History Of Economic Development In India After Independence - Sakshi
Sakshi News home page

మన ఆర్థిక ప్రస్థానం.. బ్రిటిష్‌ రాజ్‌... లైసెన్స్‌ రాజ్‌.. డిజిటల్‌ రాజ్‌!

Published Sun, Aug 15 2021 1:23 PM | Last Updated on Sun, Aug 15 2021 6:11 PM

The History of Economic Development In India After Independence - Sakshi

17వ శతాబ్దం ఆరంభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ వాటా 22.6 శాతం. అంటే దాదాపు యూరప్‌ మొత్తం వాటా (23%)తో సమానం. 1952 నాటికి మన వాటా 3.8 శాతానికి పడిపోయింది. కేంబ్రిడ్జ్‌ చరిత్రకారుడు ఆంగస్‌ మాడిసన్‌ వెల్లడించిన ఈ అంచనాలు చాలు...  బ్రిటిష్‌ పాలనలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా కుదేలయిందో చెప్పడానికి!
బ్రిటిష్‌ పాలకులు భారత్‌లో పారిశ్రామికీకరణను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో స్వాంత్రంత్య్రం పొందే నాటికి దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు 74 ఏళ్ల తర్వాత, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. కడు పేదరికం నుంచి డిజిటల్‌ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మన ఆర్థిక విధానాలు పోషించిన పాత్ర, మన ఆర్థికరంగంలో చోటు చేసుకున్న కీలక మార్పులపై 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఒక సింహావలోకనం. 

నెహ్రూ.. సర్వం ప్రభుత్వం చెప్పుచేతల్లోనే!
స్వాతంత్య్రం వచ్చాక అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చికిత్స ప్రారంభించారు. స్వావలంబనతో కూడిన ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, దారిద్య్ర నిర్మూలన లక్ష్యాలతో సోషలిజం ఛాయలతో కూడిన అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వమే ఒక ఎంట్రప్రెన్యూర్‌గా వ్యవహరించేలా 1948లో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధాన తీర్మానం దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రైవేటు కంపెనీలను పూర్తిగా ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంచుకునేలా విధానాలను రూపొందించారు. దేశంలో లైసెన్స్‌ రాజ్‌కు ఇక్కడే బీజం పడింది.

ఉక్కు, మైనింగ్, యంత్ర పరికరాలు, టెలికం, బీమా, విద్యుత్‌ తదితర కీలక పరిశ్రమల్లో ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగింది. అప్పటి సోవియెట్‌ యూనియన్‌ విధానాల ప్రభావంతో పంచ వర్ష ప్రణాళికలకు రూపకల్పన చేసిన నెహ్రూ సర్కారు... మొత్తం ప్రభుత్వ ప్రణాళికలను పర్యవేక్షించడం కోసం 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1951లో భారత్‌ మొట్టమొదటి పంచ వర్ష ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై ఈ ఐదేళ్లూ దృష్టి సారించారు. అధిక మొత్తంలో పొదుపులు, పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేలా పాలసీలను రూపొందించారు. ఈ తొలి పంచవర్ష ప్రణాళిక మంచి ఫలితాలనే అందించింది. 2.1 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాలను అధిగమించి 3.6 శాతం వృద్ధి సాకారమైంది.


