయరామారావు, గూడూరు నారాయణరెడ్డి, ఎస్. ప్రకాశ్‌రెడ్డి, బండా కార్తీకరెడ్డి పాల్గొన్నారు. -
దళితబంధు మరో సామాజిక ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: దళితబంధు మరో సామాజిక ఉద్యమమని, ఈ కార్యక్రమం అమలు కోసం సీఎం కేసీఆర్ సంకల్పాన్ని బలపరిచి మనమంతా ముందుకు సాగాలని టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు (కేకే) పిలుపునిచ్చారు. తెలంగాణలో దళితబంధు అనే కొత్త ఉద్యమం తీసుకొచ్చారని, దీని అమలు కోసం ఎన్నో అవరోధాలు, కష్టాలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ ఉక్కు సంకల్పంతో దళితబంధు అమలవుతుందని, ఆయన నాయకత్వంలో చేసినంత అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం 200 ఏళ్లు బ్రిటిష్ వారిపై పోరాడామని అనేక మంది ప్రాణత్యాగం ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
జనం గుండెల్లో కట్టబొమ్మన్ ముద్ర
కొరుక్కుపేట: 200 ఏళ్లు దాటినా.. జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని హైదరాబాద్ చెందిన రచయిత్రి డాక్టర్ సగిలి సుధారాణి వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో నెలనెలా వెన్నెల నెట్ ఇంట్లో కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. దక్షిణాది తెలుగు సంస్థానాలు అనే అంశంపై రచయిత్రి డాక్టర్ సగిలి సుధారాణి వక్తగా పాల్గొని ప్రసంగించారు. దక్షిణాది తెలుగు సంస్థానాలు పాలించిన చోట నాటి రాజభవనాలు చాలావరకు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, ముఖ్యంగా చాళుక్య, చోళ, శాతవాహనులు, విజయనగరరాజుల ప్రతినిధులుగా సామంతులు, నాయకరాజులు ఇప్పటి తమిళప్రాంతాన్ని ఏలారని తెలిపారు. వీరి ప్రభావం సింహళానికి విస్తరించిందని చెప్పారు. ఆంగ్లేయులకాలంలో భారతదేశంలో వ్యాపారానికి వచ్చి, మనదేశాన్నే ఆక్రమించుకొని, మనవారిపైనే పన్నులు విధించారు. ఆ సమయంలో బ్రిటీష్ వారిపై దేశంలో అనేక చోట్ల తిరుగుబాట్లు జరిగాయన్నారు. భారతదేశ తొట్టతొలి స్వాతంత్య్ర సమర యోధురాలు రాణి వేలు నాచ్చియార్’, ఈమె రామనాథపురం కోటకు యువరాణి, శివగంగ సీమకు రారాణి అని తెలిపారు. అలాగే తొలి స్వాతంత్య్ర సమరయోధుడు (1755-1801) కట్టబొమ్మన్ తెలుగువాడు కావడం గొప్ప విషయం అన్నారు. వీరి వంశం పోరాటానికి పెట్టింది పేరని, కట్టబొమ్మన పూర్వులు పరాయి పాలనను ఎదురొడ్డి నిలిచారన్నారు. భవిష్యత్తు తరాల వారికి ఈ స్ఫూర్తిని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఆమె కొనియాడారు. 200 ఏళ్ల క్రితం ఉరితీయబడ్డా.. జనం గుండెల్లో చిరంజీవిగా ఉన్న కట్టబొమ్మన్నకు సమున్నత గౌరవ స్థానాన్ని తమిళనాడు ప్రభుత్వం అందించి, ఆ మహనీయునికి స్మృతిచిహ్నంగా స్థూపాన్ని కైయత్తార్ ప్రతిష్టించిందన్నారు. -
ఉత్పాదక రంగంలో అగ్రగామిగా భారత్
సాక్షి, హైదరాబాద్: ఉత్పాదక రంగంలో భారత్ అగ్రగామి కానుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) అమిత్ జింగ్రాన్ చెప్పారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్లలో సూదుల నుంచి విమానాల వరకు, హైడెల్ పవర్ నుంచి సోలార్ పవర్ వరకు, సైకిళ్ల నుంచి లగ్జరీ కార్ల వరకు తయారు చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు. రైల్వేలు, రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో పట్టాలు మొదలైన వాటిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించిందని తెలిపారు. భారత్ అభివృద్ధిలో ఎస్బీఐ కీలక ప్రాత పోషిస్తోందని పేర్కొన్నారు. -
హరియాణా స్వాతంత్య్ర వేడుకల్లో ‘బతుకమ్మ’
సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో బతుకమ్మ సాంస్కృతిక ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు అతిథిగా హాజరైన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జాతీయ జెండాను ఆవిష్కరించి కళాకారులను అభినందించారు. -
‘పతకాలే కాదు హృదయాలు గెలిచారు’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ సారి పతక విజేతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి అద్భుతమైన ప్రదర్శన దేశంలోని యువతకు స్ఫూర్తినిచి్చందని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల ప్రదర్శన చూసి భారత్ గరి్వస్తోంది. అథ్లెట్లు పతకాలే కాదు హృదయాల్ని గెలిచారు. యువతకు ప్రేరణగా నిలిచారు. ఇక్కడికొచి్చన అతిథులు, దేశంలోని ప్రజలంతా ఈ సంద ర్భంగా వారికి జేజేలు పలకాలి’ అని మోదీ అన్నారు. ఈ వేడుకల్లో పతక విజేతలు నీరజ్ చోప్రా, సింధు, మీరాబాయి, లవ్లీనా, రవి, బజరంగ్, పురుషుల హాకీ జట్టు సభ్యులతో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇతర ప్లేయర్లు పాల్గొన్నారు. -
నిర్దిష్ట చర్చ లేకుండా చట్టాలా!?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను రూపొందిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల రూపకల్పన ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని చెప్పారు. పార్లమెంట్లో నిర్దిష్ట చర్చ జరగకుండానే చట్టాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వాటిలో స్పష్టత లేకుండా పోతోందని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై, అవి ప్రజలపై చూపించే ప్రభావంపై గతంలో పార్లమెంట్లో ఎన్నో చర్చలు, సంవాదాలు జరిగేవని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ పరిజ్ఞానం కలిగిన వారు చట్టసభలో లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పార్లమెంట్లో చట్టాలను రూపొందించే సమయంలో విస్తృతమైన చర్చ జరిగితే కోర్టులు వాటి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాయని, తద్వారా న్యాయ వివాదాలు తగ్గుతాయని సూచించారు. తొలి పార్లమెంట్లో చాలామంది న్యాయవాదులు ఉన్నారు. మహత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితర నేతలు న్యాయవాదులే. న్యాయవాదులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని దేశానికి అందించాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా చర్చ లేకుండానే కీలకమైన బిల్లులను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అందరి కృషితో లక్ష్యాలు అందుకోగలం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రదిన శతాబ్ది వేడుకల సమయానికి భారత్‌ను ఒక ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజలు చేసే కృషి అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రస్తవిస్తూ. ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు మార్గదర్శకాలను సూచిస్తూ, కొత్త అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ మధ్య మధ్యలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి సగర్వంగా చాటుతూ ప్రధాని ప్రసంగం సాగింది. 75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వేదికగా వరసగా ఎనిమిదోసారి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన కోసం రూ.100 లక్షల కోట్లతో గతి శక్తి అనే భారీ పథకాన్ని ప్రకటించారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ దేశ భద్రత అంశంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనుకాడమని చెప్పారు. సంప్రదాయ కుర్తా, నీలం రంగు జాకెట్, కాషాయ రంగు తలపాగా చుట్టుకున్న ప్రధాని దాదాపుగా 90 నిముషాల సేపు ప్రసంగించారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదానికి కొత్తగా సబ్కా ప్రయాస్ (సమష్టి కృషి) అన్న దానిని చేర్చారు. భారత్ నిర్దేశించుకున్న 100శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రజలందరి కృషి అత్యంత అవసరమని గట్టిగా చెప్పారు. అందుకే రాబోయే 25 ఏళ్లు అమృత కాలంగా ప్రధాని అభివరి్ణంచారు. దేశ స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మహాత్మా గాం«దీ, సుభాష్ చంద్రబోసు, భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బి.ఆర్. అంబేద్కర్ వంటి నేతలందరినీ ప్రధాని పేరు పేరునా స్మరించారు. యువత ఏదైనా చేయగలదు నేటి యువతరంపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. నేటి తరం ఏదైనా చేయగలదు, ప్రతీ లక్ష్యాన్ని సాధించగలదు అన్నారు. ‘‘నాకు ఈ దేశ యువతపై విశ్వాసం ఉంది. దేశ సోదరీమణులపై నమ్మకం ఉంది. రైతులను, వృత్తి నిపుణులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. మన కలలు, ఆశయాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. మనలో ఉన్న ఉత్సాహం, మనలో ఉన్న సోదరభావమే మన బలం’’ అని మోదీ అన్నారు. ‘‘ఇదే సరైన సమయం. దేశానికి అత్యంత కీలకమైన సమయం. అసంఖ్యాకమైన ఆయుధాలు మనదగ్గరున్నాయి. దేశభక్తి ప్రతీ చోటా పొంగిపొరలుతోంది. అందరూ కదిలి రండి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి. దేశ భవితను సమున్నతంగా రెపరెపలాడించండి’’ అని మోదీ ఒక కవితతో తన ప్రసంగాన్ని ముగించారు. మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు ► దేశం నలుమూలలకి రైలు కనెక్టివిటీ పెరిగేలా ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో 75 కొత్త వందేభారత్ రైళ్లు ప్రవేశ పెడతాం. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ కలిపేలా రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తాం. ► వ్యవసాయం రంగంలో 80శాతానికిపైగా ఉన్న చిన్న రైతులే దేశానికి గర్వకారణం. వారికి అండగా ఉండడానికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 10 కోట్ల మంది రైతులకు ఇప్పటివరకు రూ.1.5 లక్షల కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ► 2024 నాటికి గ్రామీణ ప్రజలందరి ఇళ్లకి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రారంభించి జాతీయ జల జీవన్ మిషన్‌లో భాగంగా గత రెండేళ్లలో 4.5 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చాం ► దేశ విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని ఆగస్టు 14న విభజన గాయాల స్మృతి దినంగా పాటిద్దామని పిలుపునిచ్చారు. ► టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాక రెపరెపలాడింది. నేటి యువత మన దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ► ఏడేళ్ల క్రితం భారత్ 800 కోట్ల డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేది. అదే ఇప్పుడు 300 కోట్ల డాలర్ల విలువైన మొబైల్స్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దిగుమతుల్ని గణనీయంగా తగ్గించింది. ► కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తల కృషి అత్యంత గర్వకారణ. రెండు మేకిన్ ఇండియా వ్యాక్సిన్లు అభివృద్ధి చేయగలిగాం. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ► జమ్మూ కశీ్మర్లో నియోజకవర్గాల పునరి్వభజన కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి ► కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలన కోసమేనని, విద్యాబోధన వారి మాతృభాషలో చేయడానికే ప్రోత్సాహం ► అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ అనవసర జోక్యాలు తగ్గించాం. పన్నుల్లో సంస్కరణలు తీసుకువచ్చి వాణిజ్యాన్ని సులభతరం చేశాము. రూ.100 లక్షల కోట్లతో గతిశక్తి భారత్ ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 100 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రాజెక్టును ప్రకటించారు. ‘‘అత్యంత ఆధునిక సదుపాయాల కల్పనలో సంపూర్ణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం త్వరలోనే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళికను ప్రారంభించబోతున్నాం. రూ.100 లక్షల కోట్లతో ప్రారంభించే ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి’’ అని ప్రధాని వివరించారు. సైనిక స్కూళ్లలో అమ్మాయిలకూ ప్రవేశం దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లలో అబ్బాయిలకే ప్రవేశం ఉండేది. అయితే అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు కూడా అన్ని సైనిక స్కూళ్లలో ప్రవేశానికి అనుమతిలిస్తున్నాం.. అని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లు ఉండగా, రెండున్నరేళ్ల క్రితం మిజోరంలోని సైనిక స్కూలులో ప్రయోగాత్మకంగా అమ్మాయిలకి ప్రవేశం కలి్పంచారు. కాషాయ రంగు తలపాగాతో ప్రధాని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో రంగురంగుల ఆకర్షణీయమైన తలపాగాలు ధరించే సంప్రదాయా న్ని ప్రధాని మోదీ కొనసాగించారు. ఆదివారం ఆయన ఎర్రటి చారలు కలిగిన కాషాయరంగు తలపాగాతో ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రసంగించారు. సంపద్రాయ కుర్తా, చుడిదార్‌తో పాటు బ్లూ జాకెట్, ఉత్తరీయం వేసుకున్నారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతుల హబ్‌గా భారత్‌కు మార్చడానికి ప్రధానమంత్రి జాతీయ హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించారు. స్వతంత్ర భారతావని శతాబ్ది ఉత్సవాల సమయానికి ఇంధన రంగంలో స్వయంసమృద్ధిని సాధిస్తామని చెప్పారు. ఇది సాధించడానికి కృషి చేస్తామని త్రివర్ణ పతాకం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని ప్రధాని చెప్పారు. -
YS Jagan: మీ ప్రభుత్వం.. మీ సేవకుడిని
ప్రతి రూపాయీ బాధ్యతగా ఖర్చు కోవిడ్ వల్ల ప్రభుత్వానికి ఆశించిన రీతిలో ఆదాయం రాలేదు. వ్యయం మాత్రం అనుకోని విధంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితి ఒక కుటుంబానికి వస్తే ఎంతగా తల్లడిల్లుతుందో అర్థం చేసుకుని ప్రభుత్వం కష్టకాలంలో పేదలకు అండగా నిలిచింది. అవినీతి, వివక్షకు తావు లేని విధంగా ప్రతి ఒక్క రూపాయీ ప్రజలకే నేరుగా ఇచ్చాం. మన ప్రభుత్వం ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేస్తోంది. ఈ ప్రభుత్వం మీది. మీరిచ్చిన అధికారంతో నేను సేవకుడిగా మాత్రమే ఇక్కడ ఉన్నా. స్వాతంత్య్రం సిద్ధించిన 74 ఏళ్ల తరవాత కూడా కనిపిస్తున్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దేందుకే ఇక్కడ ఉన్నా. మార్పు మీరే చూడండి మన గ్రామం లేదా నగరంలో కేవలం ఈ 26 నెలల్లోనే ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి మీరే గమనించండి. సచివాలయాల్లో 500కి పైగా సేవలతో దేశంలో సరికొత్త విప్లవానికి నాంది పలికాం. 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు సచివాలయాల్లో కనిపిస్తున్నాయి. ఒక్క రూపాయి కూడా లంచాలకు తావులేకుండా ప్రతి నెల 1వతేదీన సూర్యోదయానికి ముందే తలుపు తట్టి మరీ 2.70 లక్షల మంది వలంటీర్లు ఇంటివద్దే పింఛన్లు అందచేస్తున్న వ్యవస్థ కేవలం మనకే సొంతం. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, చకచకా కడుతున్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, డిజిటల్ గ్రంథాలయాలు, ఇంగ్లిష్‌లో బోధించే ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లతో మన గ్రామాల స్వరూపాలు మారుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తన సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా తెలుసుకుని ఈ 26 నెలల పాలనలో రాష్ట్ర గతిని మార్చేలా నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మన రైతులు తమ రెక్కలకు మరింత బలం కావాలని కోరుకున్నారని, వెనకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలు మంచి భవిష్యత్తును, న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా కోసం తపించారని చెప్పారు. అక్కచెల్లెమ్మలు మహిళా సాధికారితను, వైద్యాన్ని ఒక హక్కుగా అందించాలని ప్రజలు కోరుకున్నారని తెలిపారు. మనిషిని మనిషిగా చూస్తూ సమన్యాయంతోపాటు లంచాలు లేని పారదర్శక వ్యవస్థ రావాలని ఆరాటపడ్డారన్నారు. ఇవన్నీ అందించటమే నిజమైన పరిపాలన, ప్రజాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి అర్థం అని విశ్వసిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పరేడ్‌ను వీక్షించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలివీ.. కొత్త లక్ష్యాలతో బాటలు వేద్దాం స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తై 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి పౌరుడికి నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నా. ఒక దేశాన్ని మరో దేశం.. ఒక జాతిని మరో జాతి... ఒక మనిషిని మరో మనిషి దోచుకోలేని వ్యవస్థ సాకారం కావాలని ఆనాడు స్వాతంత్య్ర సమర యోధులు కలలుగన్నారు. మన ప్రగతి, వెనుకబాటుతనం, మంచీచెడులపై చర్చ జరగాలి. లోపాలను సరిదిద్దుకునేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భం. ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు ఎగిరే ప్రతి జాతీయ జెండా ఘనమైన, పటిష్టమైన రేపటికి ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి. ప్రజలంతా మనల్ని మనం పరిపాలించుకునే స్వాతంత్య్రంతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణను కచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు చదువుకునే హక్కును ఆర్టికల్ 21–ఏ ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించినా ఒక పేద కుటుంబానికి అలాంటి పరిస్థితుల్ని కల్పించనంత కాలం ఆ హక్కు వల్ల ప్రయోజనం ఉండదు. హక్కుల ప్రకటన, అమలుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు గత 26 నెలలుగా ప్రతి ఒక్కటీ చేశాం. రైతు రెక్కలకు బలం.. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు ఆధారమైన వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి రైతు రెక్కలకు బలం చేకూర్చి అండగా నిలిచాం. ఈ 26 నెలల్లోనే వ్యవసాయానికి దాదాపు రూ.83 వేల కోట్లు వ్యయం చేశాం. 18.70 లక్షల మంది రైతులకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చేందుకు దాదాపు రూ.18,000 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్ల బలోపేతం కోసం మరో రూ.1700 కోట్లు వెచ్చించాం. 52.38 లక్షల మంది రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా దాదాపు రూ.17 వేల కోట్లు అందించగలిగాం. ఆర్బీకేల ఏర్పాటుతో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు రూ.3,788 కోట్లు అందించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 67.50 లక్షల మంది రైతులకు మరో రూ.1,261 కోట్లు ఖర్చు చేసి తోడుగా నిలబడ్డాం. రూ.రెండు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రూ.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ధాన్యం సేకరణ, కొనుగోళ్ల కోసం రూ.33 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. పత్తికి మరో రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.6,434 కోట్లు వ్యయం చేశాం. ఏ ఒక్క రైతన్నకూ ఇబ్బంది రాకూడదని తపించాం. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆకట్టుకున్న రైతు శకటం ప్రదర్శన గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలూ చెల్లించాం.. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.9000 కోట్ల ఉచిత విద్యుత్తు బకాయిలు, రూ.384 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే భరించి చిరునవ్వుతో రైతన్నలకు చెల్లించింది. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రక్రియకు నాంది పలుకుతూ రూ.1,039 కోట్ల చెల్లింపులు చేశాం. అమూల్ పాలవెల్లువ, వైఎస్సార్ జలకళ, ఆక్వా రైతుకు కరెంటు సబ్సిడీకి రూ.1,500 కోట్లు ఇచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ముందడుగు వేశాం. నవరత్నాల పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నాం. ఒక హక్కులా విద్య మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి ఎదిగేలా విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం. చదువుకోవటాన్ని ఒక హక్కులా చేశాం. నాడు – నేడు ద్వారా తొలి విడతలో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.3,669 కోట్లు వ్యయం చేశాం. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.1,300 కోట్లు ఖర్చు చేశాం. ఫలితంగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 36.89 లక్షల పిల్లలకు మేలు చేస్తూ మార్చిన మెనూ ద్వారా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందుకోసం ఏటా రూ.1,600 కోట్లు చిరునవ్వుతో ఖర్చు చేస్తున్నాం. సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30.16 లక్షల మందికి మేలు చేస్తూ ఏటా రూ. 1,800 కోట్లు వ్యయం చేస్తున్నాం. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్నాం. టీచర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాం. స్పెషలిస్ట్ టీచర్లతో బోధనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ స్కూళ్లను సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తున్నాం. ఫీజుల నియంత్రణతోపాటు విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన ద్వారా 100% ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రతి 3 నెలలకోసారి ఎటువంటి బకాయిలు లేకుండా తల్లుల ఖాతాలకే సొమ్మును జమ చేస్తున్నాం. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.5,573 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా 15.57 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఇప్పటివరకు రూ.2270 కోట్లు ఖర్చు చేశాం. పిల్లల చదువుల కోసం ఈ పథకాలకే దాదాపుగా రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దిన వేడుకలు: పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్ 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఖర్చు రూ.1,000 దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతో 2,434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోసం రూ. 3,900 కోట్లు వ్యయం చేశాం. ఆపరేషన్ తరవాత రోగి కోలుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నాం. 108, 104 సేవలకు అర్థం చెబుతూ ఏకంగా 1,068 వాహనాల్ని ప్రతి నియోజకవర్గానికీ పంపాం. పిల్లలు, పెద్దలందరికీ వర్తించేలా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయి. కోవిడ్‌పై యుద్ధంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తూ ఫోకస్డ్ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టాం. కోవిడ్‌కు ఉచితంగా వైద్యం అందిస్తూ పేదలకు అండగా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్ ఆసుపత్రులే ఉండగా కొత్తగా మరో 16 వైద్య బోధనాసుపత్రులను నిర్మిస్తున్నాం.జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించేందుకు వైద్య రంగంలో నాడు–నేడు అమలు చేస్తున్నాం. వీటికి రూ.16,300 కోట్లు వ్యయం చేస్తున్నాం. కోవిడ్ వల్ల తల్లితండ్రి ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్ చేసి వారి ఆలనా పాలనా చూసుకునే ఏర్పాట్లు చేసిన తొలి ప్రభుత్వం కూడా దేశంలో మనదే. మనిషిని బతికించాలనే ప్రతి ఒక్క ప్రయత్నాన్నీ మనసు పెట్టి చేసే ప్రభుత్వం మనది. మన కళ్లెదుటే ఉద్యోగాలు.. ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగులకు మేలు చేశాం. మన కళ్ల ఎదుటే దాదాపు 1.30 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీలో 58 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 2.70 లక్షల మంది మన కళ్లెదుటే వలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 95 వేల మందికిపైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా న్యాయం చేశాం. మరో 20 వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలిచ్చాం. ఇలా దాదాపు 6.03 లక్షల మంది ఉద్యోగులు మన కళ్లెదుట కనిపిస్తున్నారు. ఇందులోను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 75 శాతానికి పైగా ఉద్యోగాలు లభించాయని సగర్వంగా చెబుతున్నా. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రసంగిస్తున్న సీఎం ఆధునిక మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచే.. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న సంకల్పంతో కృషి చేస్తోంది. 44.50 లక్షల మంది తల్లులకు తమ పిల్లలను చదివించుకునేందుకు జగనన్న అమ్మ ఒడి ద్వారా రెండేళ్లలో రూ.13 వేల కోట్లు అందజేశాం. వైఎస్సార్ ఆసరా ద్వారా 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు లబ్ధి చేకూరింది. వైఎస్సార్ చేయూత ద్వారా 24.56 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.9,000 కోట్లు సాయం చేశాం. దీనికి తోడు బ్యాంకుల రుణ సదుపాయంతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో అనుసంధానం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్–జగనన్న కాలనీల ద్వారా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. గృహ నిర్మాణం ద్వారా దాదాపు 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి చేకూరుతోంది. తొలిదశలో 15.60 లక్షల గృహ నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇళ్ల ద్వారా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో దాదాపుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద ఉంచుతున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2,509 కోట్లు అందించాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 3.28 లక్షల మందికి రూ.982 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. పదవులు, పనుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్ పదవులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం కచ్చితంగా మహిళలకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది. దీనివల్ల ఇవాళ నామినేటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు, మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల్లో 50 శాతం మంది మహిళలే కనిపిస్తున్నారు. మహిళా రాజకీయ సాధికారతలో భాగంగా ఒక చెల్లిని హోంమంత్రిగా చేశాం. నెల క్రితం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో సగ భాగానికి మించి 58 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వడంతో పాటు సగం పదవులు మహిళలకు ఇచ్చామని సవినయంగా తెలియజేస్తున్నా. అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దిశ బిల్లు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దిశ యాప్‌లకు రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది. చేతల్లో సామాజిక న్యాయం.. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సోదర భావానికి(ఫ్రెటర్నిటీ) అర్థం చెబుతూ సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపాం. మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి 60 శాతం పదవులు ఇచ్చాం. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వం మనదే. అటు రాజ్యసభలోనూ, ఇటు కౌన్సిల్లోనూ సామాజిక న్యాయం విషయంలో మనం చేసినట్లుగా ఇంతకుముందు జరగలేదు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయటంతోపాటు ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల దిశగా అడుగులు వేశాం. బీసీలకు ప్రత్యేకించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మార్కెట్ యార్డుల ఛైర్మన్లు, దేవస్థానాల కమిటీల ఛైర్మన్లు, సభ్యులుగా ఈ రోజు పేద వర్గాలవారు సగభాగం కనిపిస్తున్నారని సగర్వంగా తెలియజేస్తున్నా. పెన్షన్లు పెంచాం.. వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత డబ్బులను ఈ నెలలోనే అందించబోతున్నాం. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉంటే మన ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్యను 61 లక్షలకు పెంచి ఇస్తున్నాం. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చిన పెన్షన్ సొమ్మును రూ.2,250కి పెంచింది కూడా మన ప్రభుత్వమే. గత సర్కారు హయాంలో నెలకు రూ.500 కోట్లు మాత్రమే ఉన్న పెన్షన్ బిల్లు నేడు రూ.1,500 కోట్లకు చేరిందని మీ బిడ్డగా సవినయంగా తెలియచేస్తున్నా. ఉద్యోగులకు రాబోయే రోజుల్లో మరికొన్ని.. ఉద్యోగుల జీతాల విషయానికి వస్తే.. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చాం. అంగన్వాడీల్లో పని చేస్తున్నవారికి, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, శానిటరీ వర్కర్లకు, హోంగార్డులకు, 104, 108 సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఇలా అనేక విభాగాల్లో చాలీ చాలని వేతనాలతో బతుకు బండి ఈడుస్తున్న 7,02,656 మందికి లబ్ధి చేకూరుస్తూ వేతనాలు పెంచాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా తీసుకొచ్చాం. ఉద్యోగులకు చేయాల్సినవి మరికొన్ని ఉన్నాయన్నది నాకు తెలుసు. వారందరికీ న్యాయం చేసేలా రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. -
టాలీవుడ్లో కొత్త రెపరెపలు!
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, కొత్త పోస్టర్లు, విడుదల తేదీల ప్రకటనలు.. ఇలా పలు అప్డేట్స్తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ రెపరెపలాడింది. ఆ అప్డేట్స్ విశేషాలు.. హిందీ హిట్ ‘అంధాధున్’ తెలుగులో ‘మ్యాస్ట్రో’గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్ జంటగా, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాస్ట్రో’ కొత్త పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇక కెరీర్లో తొలిసారి ‘లక్ష్య’ చిత్రంలో విలుకాడుగా కనిపించనున్నారు నాగశౌర్య. ఈ చిత్రం కొత్త పోస్టర్ రిలీజైంది. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మరోవైపు సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’, సుశాంత్ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ కొత్త పోస్టర్స్ వచ్చాయి. అలాగే జిల్లా కలెక్టర్ పంజా అభిరామ్‌గా థియేటర్స్‌లో చార్జ్ తీసుకోనున్నారు సాయిధరమ్ తేజ్. దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్న ‘రిపబ్లిక్’లో కలెక్టర్ అభిరామ్‌గా చేస్తున్నారు సాయితేజ్. జె.భగవాన్, జె. పుల్లారావు, జీ స్టూడియోస్, జేబీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 1న విడుదల కానుంది. ఇక తన కెరీర్లో తొలిసారిగా నిఖిల్ గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ‘గూఢచారి’, ‘ఎవరు’వంటి సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేసిన గ్యారీ బి.హెచ్ ఈ స్పై థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాకు కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మాత. ఇంకోవైపు గొడవలంటే భయపడే ఓ అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమకోసం విశాఖపట్నంలో ‘గల్లీరౌడీ’గా మారాడు. సందీప్ కిషనే ఈ వెండితెర గల్లీరౌడీ. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యానారాయణ నిర్మించిన ‘గల్లీరౌడీ’ చిత్రాన్ని సెప్టెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత జీవీ. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు కోన వెంకట్. ఇటు ఆది సాయి కుమార్ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు. వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ‘కిరాతక’, ‘బ్లాక్’ వంటి సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ తాజా చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. టీఎమ్‌టీ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను కల్యాణ్ జి. గోగణ డైరెక్ట్ చేస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తిరుమల్ రెడ్డి యెల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సత్యదేవ్;సాయిధరమ్ తేజ్; సందీప్ కిషన్, నేహాశెట్టి టాలీవుడ్లో తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సత్యదేవ్ ‘హబీబ్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తన కొడుకు కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన ఓ ఆర్మీ ఆఫీసర్ కథే ‘హబీబ్’. సత్యదేవ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జెన్నీఫర్ అల్ఫోన్స్ దర్శకురాలు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను హబీబ్ సఫీ, కోటి రావ్ నిర్మిస్తున్నారు. ఆది, పాయల్ రాజ్‌పుత్; సుధీర్‌బాబు, ఆనంది; సుశాంత్, మీనాక్షి; ఇటు ‘బుజ్జి.. ఇలారా’ చిత్రం కోసం సీఐ కేశవ్ నాయుడిగా చార్జ్ తీసుకున్నారు ధన్‌రాజ్. ఇందులో సునీల్ మరో హీరో. ‘గరుడవేగ’ అంజి డైరెక్షన్లో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రూపా జగదీష్ సమర్పణలో అగ్రహారం సంజీవరెడ్డి, నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక డా.మోహన్, నవీన్‌చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ ‘1997’. ఈ సినిమాలోని నవీన్‌చంద్ర లుక్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మీనాక్షీ రమావత్ ప్రొడ్యూసర్. ‘కోతికొమ్మచ్చి’ తర్వాత హీరో మేఘాంశ్ శ్రీహరి తాను నటించనున్న తర్వాతి సినిమాను తన తండ్రి, ప్రముఖ నటులు శ్రీహరి జయంతి సందర్భంగా ఆదివారం ప్రకటించారు. సి.కల్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘రాసి పెట్టుంటే’ టైటిల్‌ను ఖరారు చేశారు. నందు మల్లెల ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా ‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘గంధర్వ’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలయ్యాయి. అప్సర్ డైరెక్ట్ చేస్తున్న ‘గంధర్వ’ సినిమాను ఎమ్ఎన్ మధు నిర్మిస్తున్నారు. మరోవైపు ‘సింధూరపువ్వు’ రాంఖీ, హర్షిత్‌రెడ్డి, వికాస్ వశిష్ట, రాఖీ ప్రధాన పాత్రల్లో అమర్నాథ్ రెడ్డి గుంటక దర్శకత్వంలో ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ‘గగనవీధి’ సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు.1980 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరనే సందేశంతో వస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘1948: అఖండ భారత్’ సినిమా పోస్టర్స్, లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు. ‘ది మర్డర్ ఆఫ్ మహాత్మాగాంధీ’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో రఘునందన్, ఆర్యవర్ధన్‌రాజ్, శరద్ దద్భావల, ఇంతియాజ్, జెన్నీ, సమ్మెట గాంధీ ప్రధాన పాత్రధారులు. ఈశ్వర్ డి.బాబు దర్శకత్వంలో ఈ సినిమాను ఎమ్.వై. మహర్షి నిర్మించారు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది?, కోర్టులో గాడ్సే వాదనలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. ‘అజాద్ హింద్’ పేరుతో అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను ఓ ఫ్రాంచైజీలా నిర్మించనున్నట్లు వెల్లడించారు నిర్మాత విష్ణువర్ధన్. ఇందులో భాగంగా దుర్గా భాయ్ జీవితాన్ని ఫస్ట్ తెరకెక్కించనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘కల్కి’, ‘జాంబీరెడ్డి’ సినిమాలకు మాటలు అందించిన సయ్యద్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారనున్నారు. కోవిడ్ బ్రేక్ తర్వాత థియేటర్లు రీ ఓపెన్ అయి, వరుసగా సినిమాలు విడుదలవుతుంటే మరోవైపు నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్స్, కొత్త సినిమాల అప్డేట్స్తో టాలీవుడ్ కళకళలాడటం ఆనందించదగ్గ విషయం. -
దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్
దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి, సామాజిక వివక్ష నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా నేనే దళితబంధు పథకానికి రూపకల్పన చేసిన. అణగారిన దళితజనం స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహా సంకల్పానికి ఆచరణ రూపమే ‘దళిత బంధు ఉద్యమం’. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కొత్త జోనల్ విధానం మేరకు పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. ఆ ప్రక్రియ తదనంతరం ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. సాక్షి, హైదరాబాద్: ‘‘దళితులను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తేనుంది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్, మెడికల్ షాపులు, హాస్పిటళ్లు, హాస్టళ్లు, సరుకుల సరఫరా, ఇతర కాంట్రాక్టులు, వైన్స్, బార్‌షాపుల లైసెన్సుల వంటి విషయాల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయనుంది..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం (ఆగస్టు 16) నుంచే ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తామని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే, బీఆర్ అంబేద్కర్ల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని తీసుకువస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే.. దేశంలోనే ప్రథమంగా.. ‘‘మన దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం పథకాలను తెస్తోంది. దళిత బంధు కింద రూ.10లక్షలు ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా పూర్తిగా గ్రాంటు రూపంలో అందజేస్తుంది. నచ్చిన రంగంలో జీవనోపాధిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కొందరు లబ్ధిదారులు సమూహంగా ఏర్పడి, పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్ పెట్టుకొనే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. లబ్ధిదారులు, వారి కుటుంబాలు ఆపదకు గురైతే రక్షణ కవచంగా ఉండేందుకు ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేసింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు సమితుల నేతృత్వంలో దానిని నిర్వహిస్తారు. లబ్ధిదారుల ప్రగతి ఫలితాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన, పటిష్టమైన విధానాన్ని రూపొందించాం. దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పథకాలన్నీ యథాతథంగా అందుతాయి. రేషన్ కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కొనసాగిస్తుంది. దళిత బంధు పథకాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పథకం దేశానికి దారి చూపుతుంది. ఈర్ష్య, అసూయలకు తావివ్వొద్దు అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. ఈర్ష్య, అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటిమీద నిలవాలి. కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి. వ్యవసాయం పండుగగా మారింది ఒకప్పుడు తెలంగాణ అంటేనే కరువు కాటకాలు, రైతు ఆత్మహత్యలకు చిరునామాగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుత కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణ అభివృద్ధి నమోదైంది. 2020–21లో 3.45 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు, రైతుబంధు, రైతుబీమా పథకాలు, రైతువేదికలు, కల్లాల నిర్మాణం, గోదాముల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయం రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది. రూ.50వేలలోపు రుణమాఫీ మొదలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3లక్షల మంది రైతులకు రూ.25 వేల వరకూ ఉన్న పంట రుణాలను ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసింది. సోమవారం నుంచే మరో 6 లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తోంది. నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీనితో 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులవుతున్నారు. మిగతా వారికి కూడా దశలవారీగా రుణమాఫీ అమలవుతుంది. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం ►విద్యుత్, తాగునీటి, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు.. ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ►రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, నేతన్నలకు బీమా, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి పథకాలను అమలు చేస్తోంది. చివరి లబ్ధిదారుడికి ఇల్లు అందే వరకూ డబుల్బెడ్రూం పథకం అమలవుతుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ►కుల వృత్తుల వారి ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, నాయీ బ్రాహ్మణ, రజక వృత్తులవారికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రజకులకు అధునాతన దోభీ ఘాట్లు, నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేస్తోంది. ►కొత్త పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ద్వారా గత ఏడేళ్లలో 16,671 పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చాయి. వాటితో 15 లక్షల 86 వేల 500 ఉద్యోగాల కల్పన జరిగింది. 2020–21 నాటికి రాష్ట్రం నుంచి ఐటీ దిగుమతులు రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. కరోనా అదుపులో ఉంది రాష్ట్ర పౌరుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వివరాల సేకరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27,996 కోవిడ్ బెడ్లు ఉండగా, 17,114 బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం ఉండగా.. త్వరలో అన్నిబెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చబోతోంది. బస్తీ దవాఖానాల స్ఫూర్తితో ‘పల్లె దవాఖానాలు’ ఏర్పాటు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నలుదిక్కులా నాలుగు మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. మూడో దశ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది. హైదరాబాద్.. ట్రీ సిటీ తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతంపైగా పెరిగింది. ట్రీ సిటీగా హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిలిచింది. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ కృషితో రామప్పకు గుర్తింపు కాకతీయ కళావైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం వెనక రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉంది. తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వవైభవం తేవడానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. అందులో భాగంగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. నేడు ‘దళితబంధు’కు శ్రీకారం హుజూరాబాద్‌లోని శాలపల్లిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ సాక్షి,హైదరాబాద్: ప్రతిష్టాత్మక తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కేసీఆర్ బయలుదేరి జమ్మికుంట మండలంలోని శాలపల్లికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో దళితబంధు పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులతోపాటు దళితబంధు ఎలక్ట్రానిక్ కార్డులను అందజేయనున్నారు. ఎలక్ట్రానిక్ కార్డుపై పథకం పేరు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు పయనమవుతారు. -
న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి పేర్లు సిఫార్సు చేశాం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల భర్తీ కోసం ఇటీవల కొందరు న్యాయవాదుల పేర్లను హైకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ చెప్పారు. కరోనాను ఎదుర్కొంటూనే ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 13 వరకు దాఖలైన 31,160 కొత్త కేసుల్లో 22,098 కేసులను పరిష్కరించామన్నారు. ఆదివారం హైకోర్టు ఆవరణలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జస్టిస్ కోహ్లీ ప్రసంగించారు. ‘కరోనా మొదటి, రెండో దశలో ఎందరో ఉద్యోగులను కోల్పోయాం. వారి కుటుంబాలను ఆదుకుంటాం. హైకోర్టు ఉద్యోగులు ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించారు. వారి సహకారంతోనే కేసుల విచారణ చేపట్టగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం 46 కొత్త కోర్టులను మంజూరు చేయగా...ఈ కోర్టుల్లో పని చేసేందుకు 2,117 కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది. అలాగే హైకోర్టు కోసం 213 సూపర్ న్యూమరీ పోస్టులను మంజూరు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 జ్యుడీషి యల్ జిల్లా అంశం పరిశీలనలో ఉంది. హైకోర్టులో 2.32 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి. హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహరించారు. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ప్రత్యక్ష విచారణను ఇప్పటికే ప్రారంభించాం. పరిస్థితులకు అనుగుణంగా పూర్తిస్థాయి ప్రత్యక్ష కేసుల విచారణను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇటీవల 27 మంది న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా గుర్తించాం. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కోర్టు విచారణను మొబైల్ అప్లికేషన్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించాం. తదుపరి విచారణ తేదీలు లేని 1.20 లక్షల కేసులకు తదు పరి విచారణ తేదీలను ఇచ్చాం’’అని జస్టిస్ కోహ్లీ చెప్పారు. జూనియర్లకు ఆర్థిక సాయం ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్ నేతృత్వంలో సమకూర్చిన నిధి నుంచి ఇబ్బందులు పడుతున్న జూనియర్ న్యాయవాదులకు ఆర్థికసాయం అందించారు. అలాగే సీనియర్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు ఇటీవల మృతి చెందిన తన భార్య స్మారకంగా బార్ కౌన్సిల్‌కు అందించిన అంబులెన్స్‌ను జస్టిస్ కోహ్లీ ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీ, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రసంగిస్తున్న హైకోర్టు సీజే జస్టిస్ హిమాకోహ్లీ -
‘అలా అయితే చైనా ముందు తల దించుకోవల్సి వస్తుంది’
ముంబై: చైనా వస్తువులపై ఆధారపడి జీవనం సాగిస్తే ఆ దేశం ముందు తల దించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆయన ఆదివారం భరత 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని ఓ స్కూల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వదేశి అంటే భారత్ దేశంలో తయారైన వస్తువలను వాడాలని తెలిపారు. ప్రస్తుతం మనం సాంకేతికతను అధికంగా ఉపయోగిస్తున్నామని, కానీ మన దేశం వద్ద ఇంకా పూర్తి స్థాయి సాంకేతికత లేదని పేర్కొన్నారు. చాలా వరకు అంతా బయటి దేశాల నుంచి వస్తుందన్నారు. చైనా వస్తువులను నిషేధించామని ఎంత చెప్పినా.. మనం వాడే మొబైల్స్‌లోని కొన్ని యాప్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుకోవాలన్నారు. చైనా వస్తువులుపై మీద మనం ఎక్కువగా ఆధారపడినంత కాలం ఆ దేశం ముందు తల దించుకోవాల్సి పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆర్థిక భద్రత ప్రధానమైందని, సాంకేతిక పూర్తిగా మన దేశ నిబంధనలుకు అనుకూలమైనది ఉండాలన్నారు. స్వదేశి పేరుతో అన్నింటిని బహిష్కరించడం కాదని, ప్రపంచ వాణిజ్యంలో పాలుపంచుకుంటూ స్వావలంబన సాధించాలని చెప్పారు. ఇళ్లలో తయారు చేసుకొనే వస్తువులను మార్కెట్లల్లో కొనటం తగ్గించాలని తెలిపారు. ప్రపంచ వాణిజ్యానికి తాను వ్యతిరేకం కాదని, మన గ్రామాల్లో వస్తువుల ఉత్పత్తులను పెంచాలని ఆయన పేర్కొన్నారు. -
పొదుపు సంఘాల మహిళలకు కేంద్రం తీపికబురు
పొదుపు సంఘాల మహిళలకు కేంద్రం తీపికబురు అందించింది. స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడానికి ప్రభుత్వం ఈ కామర్స్ వేదికలను ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "స్వయ సహాయ బృందాలలో 8 కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు. వారు కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో మార్కెటింగ్ కల్పించడానికి ప్రభుత్వం వారి ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదికను సిద్ధం చేస్తుంది" అని అన్నారు. 'వోకల్ ఫర్ లోకల్' నినాదంతో దేశం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మనందరి బాధ్యత. "ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపివేస్తేనే నిజం అవుతుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. "ఈ రోజు గ్రామాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు, విద్యుత్ వంటి సౌకర్యాలు గ్రామాల చెంతకు చేరుతున్నాయి. నేడు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ గ్రామాలకు సరికొత్త శక్తిని అందిస్తోంది" అని అన్నారు. -
మనం అమరవీరుల ఆశయాలను సాధించామా?
భరతమాత స్వేచ్ఛ కోసం పోరాటం చేసి ఎందరో మహానుభావులు ప్రాణాలు విడిచారు. వారు కోరుకున్నదల్లా సంకెళ్లతో బంధింపబడని భావితరాన్ని.. అందుకే ఆరాటపడ్డారు.. పోరాటం చేశారు.. ప్రాణాలు విడిచారు. అమర వీరుల వందల ఏళ్ల పోరాటంతో బానిస సంకెళ్లు తెంచుకున్న భారతావనిలో నేటి తరం వారికి ఎలాంటి గౌరవం ఇస్తోంది.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఎలాంటి అర్థం చెబుతోంది?.. అమర వీరుల ఆశయసాధనకు కృషి చేస్తోందా?.. -
లండన్‌లో టీమిండియా 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు; వీడియో వైరల్
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా బ్రిటీష్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆడుతున్న టీమిండియా ఆదివారం తాము బస చేస్తున్న హోటల్ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జట్టు సభ్యులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. కాగా శ్రీలంక పర్యటన నుంచి ఇంగ్లండ్‌కు చేరుకున్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు కూడా ఈ వీడియోలో కనిపించారు. ఈ ఇద్దరు తమ ఐసోలేషన్ పీరియడ్‌ను పూర్తిచేసుకుని జట్టుతో కలిసి ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే మూడవ టెస్ట్ సెలెక్షన్స్ కోసం అందుబాటులో ఉండనున్నారు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. On the occasion of India's Independence Day, #TeamIndia members came together to hoist the flag 🇮🇳 🙌 pic.twitter.com/TuypNY5hjU — BCCI (@BCCI) August 15, 2021 -
హిందీలో పీటర్సన్ ట్వీట్.. సూపర్ అంటున్న ఫ్యాన్స్
లండన్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ హిందీలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. '' భారతీయులందరికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం ఎన్నో విషాధాలు చూశాం.. వాటన్నింటిని మరిచి కొత్త ఆశలతో ముందడుగేయండి. మీ సెలబ్రేషన్స్‌ను నేను మిస్సవుతున్నా.. త్వరలోనే ఇండియాకు వస్తా అప్పుడు కలుద్దాం.. లవ్ కేపీ'' అని ట్వీట్ చేశాడు. ఇక పీటర్సన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాకా కామెంటేటర్‌గా బిజీ అయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాలీ టోర్నీలకు పీటర్సన్ కామెంటరీ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పీటర్సన్ హండ్రెడ్ టోర్నీలో కామెంటరీ చేస్తున్నాడు. ఇక కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరపున 104 టెస్టుల్లో 8181 పరుగులు, 136 వన్డేల్లో 4440 పరుగులు, 37 టీ20ల్లో 1176 పరుగులు సాధించాడు. भारत के 75वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। इस साल कई त्रासदियों का सामना करना पड़ा है लेकिन हम और भी मजबूत होकर वापस आएंगे। मैं आप सभी को याद करता हूं और जल्द ही फिर से आने का इंतजार नहीं कर सकता। लव KP 🇮🇳 — Kevin Pietersen🦏 (@KP24) August 15, 2021 -
74 ఏళ్ల సినీ భారతం.. రూ. 10 వేల నుంచి 2000 కోట్ల వరకు..