లైసెన్స్‌ రాజ్‌...
1956 నాటి రెండో పంచవర్ష ప్రణాళిక దేశంలో ప్రభుత్వ రంగ కంపెనీల జోరుకు బాటలు వేయడంతో పాటు లైసెన్స్‌ రాజ్‌ ఆవిర్భావానికి కారణమైంది. భారత్‌లో పరిశ్రమలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి, రెండవ గ్రూపుల్లో ప్రధానమైన,  వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న కంపెనీలను పూర్తిగా ప్రభుత్వ రంగంలో చేర్చారు. ఇక మూడో గ్రూపులో కన్జూమర్‌ పరిశ్రమలను చేర్చి, వాటిని ప్రైవేటు రంగానికి వదిలేశారు. అయితే, లైసెన్సుల జారీ వ్యవస్థ ద్వారా ప్రైవేటు రంగంపై ప్రభుత్వం పూర్తి పెత్తనం చలాయించేలా విధానాలను రూపొందించడంతో అన్నింటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని, అధికారుల జోక్యం మితిమీరి, విపరీతమైన అవినీతికి దారితీసింది.
భాక్రా–నంగల్‌ టు భిలాయ్‌... భారతదేశ ఆధునిక దేవాలయాలు
ప్రభుత్వ ప్రణాళికల్లో విద్యుత్, ఉక్కు రంగాలను కీలకమైనవిగా నెహ్రూ భావించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సట్లెజ్‌ నదిపై నిర్మించిన భాక్రా బహుళార్థసాధక ప్రాజెక్టును పునరుజ్జీవ భారతదేశంలో కొత్త దేవాలయంగా ఆయన అభివర్ణించారు. భాక్రా–నంగల్‌తో పాటు అనేక జల విద్యుత్‌ ప్రాజెక్టులు దేశంలో లక్షలాది ఇళ్లలో వెలుగులు నింపాయి, అనేక ఫ్యాక్టరీలను నడిపించాయి, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించాయి. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో 60 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో, జర్మనీ సహకారంతో రూర్కెలా స్టీల్‌ ప్లాంట్‌.. రష్యా, బ్రిటన్‌ ఆధ్వర్యంలో భిలాయ్, దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), అణు ఇంధన కమిషన్‌ వంటి ఎన్నో ‘ఆధునిక దేవాలయాలు’ నెహ్రూ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. నెహ్రూ తదనంతరం ప్రధాని పగ్గాలు చేపట్టిన లాల్‌బహదూర్‌ శాస్త్రి హయాంలోనే ఆహార ధాన్యాలు, డెయిరీ రంగంలో స్వయం సమృద్ధికి దోహదం చేసిన హరిత విప్లవం, క్షీర విప్లవం చోటు చేసుకున్నాయి.

ఇందిర హయాం... బ్యాంకుల జాతీయీకరణ
నెహ్రూ, శాస్త్రి వెనువెంటనే మరణించడం... దేశంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. విదేశీ మారక నిల్వలు అడుగంటడం.. చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో 1966 జూన్‌ 6న ప్రధాని ఇందిరా గాంధీ డాలరుతో రూపాయి మారకం విలువను ఏకంగా 57 శాతం తగ్గించి 4.76 నుంచి 7.50కు తీసుకొచ్చేశారు. దీనివల్ల ఎగుమతులకు ఊతం లభించినా, దేశంలో ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వ్యవసాయ రుణాలను పెంచడమే లక్ష్యంగా 1969 జూలై 20న దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకుల కార్యకలాపాల్లో తీవ్ర రాజకీయ జోక్యం క్రోనీ క్యాపిటలిజానికి దారితీసి, విపరీతంగా మొండిబాకీలు పెరిగిపోయేందుకు కారణమైంది. 1975 జూన్‌ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిర... 1977 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.
డీమానిటైజేషన్‌ 1.0
1977లో అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్‌ సారథ్యంలోని జనతాపార్టీ.. నల్లధనానికి అడ్డుకట్టవేయడం కోసం రూ.1,000, రూ.5,000, రూ.10,000 బ్యాంకు నోట్లను రద్దు చేసింది. అప్పటి పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌... విదేశీ కంపెనీలపై కొరడా ఝుళిపించడంతో బహుళజాతి కంపెనీలైన ఐబీఎం, కోకాకోలా ఇక్కణ్ణుంచి దుకాణం సర్దేశాయి.


రాజీవ్‌పాలన... ఐటీ, టెలికం విప్లవానికి నాంది
1984 అక్టోబర్‌లో ఇందిర హత్యతో 40 ఏళ్ల వయస్సులో యువ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రాజీవ్‌ గాంధీ... ప్రత్యక్ష పన్నుల తగ్గింపు, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితుల పెంపు వంటి పలు సంస్కరణలు చేపట్టారు. అంతేకాదు దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), టెలికం విప్లవాలకు నాంది పలికిన ఘనత కూడా రాజీవ్‌కే దక్కుతుంది.