స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఏ ఒడిదుడుకులు లేకుండా నిరంతరం విస్తరిస్తూ వచ్చిన పరిశ్రమ ఏదైనా వుందా అంటే అది సినిమా పరిశ్రమ మాత్రమే. 1947లో టర్నోవర్‌కు, యిప్పటి టర్నోవర్‌కు పోల్చి చూస్తే వందల రెట్లు పెరిగి వుంటుంది. సినిమా పరిశ్రమ అంటే దాని నిర్మాణం మాత్రమే లెక్క వేయకూడదు. పంపిణీ, ప్రదర్శనా రంగాలు, పార్కింగ్, క్యాంటీన్లు, బయట కాచుకున్న రిక్షాబళ్ల వరకు, బ్లాక్ మార్కెట్టు టిక్కెట్లు అమ్మేవారితో సహా అది చూపిన ఉపాధిని, ఆదాయాన్ని పరిగణించాల్సి ఉంటుంది. పంపిణీ, పబ్లిసిటీరంగాల కొస్తే రీళ్లు (ఇటీవల లేకపోవచ్చు, మొన్నటిదాకా వున్నాయి) రవాణా చేయడాలు, పోస్టర్లు డిజైన్ చేసేవారు, గోడకి అతికించేవారు, సినిమా సమీక్షలు, ఇంటర్వ్యూలు, చరిత్రలు రాసేవారు, సినిమా వార్తలతో పేపర్లు ప్రచురించేవారు, టీవీలకై కవర్ చేసేవారు, సినిమా పాటలతో సంగీత విభావరులు నిర్వహించేవారు, టీవీలో కార్యక్రమాలు చేసేవారు, సినిమా నటుల్ని అనుకరించే మిమిక్రీ కళాకారులు, సినీ నటుల్ని ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించేవారు, పాటల పోటీలు పెట్టేవారు.. యిలా ఎన్నో రంగాలకు చెందినవారు, ఎన్నో కుటుంబాలు సినీరంగంపై పరోక్షంగా ఆధారపడుతున్నాయి. థియేటర్లో చూపించే సినిమాలే కాక, టీవీ సినిమాలు, టీవీలో సినిమా సంబంధిత కార్యక్రమాలు, షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ఓటీటీకై చేసే చిత్రాలు – వీటన్నిటినీ కూడా కలుపుకుంటే దీనిపై ఆధారపడే కుటుంబాల సంఖ్య మరీ పెరిగిపోతుంది. మరే దేశంలోనో అయితే ఒకటి, రెండు భాషల్లో సినిమాలు తయారయ్యేవి. కానీ భారతదేశంలో దాదాపు పది భాషల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు తయారవుతున్నాయి. ఏ పరిశ్రమా యీ స్థాయిలో విస్తరించి వుండదు. సినిమాల్లో సంపాదించిన డబ్బును నటీనటులు వేరే పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టి దేశపారిశ్రామికాభివృద్ధికి తోడ్పతున్నారు. నిజానికి సినిమా నిత్యావసర వస్తువు కాదు. అయినా ఎందుకీ స్థాయి వృద్ధి? తక్కిన పరిశ్రమలు వస్తువులు ఉత్పత్తి చేస్తాయి. అవి కొంతకాలానికి అనవసరమనిపించవచ్చు, లేదా డిమాండు పోగొట్టుకొనవచ్చు. కానీ సినిమాలు ఉత్పత్తి చేసేది ఆలోచనల్ని, కలల్ని! ప్రతి మనిషికీ ఊపిరున్నంతకాలం అవి కావాల్సిందే! చుట్టూ పరిస్థితులు దుర్భరమౌతున్న కొద్దీ భవిష్యత్తు గురించి కలలు కనడం పెరుగుతుంది. ఆ కలలకు ముడిసరుకును సినిమాలు సరఫరా చేస్తాయి. సినిమాకైతే ఆ బాధ లేదు ఒక నాటకం ప్రదర్శించాలంటే దానిలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఆ ప్రదేశానికి వెళ్లాలి. సినిమాకైతే ఆ బాధ లేదు. స్వాతంత్య్రానంతరం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం రావడంతో పల్లెటూళ్లలో కూడా థియేటర్లు వెలిశాయి. జనాలు సినిమాలు చూడడం యిబ్బడిముబ్బడిగా పెరిగింది. తర్వాతి రోజుల్లో వీడియో క్యాసెట్లు, డీవీడీలు వచ్చాయి, బ్లూరే సీడీలూ వచ్చాయి. ఇప్పుడు సెల్ఫోన్లలోనే సినిమా చూసేసే సౌకర్యం వచ్చింది. ఈ విధంగా సినిమా ప్రజలకు మరీమరీ చేరువౌతూ వచ్చింది. సినిమా థియేటర్ అనేది ఊరిలో వుండవలసిన ముఖ్యమైన ప్రదేశంగా మారింది. కుటుంబమంతా సరదాగా సమయం గడపడానికి అతి చౌకగా వెళ్లగలిగేది సినిమా థియేటరుకు మాత్రమే. అందుకే అది ఒక సామాజిక అవసరంగా మారింది. కట్టూబొట్టూపై, సంభాషణ తీరుపై, భావప్రకటనపై సినిమా ప్రభావం పడింది. స్వాతంత్య్రానంతరం దేశమంతా ఒక్కటే అనే భావన పెంపొందడానికి కారణం హిందీ సినిమాలు అని చెప్పినా తప్పులేదు. ఈశాన్య రాష్ట్రాల నుంచి, లక్షద్వీప్ దాకా హిందీ పాటలు మారుమోగుతూనే వుంటాయి. హిందీలో అంత్యాక్షరి నిర్వహిస్తే, దేశంలోని ఏ ప్రాంతంవారైనా పాల్గొనగలుగుతారు. అది ఒక చైతన్య మాధ్యమం హాలీవుడ్‌తో స్ఫూర్తి పొందిన భారతీయ సినిమా క్రమంగా భారతీయ ప్రేక్షకుడికి తగినట్టుగా రూపు మార్చుకుంటూ వెళ్లింది. ప్రతిష్ఠాత్మక స్టూడియోల చేతుల్లో నుంచి కదిలి వ్యక్తిగత నిర్మాతల వరకూ విస్తరించింది. హిందీ రంగంలో మార్కెట్ కోసం రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ వంటి స్టార్స్‌కు ఇమేజ్ వచ్చేలా చూశారు. దక్షిణాదిలో ఎన్.టి.ఆర్, ఎం.జి.ఆర్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ వంటి స్టార్స్ ప్రేక్షకుల ఇలవేల్పులయ్యారు. కాంచనమాలతో మొదలెట్టి మధుబాల, సావిత్రి వరకూ అద్భుతమైన స్టార్‌డమ్‌ను చూసిన హీరోయిన్లూ ఉన్నారు. కాని సినిమా అంటే కాలక్షేపం మాత్రమే కాదని అది ఒక చైతన్య మాధ్యమం అని ‘పారలల్ సినిమా మూవ్మెంట్’ మొదలైంది. సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, ఎం.ఎస్.సత్యు, ఋత్విక్ ఘటక్, శ్యామ్ బెనెగళ్, బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్, కె.ఎన్.టి.శాస్త్రి, బి.ఎస్.నారాయణ వంటి దర్శకులు సినిమా ధోరణిని మార్చారు. మలయాళం ఈ విషయంలో అద్భుతమైన వికాసం చూపింది. అడూర్ గోపాలకృష్ణన్, అరవిందన్ వంటి దర్శకులు ప్రపంచ స్థాయి సినిమాలు తీశారు. తెలుగులో వీరు.. తెలుగులో మాదాల రంగారావు, టి.కృష్ణ తదితరులు చైతన్యవంతమైన సినిమాను ప్రేక్షకులకు హిట్ ఫార్ములాగా అందించారు. కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి దర్శకులు మధ్యతరగతి డ్రామాను తెర మీద రక్తి కట్టించారు. అయితే నేటికీ సినిమా కమర్షియల్ మాధ్యమమే అని వినోదం అందిస్తూ లాభాలు గడించే వ్యాపార కళ అని నిరూపితం అవుతూనే ఉంది. హిందీలోగాని దక్షిణాది భాషల్లోగాని హీరోలే కేంద్రంగా కాలక్షేప కథలతో కొనసాగుతూ ఉంది. మరోవైపు సాంకేతిక అభివృద్ధి జరిగి సినిమాస్కోప్, 70 ఎంఎం, డాల్బీ సిస్టమ్.. అంటూ అనేక హంగులు వచ్చి చేరుతూ సినిమాను వీక్షించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారిపోయింది. తమిళ ప్రాంతంలో ద్రవిడ ఉద్యమం తన భావప్రచారానికి సినిమాను సాధనంగా వాడుకుని అధికారంలోకి వచ్చింది. దక్షణాదిలో సినిమా రంగం ఏకంగా ముఖ్యమంత్రులను ఇచ్చే స్థాయికి రాజకీయాలను ప్రభావితం చేసింది. సినిమాను దేశభక్తి పెంపొందించడానికి, సోషలిస్టు లేదా కమ్యూనిస్టు భావవ్యాప్తికి, భక్తి కలిగించడానికి, ఆలోచన రగిలించడానికి.. యిలా పలువిధాలుగా వాడుకున్నారు. పెద్దగా ప్రచారం లేని దేవుడికి పబ్లిసిటీ తేవాలంటే ఆ దేవుడి మహిమలపై సినిమా తీస్తే లేదా పేరున్న సినీగాయకుల చేత పాటలు పాడిస్తే చాలు అనే ధోరణి కూడా వచ్చింది. సినిమా సమాజాన్ని, సమాజం సినిమాను అనుకరిస్తూ పోవడం వలన జనాభాతో బాటు సినీపరిశ్రమ కూడా నిరంతరంగా పెరుగుతూ పోతోంది. నిజానికి స్వాతంత్య్రానంతరం సమాజ దృక్పథంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి దశాబ్దాల వారీగా సినిమా థీమ్స్‌ను విశ్లేషిస్తే సరిపోతుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో సోషలిస్టు సమాజంపై ఆశలు, స్వతంత్ర భావాలు, మంచి కోసం తలిదండ్రులను ఎదిరించినా తప్పులేదనే ఆలోచన, కష్టపడి పని చేస్తూ నీతి, నిజాయితీలతో బతికితే జీవితంలో పైకి వస్తామన్న ఆశావహ దృక్పథం కథాంశాలుగా వుండేవి. పోనుపోను సమాజంలో హింసాత్మక విధానాలతోనైనా మార్పు తేవాల్సిందే అనే తీవ్రవాదం థీమ్‌గా మారింది. ఆ తర్వాతి రోజుల్లో సన్మార్గాన్ని నమ్ముకుంటే లాభం లేదు, ఈ సమాజంలో ఎలాగోలా పైకి వచ్చేవాడే మొనగాడు అనే ఆలోచన, విదేశాలు వెళ్లి డబ్బు సంపాదిద్దాం, ఎలాగోలా సంపాదించి, ఖర్చు పెట్టడంలోనే మజా వుంది అనే దృక్పథం.. ఇలా అన్నీ సినిమాల్లో ప్రతిఫలించాయి. అందుకే ప్రేక్షకులు సినిమా హీరోలతో మమేకమౌతున్నారు. వారిని ఆరాధిస్తున్నారు. 60, 70 ఏళ్ల క్రితం సినిమా కళాకారులను సంఘబాహ్యులుగా చూసే రోజుల్నుంచి, యింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్లను ఆహ్వానించడం ప్రతిష్ఠాత్మకమైన విషయంగా పరిగణించే వరకూ మార్పు వచ్చింది. సినిమావారు ప్రేక్షక ఓటర్ల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేయగల స్థితిలో వున్నారని గ్రహించిన రాజకీయ నాయకులు వారిని ప్రచారానికి, తమ మీటింగుల జనసమీకరణకు వాడుకుంటున్నారు. క్రమేపీ వేరెవరి కోసమో పని చేయడమెందుకనుకుని నటీనటులు తామే నాయకులుగా ఎదుగుతున్నారు. కొందరు సఫలం కావడం, మరి కొందరు విఫలం కావడం సహజం. ‘బాహుబలి’ వంటి సినిమాల వల్ల.. ఇవాళ భారతీయ సినిమా ప్రపంచ ప్రేక్షకులను సంపాదించుకుంది. భారతదేశంలోనే కాక అనేక దేశాలలో భారతీయ సినిమాలు విడుదల అవుతున్నాయి. జపాన్, చైనాలలో మన సినిమాలు డబ్ అయ్యి విడుదలై ఘన విజయాలు సాధిస్తున్నాయి. సినిమా వ్యాపారం ఒకప్పుడు పది వేల రూపాయలతో మొదలయ్యి ఇవాళ ఒక పెద్ద సినిమా తీయాలంటే బడ్జెట్ 50 కోట్ల నుంచి 100 కోట్ల స్థాయికి పెరిగింది. ‘బాహుబలి’ వంటి సినిమాలు 500 కోట్ల పెట్టుబడి వరకూ వెళ్లి దాదాపు 2000 కోట్ల కలెక్షన్ల దాకా సాధించవచ్చని నిరూపించాయి. ‘పాన్ ఇండియా’ సినిమా అంటూ ఇవాళ దేశం మొత్తం తెలిసే నటీనటులతో సినిమాలు తీసి రెండు, మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోసమే సినిమా కంటెంట్ వృద్ధి జరిగి ఓటీటీ బిజినెస్ ఒకటి కొత్త ఆర్థిక లావాదేవీలు నెరుపుతోంది. ఈ మొత్తం వృద్ధిలో ప్రాంతీయ అసమానత గమనార్హం. సినీ నిర్మాణం కొన్ని రాష్ట్రాలలోనే జరుగుతోంది. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాలలో (ఆంధ్రలో యింకా పుంజుకోవాలి), ముంబయిలో, తక్కువ స్థాయిలో కోల్‌కతాలో సాగుతోంది. జనబాహుళ్యం ఎక్కువగా వున్న ఉత్తరాది రాష్ట్రాలలో, పశ్చిమ రాష్ట్రాలలో సినీ నిర్మాణం ఎదగడానికి ఎంతో అవకాశం వుంది. అలాగే అనేక మాండలిక భాషల్లో సినిమాలు నిర్మించడానికి మార్కెట్ వుంది. సినిమా నిర్మాణం అంతా ఒకే చోట పోగుపడడం అభిలషణీయం కాదు. దీని వలన కొందరి దగ్గరే పెత్తనం ఉండిపోతుంది. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న కొద్దీ ఆ ప్రాబల్యం తగ్గుతుంది, సంపద పంపిణీ అవుతుంది, స్థానికులకు అవకాశాలు పెరుగుతాయి, సినీనిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. వచ్చే దశాబ్దాలలో ఆ పని జరుగుతుందని ఆశిద్దాం. -ఎమ్బీయస్ ప్రసాద్ -
MS Dhoni: ధోని రిటైర్మెంట్; అప్పుడే ఏడాది గడిచిపోయిందా
సాక్షి, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఈరోజుతో సరిగ్గా ఏడాది. గతేడాది ఆగస్టు 15న రాత్రి 7 గంటల 29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాజాగా ధోని రిటైర్మెంట్ మరోసారి వైరల్‌గా మారింది. '' కాలం ఎంత వేగంగా పరిగెత్తింది.. మా ధోని ఆటకు గుడ్‌బై చెప్పి అప్పుడే ఏడాది గడిచిపోయిందా'' అంటూ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. 2004లో భారత జట్టులోకి అరంగేట్రం ఇచ్చిన ధోనీ.. 350 వన్డేల్లో 10773 పరుగులు, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగుల సాధించాడు. ఇందులో వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు సాధించాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే భారత్‌లోనూ ఓ పవర్ హిట్టర్ ఉన్నాడని క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పిన ధోనీ.. కెప్టెన్‌గానూ సూపర్ సక్సెస్ సాధించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ప్రస్తుతం ఎంఎస్ ధోని ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె మ్యాచ్‌లను ఆడేందుకు యూఏఈకి వెళ్లాడు. కాగా కరోనాకు ముందు జరిగిన ఐపీఎల్ 2021 సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన ఎంఎస్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఏడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో ధోనీ ఫెయిలైనా.. కెప్టెన్, వికెట్ కీపర్‌గా మాత్రం అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదాపడే సమయానికి చెన్నై పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరి మహేంద్రుడు మరోసారి సీఎస్కేను విజేతగా నిలుపుతాడేమో చూడాలి. Leader. Legend. Inspiration. 🙌#OnThisDay last year, #TeamIndia great @msdhoni announced his retirement from international cricket. 🇮🇳 pic.twitter.com/0R1LZ2IZyu — BCCI (@BCCI) August 15, 2021 View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
టెక్ ఇండియా... 75 ఏళ్లలో సాధించిన పురోగతి ఇదే
Technology Achievements Of India: 1947 నుంచి ఇప్పటివరకూ ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరేసుకుంటే.. విస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతే. సామాన్యుల బతుకులపైనా ప్రభావం చూపిన ఆవిష్కరణలు, పరిశోధనలు కోకొల్లలు. అంగారకుడిపైకి చౌకగా నౌకను పంపామని... ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడంలో విజయం సాధించామన్నది ఎంత నిజమో... దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి కావాల్సినంత పండించుకుని తినడమే కాకుండా... ఎగుమతులూ చేస్తున్న ఆహార, పాడి సమృద్ధి కూడా అంతే వాస్తవం. అనుకూలమైన విధానాలూ తోడవడంతో ఆహారం, పాలు, పండ్లు, కాయగూరలు, వ్యాక్సిన్లు, మందుల తయారీలో ఇంకొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. రక్షణ రంగంలోనూ సొంతంగా మన కాళ్లపై మనం నిలబడగలిగే స్థాయికి భారత్ ఎదిగింది. ఎదుగుతోంది కూడా. 1947లో స్థూల జాతీయోత్పత్తిలో శాస్త్ర పరిశోధనలకు కేటాయించింది 0.1 శాతం మాత్రమే అయినప్పటికీ గత దశాబ్ద కాలంలో ఇది ఒక శాతానికి కొంచెం దిగువన మాత్రమే ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. మొత్తమ్మీద శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో స్వాతంత్య్రానంతరం మనం సాధించిన ఘన విజయాలను స్థూలంగా తరచి చూస్తే... హరిత విప్లవం... 1947లో దేశం పండించిన గోధుమలు కేవలం 60 లక్షల టన్నులు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేని నేపథ్యంలో అప్పట్లో అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే భూ సంస్కరణలతోపాటు భాక్రా–నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడంతో పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. సొంతంగా ఎరువుల ఉత్పత్తి కూడా చేపట్టడం, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఫలితంగా 1964 నాటికి గోధుమల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ దేశీయ అవసరాలకు సరిపోని పరిస్థితి. మెరుగైన వంగడాలను అభివృద్ధి చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బెంజిమన్ పియరీ పాల్ చేపట్టిన పరిశోధనలు 1961లో ఫలప్రదమవడంతో గోధుమ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చీడపీడల బెడద కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో అధిక దిగుబడులిచ్చే వంగడాల అభివృద్ధే లక్ష్యంగా హరిత విప్లవం మొదలైంది. గోధుమతోపాటు, వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటల్లో కొత్త వంగడాలు వృద్ధి చేయడం మొదలైంది. 1947లో బెల్ ల్యాబ్స్ తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేయగా.. అప్పట్లో దాన్ని మనుషులు చేతులతో తయారు చేసే పరిస్థితి ఉండేది. ఈనాటి ట్రాన్సిస్టర్ సైజు ఎంతుంటుందో తెలుసా? సూదిమొనపై చాలా సులువుగా పదికోట్ల ట్రాన్సిస్టర్లను పెట్టేయవచ్చు. ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు తమదైన సహకారం అందించారు. చదవండి : మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా క్షీర విప్లవం... స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారంతోపాటు పాల ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. పసిపిల్లలకు వాడే పాల ఉత్పత్తులు, వెన్న, చీజ్ వంటివి దిగుమతయ్యేవి. 1955లో భారత్ యూరప్ నుంచి మొత్తం 500 టన్నుల వెన్న, మూడు వేల టన్నుల పిల్లల ఆహారాన్ని దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్లో కైరా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ ప్రారంభంతో ఈ పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందు ఈ సంస్థ త్రిభువన్ దాస్ పటేల్ నేతృత్వంలో ప్రారంభమైంది. 1949లో తన పై చదువులకు సహకరించిన ప్రభుత్వానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా వర్ఘీస్ కురియన్ గుజరాత్‌లోని ఆనంద్‌కు రావడం, అమూల్ ప్రారంభంతో దేశంలో క్షీర విప్లవం మొదలైంది. తొలినాళ్లలో అమూల్ సేకరించే పాల సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పాలపొడి తయారీ టెక్నాలజీ అప్పట్లో యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఉండేది. పైగా వాళ్లేమో బర్రెపాలను పొడిగా మార్చలేమని చెప్పేవారు. కానీ.. కురియన్‌తో పాటు అమూల్‌లో పనిచేసిన హెచ్.ఎం.దహియా అనే యువ డెయిరీ ఇంజినీర్ ప్రయోగాలు చేపట్టి బర్రెపాలను పొడిగా మార్చవచ్చునని నిరూపించారు. ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం చెప్పుకోవాల్సిన విషయం. పెయింట్ పిచికారి చేసే యంత్రం, గాలిని వేడి చేసే యంత్రాల సాయంతో తయారైన ఈ టెక్నాలజీ కాస్తా దేశంలో పాల దిగుబడి అవసరానికి మించి పెరిగేలా చేసింది. ఎంతలా అంటే... ప్రపంచమంతా కోవిడ్–19తో సతమతమవుతున్న సమయంలో భారత్ ఏకంగా 550 కోట్ల రూపాయల విలువ చేసే పాల ఉత్పత్తులను ఎగుమతి చేసేంత! చదవండి : సిరులిచ్చే.. సోయగాల చేపలు! ఉపగ్రహాలు, సమాచార విప్లవం... 1960లలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ ఛైర్మన్‌గా విక్రమ్ సారాభాయ్ సమాచార ప్రసారాలు, రిమోట్ సెన్సింగ్, వాతావరణ అంచనాల కోసం ఉపగ్రహ టెక్నాలజీని వాడుకోవాలని అంటూంటే.. ఆయన్ను నమ్మేవారు చాలా తక్కుమంది మాత్రమే ఉండేవారు. సొంతంగా రాకెట్లు తయారు చేసే జ్ఞానమెక్కడిదని చాలామంది విమర్శించేవారు కూడా. విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహాల సాయంతో దేశంలో విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో వృద్ధి సాధించాలని కలలు కనేవాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్థాపనతో ఈ కలల సాకారం మొదలైంది. దశాబ్దకాలంలోనే దేశం సొంతంగా రాకెట్‌ను తయారు చేయడంతోపాటు అంతరిక్ష ప్రయోగాలను శాంతి కోసం వాడుకోవచ్చునని నిరూపించారు. ఆర్యభట్ట ఉపగ్రహం సాయంతో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో అంతరిక్ష రంగంలో భారత్ తన ముద్రను వేయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో ఇన్శాట్, ఐఆర్ఎస్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆఖరుకు చంద్రయాన్ –1తో జాబిల్లిపై నీటి ఛాయలను నిర్ధారించగలగడంతోపాటు తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకున్న దేశంగానూ రికార్డు స్థాపించింది. హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్‌తో అంగారకుడిపైకి మంగళ్యాన్ ఉపగ్రహాన్ని పంపించడం వెనుక ఉన్న భారతీయ శాస్త్రవేత్తల మేధకు ప్రపంచం జేజేలు కొట్టింది. వీశాట్ టెక్నాలజీ వాడకం ద్వారా 1980లలో బ్యాంకింగ్ సేవలు దేశం మూలమూలలకు చేరుకుంది. ఉపగ్రహాల సాయంతో తుపానులను ముందుగా గుర్తించడం వీలు కావడంతో వేలాది ప్రాణాలను రక్షించగలుగుతున్నాం. ఫార్మా, వ్యాక్సిన్ తయారీల్లో... మీకు తెలుసా... ప్రపంచం మొత్తమ్మీద వేసే ప్రతి వ్యాక్సిన్‌లో మూడో వంతు భారత్‌లోనే తయారవుతున్నాయని వ్యాక్సిన్లు మాత్రమే కాదు.. ఫార్మా రంగంలోనూ భారత్ సాధించిన ప్రగతి కచ్చితంగా ఎన్నదగ్గదే. జెనెరిక్ మందుల తయారీతో పేద దేశాల్లో హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవుతున్న లక్షలాది ప్రాణాలను కాపాడగలగడం ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. మేధాహక్కుల పేరుతో విపరీతమైన లాభాలను గడించే ఫార్మా కంపెనీల ఆటలకు అడ్డుకట్ట పడిందిలా. విదేశీ ఫార్మా కంపెనీల దోపిడీకి చెక్ పెట్టే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1954లో హిందుస్థాన్ యాంటీబయాటిక్స్‌ను ప్రారంభించింది. ఆ వెంటనే సోవియెట్ యూనియన్ సాయంతో హైదరాబాద్‌లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) ఏర్పాటు జరిగింది. నేషనల్ కెమికల్స్ లాబొరేటరీ, రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ (తరువాతి కాలంలో దీని పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా మార్చారు), సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రభుత్వ సంస్థలు తమ వంతు పాత్ర పోషించడంతో అనతి కాలంలోనే అటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల తయారీ మొదలుకొని ఇటు మందుల తయారీలోనూ ప్రపంచ గుర్తింపు పొందే స్థాయికి ఎదగగలిగాం. 1970లో పేటెంట్ హక్కుల్లో మార్పులు రావడంతో దేశంలో జెనెరిక్ మందుల వెల్లువ మొదలైంది. సిప్రోఫ్లాక్సిన్, డైక్లోఫెనాక్, సాల్బుటమాల్, ఒమిప్రొజోల్, అజిత్రోమైసిన్ వంటి మందులను భిన్నమైన పద్ధతిలో తయారు చేసి పెటెంట్ రాయల్టీల చెల్లింపుల సమస్యను అధిగమించగలిగారు. సి–డాట్‌తో టెలికామ్ రంగంలో పెనుమార్పులు... స్వాతంత్య్రం వచ్చే సమయానికి అనేక ఇతర రంగాల మాదిరిగానే టెలికామ్ రంగంలోనూ విదేశీ కంపెనీల హవా నడుస్తూండేది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తక్కువగా ఉండటం.. విదేశీ కంపెనీలేమో విపరీతమైన ధరలను వసూలు చేస్తున్న నేపథ్యంలో టెలికామ్ రంగంలోనూ స్వావలంబనకు ఆలోచనలు మొదలయ్యాయి. 1970లలో ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంత కాలం వేచి ఉండాల్సి వచ్చేదో కొంతమందికి అనుభవమే. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు అస్సలు ఉండేవే కావు. ఈ నేపథ్యంలో 1960లలో టెలికామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటైంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే టెలిఫోన్ ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేసే ప్రయత్నానికి శ్రీకారం పడింది. 1973లో వంద లైన్లతో తొలి ఎలక్ట్రానిక్ స్విచ్ తయారవడంతో టెలికామ్ రంగంలో దేశీ ముద్రకు బీజం పడినట్లు అయ్యింది. అదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఐటీ బాంబేలు మిలటరీ అవసరాల కోసం డిజిటల్ ఆటోమెటిక్ ఎలక్ట్రానిక్ స్విచ్‌లను అభివృద్ధి చేశాయి. 1984లో శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్ (సీ–డాట్) ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సొంత టెలిఫోన్ ఎక్సే్ఛంజీల నిర్మాణం మొదలైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్ రంగానికి ఉచితంగా మళ్లించడంతో మల్టీనేషనల్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సమాచార వ్యవస్థలు ఏర్పడటం మొదలైంది. ఏసీల అవసరం లేకుండా.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల భారతీయ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ టెక్నాలజీ సీ–డాట్ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకూ సాయపడటం కొసమెరుపు! రైల్వేల కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ... ఐబీఎం, ఐసీఎల్... స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో డేటా ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆధిపత్యం చలాయించిన రెండు కంపెనీలు ఇవి. రెండూ విదేశీ బహుళజాతి కంపెనీలే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతోపాటు రక్షణ, పరిశోధన సంస్థల్లోనూ ఈ కంపెనీలు తయారు చేసిన డేటా ప్రాసెసింగ్ యంత్రాలనే వాడేవారు. విదేశాల్లో వాడిపడేసిన యంత్రాలను భారత్‌కు తెచ్చి అధిక ధరలకు లీజ్‌కు ఇచ్చేవి ఈ కంపెనీలు. నేషనల్ శాంపిల్ సర్వే, అణురియాక్టర్ తయారీ వంటి ప్రాజెక్టుల కోసం ఈ డేటా ప్రాసెసింగ్ యంత్రాల అవసరమైతే భారత్‌కు ఎంతో ఉండేది. ఈ అవసరాన్ని ఐబీఎం, ఐసీఎల్లు రెండూ తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గుత్తాధిపత్యానికి తెరవేసే ప్రయత్నంలో భాగంగా హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను సొంతంగా తయారు చేసుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. 1970లలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ)లను స్థాపించింది. ఈ సంస్థల ద్వారా జరిపిన ప్రాథమిక పరిశోధనల ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన రైల్వే రిజర్వేషన్ ప్రాజెక్టు 1986కల్లా అందుబాటులోకి వచ్చింది. ఇవి మాత్రమే కాదు.. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు తద్వారా మత్స్యకారులకు తగినంత జీవనోపాధి కల్పించేందుకు కూడా స్వాతంత్య్రం తరువాతే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1970లలో తొలి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్థాపనతో మొదలైన ఈ కార్యక్రమం తరువాతి కాలంలో బహుముఖంగా విస్తరించింది. పలు రాష్ట్రాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు, కార్యక్రమాలు మొదలయ్యాయి. ∙గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
మన ఆర్థిక ప్రస్థానం.. బ్రిటిష్ రాజ్... లైసెన్స్ రాజ్.. డిజిటల్ రాజ్!
17వ శతాబ్దం ఆరంభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 22.6 శాతం. అంటే దాదాపు యూరప్ మొత్తం వాటా (23%)తో సమానం. 1952 నాటికి మన వాటా 3.8 శాతానికి పడిపోయింది. కేంబ్రిడ్జ్ చరిత్రకారుడు ఆంగస్ మాడిసన్ వెల్లడించిన ఈ అంచనాలు చాలు... బ్రిటిష్ పాలనలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా కుదేలయిందో చెప్పడానికి! బ్రిటిష్ పాలకులు భారత్‌లో పారిశ్రామికీకరణను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో స్వాంత్రంత్య్రం పొందే నాటికి దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు 74 ఏళ్ల తర్వాత, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. కడు పేదరికం నుంచి డిజిటల్ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మన ఆర్థిక విధానాలు పోషించిన పాత్ర, మన ఆర్థికరంగంలో చోటు చేసుకున్న కీలక మార్పులపై 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఒక సింహావలోకనం. నెహ్రూ.. సర్వం ప్రభుత్వం చెప్పుచేతల్లోనే! స్వాతంత్య్రం వచ్చాక అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చికిత్స ప్రారంభించారు. స్వావలంబనతో కూడిన ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, దారిద్య్ర నిర్మూలన లక్ష్యాలతో సోషలిజం ఛాయలతో కూడిన అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వమే ఒక ఎంట్రప్రెన్యూర్‌గా వ్యవహరించేలా 1948లో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధాన తీర్మానం దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రైవేటు కంపెనీలను పూర్తిగా ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంచుకునేలా విధానాలను రూపొందించారు. దేశంలో లైసెన్స్ రాజ్‌కు ఇక్కడే బీజం పడింది. ఉక్కు, మైనింగ్, యంత్ర పరికరాలు, టెలికం, బీమా, విద్యుత్ తదితర కీలక పరిశ్రమల్లో ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగింది. అప్పటి సోవియెట్ యూనియన్ విధానాల ప్రభావంతో పంచ వర్ష ప్రణాళికలకు రూపకల్పన చేసిన నెహ్రూ సర్కారు... మొత్తం ప్రభుత్వ ప్రణాళికలను పర్యవేక్షించడం కోసం 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1951లో భారత్ మొట్టమొదటి పంచ వర్ష ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై ఈ ఐదేళ్లూ దృష్టి సారించారు. అధిక మొత్తంలో పొదుపులు, పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేలా పాలసీలను రూపొందించారు. ఈ తొలి పంచవర్ష ప్రణాళిక మంచి ఫలితాలనే అందించింది. 2.1 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాలను అధిగమించి 3.6 శాతం వృద్ధి సాకారమైంది. లైసెన్స్ రాజ్... 1956 నాటి రెండో పంచవర్ష ప్రణాళిక దేశంలో ప్రభుత్వ రంగ కంపెనీల జోరుకు బాటలు వేయడంతో పాటు లైసెన్స్ రాజ్ ఆవిర్భావానికి కారణమైంది. భారత్‌లో పరిశ్రమలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి, రెండవ గ్రూపుల్లో ప్రధానమైన, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న కంపెనీలను పూర్తిగా ప్రభుత్వ రంగంలో చేర్చారు. ఇక మూడో గ్రూపులో కన్జూమర్ పరిశ్రమలను చేర్చి, వాటిని ప్రైవేటు రంగానికి వదిలేశారు. అయితే, లైసెన్సుల జారీ వ్యవస్థ ద్వారా ప్రైవేటు రంగంపై ప్రభుత్వం పూర్తి పెత్తనం చలాయించేలా విధానాలను రూపొందించడంతో అన్నింటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని, అధికారుల జోక్యం మితిమీరి, విపరీతమైన అవినీతికి దారితీసింది. భాక్రా–నంగల్ టు భిలాయ్... భారతదేశ ఆధునిక దేవాలయాలు ప్రభుత్వ ప్రణాళికల్లో విద్యుత్, ఉక్కు రంగాలను కీలకమైనవిగా నెహ్రూ భావించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సట్లెజ్ నదిపై నిర్మించిన భాక్రా బహుళార్థసాధక ప్రాజెక్టును పునరుజ్జీవ భారతదేశంలో కొత్త దేవాలయంగా ఆయన అభివర్ణించారు. భాక్రా–నంగల్తో పాటు అనేక జల విద్యుత్ ప్రాజెక్టులు దేశంలో లక్షలాది ఇళ్లలో వెలుగులు నింపాయి, అనేక ఫ్యాక్టరీలను నడిపించాయి, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించాయి. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో 60 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో, జర్మనీ సహకారంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్.. రష్యా, బ్రిటన్ ఆధ్వర్యంలో భిలాయ్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), అణు ఇంధన కమిషన్ వంటి ఎన్నో ‘ఆధునిక దేవాలయాలు’ నెహ్రూ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. నెహ్రూ తదనంతరం ప్రధాని పగ్గాలు చేపట్టిన లాల్‌బహదూర్ శాస్త్రి హయాంలోనే ఆహార ధాన్యాలు, డెయిరీ రంగంలో స్వయం సమృద్ధికి దోహదం చేసిన హరిత విప్లవం, క్షీర విప్లవం చోటు చేసుకున్నాయి. ఇందిర హయాం... బ్యాంకుల జాతీయీకరణ నెహ్రూ, శాస్త్రి వెనువెంటనే మరణించడం... దేశంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. విదేశీ మారక నిల్వలు అడుగంటడం.. చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో 1966 జూన్ 6న ప్రధాని ఇందిరా గాంధీ డాలరుతో రూపాయి మారకం విలువను ఏకంగా 57 శాతం తగ్గించి 4.76 నుంచి 7.50కు తీసుకొచ్చేశారు. దీనివల్ల ఎగుమతులకు ఊతం లభించినా, దేశంలో ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వ్యవసాయ రుణాలను పెంచడమే లక్ష్యంగా 1969 జూలై 20న దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకుల కార్యకలాపాల్లో తీవ్ర రాజకీయ జోక్యం క్రోనీ క్యాపిటలిజానికి దారితీసి, విపరీతంగా మొండిబాకీలు పెరిగిపోయేందుకు కారణమైంది. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిర... 1977 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. డీమానిటైజేషన్ 1.0 1977లో అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్ సారథ్యంలోని జనతాపార్టీ.. నల్లధనానికి అడ్డుకట్టవేయడం కోసం రూ.1,000, రూ.5,000, రూ.10,000 బ్యాంకు నోట్లను రద్దు చేసింది. అప్పటి పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నాండెజ్... విదేశీ కంపెనీలపై కొరడా ఝుళిపించడంతో బహుళజాతి కంపెనీలైన ఐబీఎం, కోకాకోలా ఇక్కణ్ణుంచి దుకాణం సర్దేశాయి. రాజీవ్పాలన... ఐటీ, టెలికం విప్లవానికి నాంది 1984 అక్టోబర్‌లో ఇందిర హత్యతో 40 ఏళ్ల వయస్సులో యువ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ... ప్రత్యక్ష పన్నుల తగ్గింపు, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితుల పెంపు వంటి పలు సంస్కరణలు చేపట్టారు. అంతేకాదు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలికం విప్లవాలకు నాంది పలికిన ఘనత కూడా రాజీవ్‌కే దక్కుతుంది. పీవీ సంస్కరణల హీరో... 1991లో భారత్ చెల్లింపుల సంక్షోభంతో దివాలా అంచున నిలబడింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌లు బంగారాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రుణాలు తీసుకొని దేశాన్ని గండం నుంచి గట్టెక్కించారు. లైసెన్స్ రాజ్‌కు అంతంతో పాటు మన ఎకానమీని మలుపు తిప్పిన విప్లవాత్మకమైన సంస్కరణలు, సరళీకరణకు తెర తీశారు. దీంతో భారత్‌కు విదేశీ కంపెనీలు క్యూ కట్టి, భారీగా ఉద్యోగాలకు దోహదం చేసింది. వాజ్‌పేయి... ప్రైవేటీకరణకు సై నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున ప్రధాని పగ్గాలు చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ సంస్కరణలు జోరందుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారాలు తెరిచి.. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్), బాల్కో, హిందుస్థాన్ జింక్ తదితర కంపెనీలను విక్రయించారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల రూపురేఖల మార్చివేత వాజ్‌పేయి ఘనతే. జీడీపీ వృద్ధి ‘మన్మోహనం’ 1991లో ఆర్థిక మంత్రిగా సత్తా చూపిన మన్మోహన్ సింగ్... అనూహ్యంగా 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వ సారథిగా ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పలు సామాజికాభివృద్ధి పథకాలకు మన్మోహన్ సర్కారు బీజం వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో 5–20 శాతం వరకు వాటాలను విక్రయిచడం ద్వారా ఈ పథకాలకు నిధులను సమకూర్చుకోగలిగారు. పదేళ్ల మన్మోహన్ పాలనలోనే భారత్ అత్యధిక జీడీపీ వృద్ధి రేటును (8–9 శాతం) సాధించింది. అయితే, 2008లో చోటుచేసుకున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ వృద్ధి పడకేసింది. అంతేకాదు, కార్పొరేట్లకు ఎడాపెడా ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారడంతో పాటు, 2జీ, కోల్ గేట్ వంటి పలు కుంభకోణాలు మన్మోహన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశాయి. నోట్ల రద్దుతో మోదీ షాక్... 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ పాలనలో దేశ ప్రజలు అనేక విప్లవాత్మకమైన సంస్కరణలతో పాటు తీవ్రమైన షాక్‌లను కూడా చవిచూశారు. 2016 నవంబర్ 8న రాత్రికి రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి దేశంలో అతిపెద్ద డీమానిటైజేషన్‌ను ప్రకటించడం ద్వారా మోదీ షాకిచ్చారు. దేశంలో తొలిసారి రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రజలు పడరాని పాట్లు పడినా, దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. మరోపక్క, దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకునే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తీసుకొచ్చి సంస్కరణలను కొత్తపుంతలు తొక్కించారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. దివాలా చట్టం (ఐబీసీ)తో మొండిబాకీల సమస్యకు కొంతమేర పరిష్కారం చూపారు. మరోపక్క, మోదీ సర్కారు 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ కంపెనీల ప్రైవేటీకరణను వేగవంతం చేశారు. ఎల్ఐసీలో వాటానూ అమ్మకానికి పెట్టారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కొత్త ఆలోచనలతో విద్యా, ఉద్యోగావకాశాల సృష్టిలో మోదీ సఫలం అయ్యారనే చెప్పొచ్చు. మోదీ హయాంలోనే భారత్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సవాళ్లు ఉన్నా... ఉజ్వల భవిష్యత్తు నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, బ్యాంకుల్లో మొండిబాకీల దెబ్బతో మందగించిన మన ఎకానమీపై.. కరోనా పంజా విసిరింది. దేశవ్యాప్త లాక్డౌన్ ఫలితంగా 2020–21 జూన్ త్రైమాసికంలో జీడీపీ 24.4 శాతం కుప్పకూలింది. భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే అత్యంత ఘోరమైన క్షీణతను చవిచూసింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా, ఎకానమీ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరినా... ప్రజల్లో ఆర్థిక అసమానతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తలసరి ఆదాయంలో మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా మనల్ని అధిగమించింది (2,227 డాలర్లు). ప్రస్తుతం 2100 డాలర్లతో తలసరి ఆదాయం విషయంలో ప్రపంచ దేశాల్లో మన ర్యాంక్ 144 స్థాయిలో అట్టడుగున ఉంది. అయితే, దేశ జనాభాలో 35 ఏళ్ల వయస్సు లోపు వారు 65 శాతం ఉండటం.. యువ భారత్ భవిష్యత్తుకు ఢోకా లేదనే నమ్మకాన్ని పెంచుతోంది. వచ్చే రెండు దశాబ్దాల పాటు ఏటా 12 లక్షల మంది కార్మిక శక్తి దేశానికి జతవుతుందని... 2030 నాటికి పని చేసే జనాభా (15–60 ఏళ్ల వయస్సు) 100 కోట్లకు చేరుతుందనేది పీడబ్ల్యూసీ తాజా అంచనా. ఇదే గనుక జరిగితే దేశంలో ఆర్థిక అసమానతలు దిగిరావడంతో పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాకారం అవుతుందని, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందనేది ఆర్థికవేత్తల మాట. -
స్వాతంత్ర్య దినోత్సవం: ఆకట్టుకున్న యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విశాఖ తీరంలో యుద్ధ నౌకల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలు ప్రత్యేక అలంకరణలో కనిపించాయి. -
ఏపీ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీజే అరూప్ గోస్వామి జాతీయ జెండా ఆవిష్కరించారు. శాసనసభలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్ తమ్మినేని శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలిలో ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలో స్పెషల్ సీఎస్ సతీష్‌చంద్ర జాతీయ జెండా ఎగురవేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, సీఎం జగన్ చేస్తున్న మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంచి చేస్తున్నాం కాబట్టే.. మొన్నటి ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీకి పట్టం గట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకున్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి.. అటుపై సాయుధ దళాల నుంచి గౌరవ వందనం అందుకున్నారు ఆయన. అనంతరం కోటలోని రాణిమహల్ ప్రాంగణం నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ‘‘ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఏడేళ్లలో స్థిరమైన ఆర్ధిక అభివృద్దితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా చాటి చెప్పారు. దేశంలో కనీస అవసరాల కోసం ప్రజలు ఇంకా అల్లాడే పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశం సాధించిన అభివృద్దిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకొన్న రోజు నుండి అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఇప్పుడు లేవన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లో మిగులు సాధ్యమౌతోందన్నారు.రాష్ట్ర జీఎస్డీపీలో 20 శాతం వ్యవసాయరంగం నుండి వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దండగ అనుకొన్న వ్యవసాయం పండుగలా మారిందని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఆ సంస్కరణలతో తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా నిలిచిందని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రైతులకు రూ.50వేల లోపు రుణాల మాఫీ ఇవ్వడంతో పాటు ధరణి పోర్టల్ ద్వారా భూమి లెక్కలు తేల్చామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, వరంగల్‌లో అధునాతన ఆస్పత్రిని నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. -
రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ అధికారులకు సేవా పతకాలను సీఎం అందజేశారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇక్కడ చదవండి: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్లు.. వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్ ‘‘గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్బీకేల ద్వారా సేవలు అందిస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1039 కోట్లు చెల్లించాం. ఏపీ అమూల్ పాలవెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచామని’’ సీఎం అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు.. "నాడు-నేడు" ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నాం. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. మా ప్రభుత్వం.. మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్కాచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని’’ సీఎం అన్నారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు.. ‘‘అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.9వేల కోట్లు ఇచ్చాం. డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు అందించాం. మహిళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీస్స్టేషన్లు, దిశా యాప్‌లు తీసుకొచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీకిందకు తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నిర్మాణం జరుగుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తెచ్చి ఉచితంగా చికిత్స అందించాం. కొత్తగా 16 వైద్య బోధనా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. అర్హత ఉన్న 61 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
మగువా మగువా.. ఉందా నీకు విలువా?
75వ స్వాతంత్య్ర వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నాం. తొంభై ఏళ్ల పోరాటాలు, యోధుల త్యాగాల దగ్గరి నుంచి ఇన్నేళ్లలో దేశం సాధించిన అభివృద్ధి దాకా అన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. బాగానే ఉంది.. మరి అప్పటి పోరాటంలో, ఇప్పటిదాకా సాధించిన ప్రగతిలో పాలుపంచుకున్న మహిళల మాటేంటి? వాళ్లకు సరైన ప్రాధాన్యం దక్కుతోందా? మగవాళ్లతో అన్నింటా పోటీ పడుతూ తానై నిలుస్తున్నా.. నిజమైన స్వేచ్ఛకు మహిళ ఎందుకు దూరంగా ఉంటోంది! ఇంతకీ అఖండ భారతావనిలో మగువకు స్థానం ఎక్కడుందసలు? -
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్ గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం తిలకించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
జాతి నిర్మాణానికి అంకితమవుదాం: గవర్నర్ బిశ్వభూషణ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ గా జరుపుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలను ఆస్వాదించడానికి మనకు మార్గం సుగమం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధులందరినీ స్మరించుకునేది ఈ రోజు అన్నారు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలను ప్రతిష్టించిన రోజు ఇదేనని తెలిపారు. ఈ రోజున జాతి నిర్మాణానికి అంకితమవుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవాలని కోరారు. -
11 మంది ఏపీ పోలీసులకు శౌర్య పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సత్తా చాటారు. 11 మంది పోలీస్ శౌర్య పతకాలు, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 14 మంది ప్రతిభా పోలీసు పతకాలు దక్కించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాలు, 628 మందికి పోలీస్ శౌర్య పతకాలు, 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు ప్రకటించింది. ► ఏపీ నుంచి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు దక్కించుకున్నవారు: నలగట్ల సుధాకర్‌రెడ్డి (డీఎస్పీ, చిత్తూరు), పి.సీతారామ్ (కమాండెంట్, అదనపు డీజీపీ కార్యాలయం, గ్రేహౌండ్స్) ► ఏపీ నుంచి ప్రతిభా పోలీస్ పతకాలు వీరికే: కె.రఘువీర్‌రెడ్డి (ఏఎస్పీ, ఇంటెలిజెన్స్, రాజమహేంద్రవరం), కె.సదాశివ వెంకట సుబ్బారెడ్డి (ఏఎస్పీ, ఒంగోలు), కె.నవీన్‌కుమార్ (ఏఎస్పీ, అదనపు డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్), వట్టికుంట వెంకటేశ్వర నాయుడు (ఏసీపీ, దిశ పోలీస్‌స్టేషన్, విజయవాడ), చింతపల్లి రవికాంత్ (ఏసీపీ, సిటీ స్పెషల్ బ్రాంచ్, విజయవాడ), వెంకటప్ప హనుమంతు (అసిస్టెంట్ కమాండెంట్, 6వ బెటాలియన్, ఏపీఎస్పీ, మంగళగిరి), జి.రవికుమార్ (డీఎస్పీ, తిరుపతి), కడిమిచెర్ల వెంకట రాజారావు (డీఎస్పీ, పీటీవో, మంగళగిరి), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్డీపీవో, నెల్లూరు), బోళ్ల గుణ రాము (ఇన్స్పెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, విజయవాడ), మద్ది కోటేశ్వరరావు (ఎస్ఐ, సీసీఎస్, శ్రీకాకుళం), మేడిద వెంకటేశ్వర్లు (ఏఆర్ఎస్ఐ, నెల్లూరు), రమావత్ రామనాథం (ఏఆర్ఎస్ఐ, సీఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఈర్వ శివశంకర్‌రెడ్డి (ఏఆర్ఎస్ఐ, 9వ బెటాలియన్, వెంకటగిరి). కేంద్ర హోం శాఖ పరిధిలోని అధికారులకు ప్రతిభా పోలీస్ పతకం: రాజ్‌కుమార్ మద్దాలి (అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్–2, విజయవాడ) ► ఏపీ నుంచి పోలీస్ శౌర్య పతకాలు దక్కించుకున్నవారు: ఎస్.బుచ్చిరాజు (జేసీ), జి.హరిబాబు (జేసీ), ఆర్.రాజశేఖర్ (డీఏసీ), డి.మబాష (ఏఏసీ), బి.చక్రధర్ (జేసీ), కె.పాపినాయుడు (ఎస్ఐ), సీహెచ్ సాయిగణేష్ (డీఏసీ), ఎం.ముణేశ్వరరావు(ఎస్సీ), ఎం.నాని (జేసీ), పి.అనిల్‌కుమార్ (జేసీ), టి.కేశవరావు (హెచ్‌సీ) కాళంగి దళ ఎన్‌కౌంటర్‌తో గుర్తింపు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం పొందిన నలగట్ల సుధాకర్‌రెడ్డి కడపలో డిగ్రీ, తిరుపతిలో పీజీ చేశారు. 1991లో ఎస్ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం చిత్తూరు నగర డీఎస్పీగా పనిచేస్తున్నారు. 1995లో శ్రీకాళహస్తిలో జరిగిన కాళంగి దళ ఎన్‌కౌంటర్‌తో ఈయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదే ఏడాది సామపాటి అనే దోపిడీ ముఠాను పట్టుకుని 155 తుపాకులు, రూ.10 లక్షల నగదు సీజ్ చేశారు. 2008లో తిరుపతిలో ఆరేళ్ల పాపను హత్య చేసిన కేసులో దోషిని అరెస్టు చేసి జీవితఖైదు పడేలా చూశారు. 2010లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్యాక్షన్, మట్కా కట్టడిలో విశేష ప్రతిభ చూపారు. 2010లో సేవాపతకం, 2012లో ఇండియన్ పోలీస్ మెడల్, 2015లో ఉత్తమ సేవాపతకం పొందారు. 400కు పైగా క్యాష్ రివార్డులు, 27 ప్రశంసపత్రాలు కూడా లభించాయి. -
త్యాగధనులను దేశం స్మరించుకుంటోంది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోటలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానమని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 54 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారని.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అని మోదీ అన్నారు. ‘‘భారత అథ్లెట్లు నవయువతకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. మన రణనినాదం కావాలి. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలని’’ ప్రధాని మోదీ అన్నారు. ‘‘సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి. పోషకాహారంతోపాటు వైద్యం కూడా అత్యంత కీలకమైంది. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రికి వైద్య వసతులతోపాటు ఆక్సిజన్ ప్లాంటుకు చర్యలు తీసుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం వైద్యుల సంఖ్యను పెంచాల్సి ఉంది. వైద్యుల సంఖ్యను పెంచేందుకు వైద్యవిద్యలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ఓబీసీల్లో ఎవరు ఉండాలనే దానిపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చాం. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగేలా చూడాలి. చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాల్సిన అవసరం ఉందని’’ ప్రధాని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ వికాసానికి చర్యలు చేపట్టామని మోదీ అన్నారు. లద్ధాఖ్‌లో సింధూ సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్నెట్ను గ్రామస్థాయికి అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘ఫసల్ బీమా యోజనతో చిన్న రైతులకు మేలు జరుగుతోంది. కిసాన్ రైల్‌తో చిన్నకారు రైతులకు మేలు జరుగుతోంది. ప్రతి ఈశాన్య రాష్ట్ర రాజధానిని రైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తాం. 25 ఏళ్లలో నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. లద్దాఖ్ అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయి. ఆన్లైన్ ద్వారా మన ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయిస్తున్నాం. డిజిటల్ విప్లవంతో ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు అవసరం. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గుతోంది. దేశంలో 80శాతం రైతులు ఐదెకరాల లోపు భూమి కలిగినవారే. చిన్న, సన్నకారు రైతులు దేశానికి గర్వకారణం అయ్యేలా పథకాలు ఉండాలి. రైతు పంటకు మంచి ధర లభించే సౌకర్యం కల్పించాలి. దేశంలో కొత్త సంపద సృష్టికర్తల తరం ప్రారంభమైంది. నూతన ఆవిష్కరణలతో నవీన పారిశ్రామికవేత్తలు ఎదుగుతున్నారని’’ ప్రధాని మోదీ అన్నారు. -
ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎర్రకోటపై ప్రధాని హోదాలో 8వసారి ప్రధాని మోదీ జెండా ఎగరవేశారు. సైనిక దళాల నుంచి గౌరవ వందనం ప్రధాని స్వీకరించారు. వైమానికదళ హెలికాఫ్టర్లు పూలవర్షం కురిపించాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోది జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందన్నారు. Delhi | PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 75th Independence Day (Photo source: DD News) pic.twitter.com/n9sybFSV1f — ANI (@ANI) August 15, 2021 Delhi | Defence Minister Rajnath Singh, MoS Defence Ajay Bhatt and Defence Secretary Dr Ajay Kumar receive Prime Minister Narendra Modi at Red Fort pic.twitter.com/QvqinS7kmf — ANI (@ANI) August 15, 2021 Delhi | Prime Minister Narendra Modi inspects the guard of honour at Red Fort pic.twitter.com/Y2tMYsFQ62 — ANI (@ANI) August 15, 2021 Prime Minister Narendra Modi hoists the National Flag from the ramparts of Red Fort to celebrate the 75th Independence Day pic.twitter.com/0c3tZ6HQ3X — ANI (@ANI) August 15, 2021 -
సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబు
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రదిన వేడుకలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబయింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు సీఎంవోలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. సీఎంవో ముఖ్య అధికారులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలోనే అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ముస్తాబయ్యాయి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. -
జైషే ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ: స్వాతంత్రదినోత్సవం రోజునే బైక్‌బాంబును పేల్చి విధ్వంసం సృష్టించాలన్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ పన్నాగాన్ని భద్రతాబలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. జమ్మూ జిల్లా కేంద్రంలో బాంబు పేలుడుకు సిద్ధమైన నలుగురు జైషే ఉగ్రవాదులు, వారికి సాయపడిన ఉత్తరప్రదేశ్ వాసిని, వారి సహాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. డ్రోన్ల ద్వారా అందే ఆయుధాలను తోటి ఉగ్రవాదులకు చేరవేసే పనిలో బిజీగా ఉండగా వీరిని అరెస్ట్‌చేశారు. అయోధ్య రామజన్మభూమిపై నిఘా పెట్టాలని, దాడికి సంబంధించిన ఆయుధాలను అమృత్‌సర్‌లో డ్రోన్ ద్వారా అందుతాయని, పాక్‌లోని ఉగ్రవాది.. యూపీకి చెందిన సోనూ ఖాన్ అనే వ్యక్తిని ఆదేశించాడు. ఆ పని పూర్తిచేసేలోపే పోలీసులు ఖాన్‌ను అరెస్ట్‌చేశారు. -
శత్రు దుర్భేద్యంగా ఢిల్లీ
న్యూఢిల్లీ: డెభ్బై ఐదవ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ అంతటా అనూహ్య రీతిలో భద్రతా బలగాలను మోహరించారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో నిఘాను పెంచారు. ఎనిమిది నెలలుగా సాగు చట్టాలపై రైతులు ఉద్యమిస్తున్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోనూ గస్తీని ఎక్కువచేశారు. వేడుకలకు ప్రధానవేదిక అయిన, ప్రధాని మోదీ ప్రసంగించనున్న ఎర్రకోట వద్ద బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్ టర్మినల్స్ వద్ద పోలీసుల సంఖ్యను పెంచారు. జమ్మూ ఎయిర్‌పోర్టులోని వైమానిక స్థావరంపై ఉగ్ర డ్రోన్ దాడి నేపథ్యంలో ఎర్రకోట వద్ద యాంటీ– డ్రోన్ వ్యవస్థతో బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉగ్ర కుట్రలను భగ్నంచేసేందుకు యమునా తీరప్రాంతాలుసహా నగరంలోని ముఖ్యప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను అధికంచేశారు. కొత్తగా అద్దెకొచ్చిన వారిని, సిమ్‌కార్డులు, పాత కార్లు, బైక్‌లు అమ్మే డీలర్లను అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో విచారిస్తున్నారు. 16వ తేదీ వరకు హాట్ ఎయిర్బెలూన్లుసహా మరే ఇతర ఎగిరే వస్తువులను ఢిల్లీ గగనతలంపైకి తేవడాన్ని నిషేధించారు. ఆదివారం ఉదయం ఎర్రకోటపై మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని మోదీ ఎగరేయనున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి వాయుసేనకు చెందిన ఎంఐ–17 1వీ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించనున్నాయి. వేడుకల్లో రెండు ఎంఐ హెలికాప్టర్లు పాల్గొనడం ఇదే తొలిసారి. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. హెల్త్‌వర్కర్ల వంటి కోవిడ్ వారియర్స్‌ను సత్కరించేందుకు దక్షిణం వైపు ప్రత్యేక వేదిక ఏర్పాటుచేశారు. 1.5 కోట్ల మంది జాతీయ గీతం పాడారు.. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 1.5 కోట్ల మంది భారతీయులు జాతీయ గీతం ఆలపిస్తూ వీడియోలు చిత్రీకరించి రాష్ట్రగాన్డాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేశారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో పాల్గొనాలని గత నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ తన మన్‌కీబాత్ కార్యక్రమంలో కూడా పిలుపునిచ్చారు. దీంతో దేశవిదేశాల్లోని భారతీయులు జనగణమన ఆలపిస్తూ వీడియోలు అప్లోడ్ చేశారు. ఇందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారి వరకు పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ఆగస్టు 14.. విభజన గాయాల సంస్మరణ దినం
న్యూఢిల్లీ: ఇకపై ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని విభజన గాయాల సంస్మరణ దినంగా పాటించనున్నట్లు ప్రధాని∙మోదీ శనివారం ప్రకటించారు. దేశ విభజన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఆ సమయంలో ప్రజలు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారని, ఎన్నెన్నో త్యాగాలు చేశారని, వాటిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 14ను విభజన గాయాల సంస్మరణ దినం జరుపుకుందామని పిలుపునిచ్చారు. దేశ విభజన సృష్టించిన మతిలేని ద్వేషం, హింస కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక విభజనలు తొలగిపోవాలని, సామరస్యం పెంపొందాలని, ఏకత్వం అనే స్ఫూర్తి బలోపేతం కావాలని, మానవ సాధికారత పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఆశయాలను విభజన అకృత్యాల సంస్మరణ దినం మనకు గుర్తు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ నుంచి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆగస్టు 14ను విభజన గాయాల సంస్మరణ దినంగా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానమంత్రి నిర్ణయాన్ని హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. దేశ విభజన గాయాన్ని, సన్నిహితులను కోల్పోయామని వారి ఆవేదనను మాటల్లో వర్ణించలేమని అన్నారు. దేశ విభజన సమయంలో ఎందరో భరతమాత బిడ్డలు తమ జీవితాలను త్యాగం చేశారని కేంద్ర హోంశాఖ శ్లాఘించింది. బ్రిటీష్ వలస పాలకుల దుర్నీతి కారణంగా 1947లో భారతదేశం రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్ రెండు ముక్కలై పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఆగస్టు 14న పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం రాగా, భారత్ ఆగస్టు 15న వలస పాలకుల చెర నుంచి విముక్తి పొందింది. భారతదేశ విభజన మానవ చరిత్రలోనే అతిపెద్ద వలసలకు బీజం చేసింది. ఈ విభజన వల్ల 2 కోట్ల మంది ప్రభావితమైనట్లు అంచనా. -
ప్రజాస్వామ్యంలో పార్లమెంటే దేవాలయం
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ఒక దేవాలయం. ప్రజల సంక్షేమం కోసం చర్చలు, సంవాదాలు జరిగే, నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత వేదిక’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. నిరంతర అంతరాయాలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొనడం, పాలక– ప్రతిపక్షాలు పట్టుదలకు పోవడంతో షెడ్యూల్‌కంటే రెండురోజుల ముందే సమావేశాలు అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రథమపౌరుడు ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకున్న విశిష్టతపై మాట్లాడటం గమనార్హం. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కోవింద్ టీవీలో దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. కోవిడ్–19 రెండో వేవ్ సృష్టించిన విలయం నుంచి దేశం ఇంకా బయటపడలేదని చెప్పారు. మహమ్మారి విషయంలో ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో మధ్యలోనే అస్త్ర సన్యాసం చేయొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఇంకా ఏం మాట్లాడారంటే.. ► మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం. ► కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల్లో నెలకొన్న అపోహలను తొలగించాలి. రైతుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ► వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు మన అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తాయి. వారు తమ పంట ఉత్పత్తులకు మరింత మేలైన ధర పొందడానికి ఈ సంస్కరణలు ఉపకరిస్తాయి. ► కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా వైద్య రంగంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించింది. ► వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కృషి వల్ల కరోనా సెకండ్ వేవ్‌పై పైచేయి సాధించగలిగాం. ► కరోనా ప్రతికూల కాలంలో కూడా వ్యవసాయ రంగంలో పురోగతి సాధించాం. మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వ్యాపారులు, వలస కార్మికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ► కరోనా వ్యాప్తి వల్ల నష్టపోయిన రంగాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తిరిగి కోలుకునేందుకు తగిన సాయం అందిస్తోంది. ► కోవిడ్–19 నియంత్రణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 50 కోట్లకు పైగా టీకా డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లే రక్షణ కవచం. కరోనా తీవ్రత కొంత తగ్గినప్పటికీ వైరస్ ఇంకా పూర్తిగా పోలేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ► భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని చాలామంది అనుమానించారు. ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ► పురాతన కాలంలోనే భారత గడ్డపై ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డాయి. ఆధునిక యుగంలోనూ ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఎన్నో పశ్చి మ దేశాల కంటే భారత్ ముందంజలో ఉంది. ► సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ► మన పార్లమెంట్ త్వరలో కొత్త భవనంలోకి మారబోతోంది. ఇది భారతీయులందరికీ గర్వకారణం. ► మీ కుమార్తెలకు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు కల్పించండి అని తల్లిదండ్రులను కోరుతున్నా. ► ఉన్నత విద్యా సంస్థల నుంచి సైనిక దళాల దాకా.. ప్రయోగశాల నుంచి క్రీడా మైదానాల దాకా ప్రతిచోటా ఆడబిడ్డలు వారిదైన ముద్ర వేస్తున్నారు. ► ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వారికి అభినందనలు. 121 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన దేశం ఈసారి గతంలో కంటే అధికంగా పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయం. ► భారత క్రీడాకారిణులు ఎన్నో అవరోధాలను అధిగమించి ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. ► మన ఆడబిడ్డల ప్రతిభా పాటవాలు, వారు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే భవిష్యత్తుకు సంబంధించిన అభివృద్ధి చెందిన భారత్‌ను ఇప్పుడే దర్శించగలుగుతున్నా. అగ్రస్థానానికి ఎదిగిన ఆడపిల్లల కుటుంబాల నుంచి నేర్చుకోవాలని, వారికి అవకాశాలు కల్పించేందుకు తోడ్పడాలని తల్లిదండ్రులకు నా సూచన. ► జమ్మూకశ్మీర్‌లో కొత్త పొద్దు పొడిచింది. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కలలను నిజం చేసుకొనేందుకు ప్రజాస్వామిక మార్గాల్లో కృషి చేయాలి. ► ఆధునిక పారిశ్రామిక విప్లవం మానవళికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. వాతావరణ మార్పులు పెనుశాపంగా మారుతున్నాయి. ► మంచు కరిగిపోయి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పారిస్ వాతావణ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉంది. అంతేకాదు వాతావరణ పరిరక్షణకు భారత్ చేయాల్సిన దానికంటే ఎక్కువ కృషి చేస్తోంది. ఈ విషయంలో మిగతా ప్రపంచ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ► ను ఇటీవల బారాముల్లాలో డాగర్ వార్ మెమోరియల్‌ను సందర్శించా. అక్కడ ‘నేను చేసే ప్రతి పని దేశం కోసమే’అని రాసి ఉంది. ఇదే మన నినాదం కావాలి. దేశ ప్రగతి కోసం పూర్తి అంకితభావంతో పని చేయాలి. భారత్‌ను అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడానికి మనమంతా ఒక్క తాటిపైకి రావాలి. -
స్వాతంత్య సమరయోధుల త్యాగాలను మరిచిపోలేం: రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సాతంత్ర్య సమరయెధుల త్యాగాలను మరిచిపోలేమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్ విజేతలను అభినందించారు. కరోనాపై పోరు ఇంకా ముగియలేదని, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 50 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించామని రాష్ట్రపతి తెలిపారు. -
1947, ఆగస్టు 15 నాటి పలు దిన పత్రికల హెడ్ లైన్స్ ఇవే..
సాక్షి, వెబ్‌డెస్క్ : అఖండ భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించి రేపటితో 75 ఏళ్లు. ఈ 75 ఏళ్లుగా మనం అనువభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు.. స్వాతంత్ర్య సమర యోధుల వందల ఏళ్ల పోరాట ఫలం. లాఠీ దెబ్బలు.. బుల్లెట్ గాయాలు.. రక్తపుటేర్లు.. బంధిఖానాలు.. బలిదానాలు రవి అస్తమించని బ్రిటీష్ పాలనలో నిత్య కృత్యాలు. కశ్మీర్లో అన్యాయం జరిగితే కన్యాకుమారిలోని ఇంట్లో కూర్చుని తెలుసుకోవాటానికి.. అక్కడి నుంచే ప్రశ్నించటానికి ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ లాంటి జెట్ స్పీడ్ సోషల్ మీడియా లేని రోజులవి. టీవీలు, రేడియోలు ఉన్నా.. సామాన్య ప్రజలకు అందుబాటులో లేవవి. అలాంటి రోజుల్లో నిన్న ఏం జరిగిందో..రేపు ఏం జరగబోతోందో తెలుసుకోవటానికి.. జాతిని ఏకం చేయటానికి.. ఉద్యమ వీరులకు, సామాన్య ప్రజలకు వారధులుగా నిలవటానికి వార్తా దిన పత్రికలు ముఖ్య భూమిక పోషించాయి. ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించాయి. సుత్తి లేకుండా.. సూటిగా వార్తలను.. కాదు,కాదు సంఘటనలను జనాలకు అందించాయి. అలాంటి దినపత్రికలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఉదయం ప్రజల్ని ఎలా పలకరించాయి.. ఏఏ శీర్షికలు పెట్టాయంటే.. 1947, ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా ఉన్న పలు దినపత్రికల్లోని హెడ్డింగ్స్... ఫొటో క్రెడిట్: ఆంధ్రపత్రిక ఫొటో క్రెడిట్ : మలయాళ మనోరమ ఫొటో క్రెడిట్ : హిందుస్తాన్ ఫొటో క్రెడిట్ : గుజరాత్ సమాచార్ ఫొటో క్రెడిట్ : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫొటో క్రెడిట్ : హిందూస్తాన్ టైమ్స్ ఫొటో క్రెడిట్ : టైమ్స్ ఆఫ్ ఇండియా ఫొటో క్రెడిట్ : ది హిందూ కన్నడ పత్రిక ఫొటో క్రెడిట్ : ది ట్రిబ్యున్ -
Independence Day 2021: జాతీయ గీతాన్ని మార్మోగించాడు
భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. ఆగస్టు 15తో 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతావని జాతీయ గీతాన్ని జపాన్ గడ్డపై మారుమోగించాడు. -
Independence Day 2021: ఇండిపెండెన్స్ టూర్.. ఎందరో మహానుభావులు
ఒక అల్లూరి... ఒక ఆజాద్. ఓ మహాత్ముడు... ఓ ఉక్కు మనిషి. అందరిదీ ఒకటే నినాదం... జైహింద్. మంగళ్‌పాండే పేల్చిన తుపాకీ... లక్ష్మీబాయి ఎత్తిన కత్తి... భగత్‌సింగ్ ముద్దాడిన ఉరితాడు... అందరిదీ ఒకటే సమరశంఖం. అదే... భారతదేశ విముక్తపోరాటం. డయ్యర్ దురాగతానికి సాక్షి జలియన్ వాలాబాగ్. దేశభక్తిని ఆపలేని ఇనుపఊచల అండమాన్ జైలు.సంకల్ప శుద్ధితో బిగించిన ఉప్పు పిడికిలి దండు. వీటన్నింటినీ ప్రకాశవంతం చేసిన దేవరంపాడు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా... దేశమాతకు సెల్యూట్ చేస్తూ చూడాల్సిన కొన్ని ప్రదేశాలు. దేవరంపాడు: ప్రకాశ వీచిక ఆ రోజు 1928, అక్టోబరు నెల. స్వాతంత్య్ర సమరయోధులు మద్రాసు (చెన్నై) పారిస్ కార్నర్లో గుమిగూడారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ‘సైమన్ గో బ్యాక్’ అంటూ ఏకకంఠంతో నినదించారు. బ్రిటిష్ అధికారుల ఆదేశాలతో పోలీసులు ఉద్యమకారుల మీద కాల్పులు జరిపారు. పార్థసారథి అనే దేశభక్తుడు అక్కడికక్కడే నేలకొరిగాడు. ఆ క్షణంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆవేశంగా ముందుకు వచ్చి ‘కాల్చండిరా కాల్చండి’ అంటూ శాలువా తీసి ఛాతీ విరుచుకుని ముందుకొచ్చారు. ఆ గొంతులో పలికిన తీక్షణతకు పోలీసులు చేష్టలుడిగిపోయారు. ఆ చోటులోనే ప్రకాశం పంతులు విగ్రహం ఉంది. చెన్నై వెళ్లిన ప్రతి తెలుగు వారూ తప్పక చూడాల్సిన ప్రదేశం. ప్రకాశం పంతులు చివరిక్షణాల్లో జీవించిన దేవరంపాడు కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. దేవరంపాడు గ్రామం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడి స్థానిక రాజకుటుంబీకులు విరాళంగా ఇచ్చిన పన్నెండు ఎకరాల మామిడితోట ప్రస్తుతం జాతీయ స్మారక చిహ్నాల సుమహారం. ఇందులో వందేమాతర విజయధ్వజం, గాంధీ– ఇర్విన్ ఒడంబడిక సందర్భంగా త్రివర్ణ స్థూపం ఉన్నాయి. ప్రకాశం పంతులు చివరి రోజుల్లో ఇక్కడే జీవించారు. ఏటా ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్, మంత్రులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యాటకులు ఒంగోలులో బస చేసి దేవరంపాడుకి వెళ్లి రావచ్చు. హుస్సేనీవాలా: విప్లవ జ్ఞాపకం పంజాబ్ రాష్ట్రం, ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఉంది హుస్సేనీవాలా గ్రామం. ఇది అమర వీరుల స్మారక చిహ్నాల నేల. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల గౌరవార్థం రోజూ సాయంత్రం జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని భారత్– పాకిస్థాన్ సైనికులు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఈ అమరవీరుల జ్ఞాపకార్థం వీరు ముగ్గురూ ప్రాణాలు వదిలిన రోజును గుర్తు చేసుకుంటూ ఏటా మార్చి 23వ తేదీన ప్రభుత్వం షాహీద్ మేళా నిర్వహిస్తారు. అహ్మదాబాద్: ఐక్యత వేదిక అహ్మదాబాద్ వెళ్లగానే మొదట సబర్మతి నది తీరాన ఉన్న గాంధీ మహాత్ముని ఆశ్రమం వైపు అడుగులు పడతాయి. మన జాతీయోద్యమంలో అనేక ముఖ్యమైన ఉద్యమాలకు ఇక్కడే నిర్ణయం జరిగింది. అందుకే దీనిని సత్యాగ్రహ ఆశ్రమం అంటారు. ఈ ఆశ్రమంలో అణువణువూ గాంధీజీ నిరాడంబరమైన జీవితాన్ని, జాతీయోద్యమం పట్ల ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నగరంలో చూసి తీరాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక భవనం. అహ్మదాబాద్ నగరం షాహీబాగ్‌లో ఉన్న మోతీ షాహీ మహల్‌ను పటేల్ మెమోరియల్‌గా మార్చారు. సర్దార్ పటేల్ నేషనల్ మెమోరియల్‌లో పటేల్ జీవితంతోపాటు జాతీయోద్యమం మొత్తం కళ్లకు కడుతుంది. ఒక్కో గది ఒక్కో రకమైన విశేషాలమయం. పటేల్ జీవితంలో జైలు ఘట్టాలతోపాటు, బాల్యం, స్వాతంత్య్ర పోరాటం, జాతీయనాయకులతో చర్చల చిత్రాలు, ఆయన ఉపయోగించిన వస్తువులు కూడా ఉంటాయి. కృష్ణదేవి పేట: అల్లూరికి వందనం తెలుగు జాతి గర్వపడే వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు... అల్లూరి సీతారామ రాజు సమాధి విశాఖపట్నం జిల్లా, గోలుగొండ మండలం, కృష్ణదేవి పేట (కె.డి. పేట)లో ఉంది. ప్రభుత్వం దీనిని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తోంది. ఇక్కడి ప్రజలు కూడా అల్లూరి సమాధి అని మన మాట పూర్తయ్యేలోపు ఎలా వెళ్లాలో దారి చూపిస్తారు. ఈ ప్రదేశంలో సీతారామరాజు పేరుతో పార్కును అభివృద్ధి చేశారు. అల్లూరి సీతారామరాజు సమాధికి సమీపంలోనే సీతారామరాజు అనుచరులు మల్లుదొర, ఘంటం దొర సమాధులు కూడా ఉన్నాయి. ఒక భవనంలోని ఫొటో గ్యాలరీలో సీతారామరాజు జీవిత విశేషాలను, బ్రిటిష్ వారి మీద పోరాడిన ఘట్టాలను చూడవచ్చు. కృష్ణదేవి పేట గ్రామం విశాఖపట్నానికి పశ్చిమంగా నూటపది కిలోమీటర్ల దూరాన ఉంది. ప్రయాగ్‌రాజ్: ఆజాద్ ఆఖరి ఊపిరి అలహాబాద్ నగరంలో 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు ఆజాద్ స్మారకం. చంద్రశేఖర్ ఆజాద్ తుది శ్వాస వదిలిన చోట ఆయన స్మారక విగ్రహాన్ని స్థాపించారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) నగరంలో ఉంది. జాతీయోద్యమంలో భాగంగా ఆజాద్ 1931 ఫిబ్రవరి 27వ తేదీన పోలీసు అధికారుల మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. తాను పట్టుబడుతున్న క్షణంలో ఆజాద్ తన తుపాకీలోని చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. అప్పటి వరకు ఆల్ఫ్రెడ్ పార్కుగా ఉన్న పేరును ఆజాద్ పార్కుగా మార్పు చేశారు. దండి: ఉవ్వెత్తిన ఉప్పు దండు గుజరాత్ రాష్ట్రం, దండి తీరాన గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలియని భారతీయులు ఉండరు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఎనభై మంది సత్యాగ్రహులు 1930, మార్చి నెలలో దండి గ్రామం వరకు 241 కి.మీల దూరం ఈ మార్చ్ నిర్వహించారు. అహింసాయుతంగా శాసనోల్లంఘనం చేసిన ఉద్యమంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉద్యమం ఇది. ఇక్కడ ఉన్న ‘నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్’ను ప్రతి భారతీయుడు ఒక్కసారైనా సందర్శించి తీరాలి. పోర్టు బ్లెయిర్: బిగించిన ఉక్కు పిడికిలి భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ నాయకుల త్యాగాలను తలుచుకుంటాం. వారితోపాటు లక్షలాది మంది సామాన్యులు కనీస గుర్తింపుకు కూడా నోచుకోకుండా జీవితకాలం పాటు జైల్లో మగ్గి దేశం కోసం ప్రాణాలు వదిలారు. వారికి నివాళి అర్పించాలంటే అండమాన్ దీవుల రాజధాని నగరం పోర్టు బ్లెయిర్‌లోని సెల్యూలార్ జైలును సందర్శించాలి. ఇది నేషనల్ మెమోరియల్ మాన్యుమెంట్. వీర సావర్కర్ వంటి ఎందరో త్యాగధనులు జైల్లో ఎంతటి దుర్భరమైన జీవితాన్ని గడిపారో కళ్ల ముందు మెదిలి గుండె బరువెక్కుతుంది. వాళ్లు ధరించిన గోనె సంచుల దుస్తులు, ఇనుస సంకెళ్లు, నూనె తీసిన గానుగలు వారిలోని జాతీయత భావానికి, కఠోరదీక్షకు నిదర్శనలు. జలియన్ వాలాబాగ్: డయ్యర్ మిగిల్చిన చేదు జ్ఞాపకం బ్రిటిష్ పాలకుల చట్టాలను వ్యతిరేకిస్తూ సమావేశమైన ప్రజల మీద జనరల్ డయ్యర్ ముందస్తు ప్రకటన లేకుండా విచక్షణరహితంగా కాల్పులు జరిపిన ప్రదేశం పేరు జలియన్ వాలాబాగ్. ఇది పంజాబ్, అమృత్‌సర్‌లో ఉంది. వేలాది మంది ప్రాణాలను హరించిన దుర్ఘటన 1919, ఏప్రిల్ 13వ తేదీన జరిగింది. దేశం కోసం నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన వారి జ్ఞాపకార్థం స్మారకం, అమరజ్యోతి, ప్రతీకాత్మక శిల్పాలు ఉన్నాయి. మౌనంగా నివాళులు అర్పించే లోపే మనోఫలకం మీద ఆనాటి బాధాకరమైన దృశ్యం కళ్ల ముందు నిలిచి, హృదయం ద్రవించిపోతుంది. మనదేశ చరిత్రలో అత్యంత కిరాతకుడిగా ముద్ర వేసుకున్న జనరల్ డయ్యర్ మీద బ్రిటిష్ ప్రభుత్వం... జలియన్ వాలా బాగ్ సంఘటన ఆధారంగా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. ఝాన్సీ: వీర తిలకం మనకు ఝాన్సీ పేరుతోపాటు రాణి లక్ష్మీబాయ్ పేరు పలకనిదే సంపూర్ణంగా అనిపించదు. బ్రిటిష్ పాలకుల మీద తొలినాళ్లలో కత్తి ఎత్తిన వీరనారి లక్ష్మీబాయ్. తొలి స్వాతంత్య్ర సమరంలో లక్ష్మీబాయ్ బ్రిటిష్ సేనలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించింది. ఆమె స్మారకాలు మూడు చోట్ల ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ కోట, నాటి ఝాన్సీ రాజ్యంలోని (మధ్యప్రదేశ్) పూల్‌బాగ్‌లో ఆమె సమాధి, స్మారక చిహ్నాలున్నాయి. వారణాసిలో ఆమె పుట్టిన చోట కొత్తగా మరో స్మారకనిర్మాణం జరిగింది. ఇందులో మణికర్ణిక పుట్టుక, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాణిగా బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఘట్టాలన్నీ కనిపిస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పర్యటించి తీరాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. బారక్‌పోర్: మంగళ్‌పాండే పేల్చిన తుపాకీ కోల్‌కతాలోని బారక్‌పోర్ కంటోన్మెంట్ ఏరియాలో మంగళ్‌పాండే జ్ఞాపకార్థం ‘షాహీద్ మంగళ్ పాండే మహా ఉద్యాన్’ పేరుతో విశాలమైన పార్కును నిర్మించారు. మంగళ్‌పాండే బ్రిటిష్ అధికారుల మీద దాడి చేసిన తర్వాత అతడిని ఉరితీసిన ప్రదేశం ఇది. ఈస్టిండియా కంపెనీలో సిపాయిగా చేరిన పాండే సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర వహించాడు. పాండేని బ్రిటిష్ పాలకులు 1857, ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఉరితీశారు. ఆ ప్రదేశంలో ఆయన స్మారక చిహ్నం ఉంది. -
దేశ భక్తిని తట్టిలేపే టాప్ 10 టాలీవుడ్ సినిమాలు ఇవే
యావత్ భారతదేశం గర్వకారణంగా, దేశభక్తిని గుండెలో నింపుకొని జరుపుకొనే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది భారతీయులను స్వత్రంత్ర్యం పొందిన గొప్ప రోజు ఇది. ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతోంది. ఈ 75 ఏళ్లలో దేశ భక్తిని చాటి చెప్పే ఏన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగులో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల ఓ లుక్కేద్దాం.! అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతోపాటు దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది. ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ అయ్యాయి. శుభాష్ చంద్ర బోస్ క్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ఇది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాం బాక్సాపీస్ వద్ద బోల్తా పడినప్పటీకీ.. వెంకటేశ్ నటన మాత్రం ఆకట్టుకుంది. భారతీయుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా,, అకాగే అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది. సైరా నరసింహారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. . బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్ల కట్టినట్లు చూపించారు. మహాత్మ 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాట’దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది. పరమ వీర చక్ర 2011 లో విడుదలైన తెలుగు చిత్రం ఇది. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఘాజీ 1971లో జరిగిన యదార్ధ యుద్దగాద నేపధ్యంలో విశాఖ సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఘాజీ. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. సర్దార్ పాపారాయుడు 1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. బొబ్బిలి పులి 1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.