పీవీ సంస్కరణల హీరో...
1991లో భారత్‌ చెల్లింపుల సంక్షోభంతో దివాలా అంచున నిలబడింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌లు బంగారాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రుణాలు తీసుకొని దేశాన్ని గండం నుంచి గట్టెక్కించారు. లైసెన్స్‌ రాజ్‌కు అంతంతో పాటు మన ఎకానమీని మలుపు తిప్పిన విప్లవాత్మకమైన సంస్కరణలు, సరళీకరణకు తెర తీశారు. దీంతో భారత్‌కు విదేశీ కంపెనీలు క్యూ కట్టి, భారీగా ఉద్యోగాలకు దోహదం చేసింది.


వాజ్‌పేయి... ప్రైవేటీకరణకు సై
నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ) తరఫున ప్రధాని పగ్గాలు చేపట్టిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ సంస్కరణలు జోరందుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారాలు తెరిచి.. విదేశ్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వీఎస్‌ఎన్‌ఎల్‌), బాల్కో, హిందుస్థాన్‌ జింక్‌ తదితర కంపెనీలను విక్రయించారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల రూపురేఖల మార్చివేత వాజ్‌పేయి ఘనతే.


జీడీపీ వృద్ధి ‘మన్మోహనం’
1991లో ఆర్థిక మంత్రిగా సత్తా చూపిన మన్మోహన్‌ సింగ్‌... అనూహ్యంగా 2004లో యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) ప్రభుత్వ సారథిగా ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పలు సామాజికాభివృద్ధి పథకాలకు మన్మోహన్‌ సర్కారు బీజం వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో 5–20 శాతం వరకు వాటాలను విక్రయిచడం ద్వారా  ఈ పథకాలకు నిధులను సమకూర్చుకోగలిగారు. పదేళ్ల మన్మోహన్‌ పాలనలోనే భారత్‌ అత్యధిక జీడీపీ వృద్ధి రేటును (8–9 శాతం) సాధించింది. అయితే, 2008లో చోటుచేసుకున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ వృద్ధి పడకేసింది. అంతేకాదు, కార్పొరేట్లకు ఎడాపెడా ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారడంతో పాటు, 2జీ, కోల్‌ గేట్‌ వంటి పలు కుంభకోణాలు మన్మోహన్‌ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశాయి.


నోట్ల రద్దుతో మోదీ షాక్‌...
2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ పాలనలో దేశ ప్రజలు అనేక విప్లవాత్మకమైన సంస్కరణలతో పాటు తీవ్రమైన షాక్‌లను కూడా చవిచూశారు. 2016 నవంబర్‌ 8న రాత్రికి రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి దేశంలో అతిపెద్ద డీమానిటైజేషన్‌ను ప్రకటించడం ద్వారా మోదీ షాకిచ్చారు. దేశంలో తొలిసారి రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రజలు పడరాని పాట్లు పడినా, దేశంలో డిజిటల్‌ విప్లవానికి నాంది పడింది. మరోపక్క, దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకునే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి తీసుకొచ్చి సంస్కరణలను కొత్తపుంతలు తొక్కించారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. దివాలా చట్టం (ఐబీసీ)తో మొండిబాకీల సమస్యకు కొంతమేర పరిష్కారం చూపారు. మరోపక్క, మోదీ సర్కారు 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ కంపెనీల ప్రైవేటీకరణను వేగవంతం చేశారు. ఎల్‌ఐసీలో వాటానూ అమ్మకానికి పెట్టారు. ఆత్మనిర్భర్‌ భారత్, మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి కొత్త ఆలోచనలతో విద్యా, ఉద్యోగావకాశాల సృష్టిలో మోదీ సఫలం అయ్యారనే చెప్పొచ్చు. మోదీ హయాంలోనే భారత్‌ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.


సవాళ్లు ఉన్నా... ఉజ్వల భవిష్యత్తు
నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, బ్యాంకుల్లో మొండిబాకీల దెబ్బతో మందగించిన మన ఎకానమీపై.. కరోనా పంజా విసిరింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఫలితంగా 2020–21 జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 24.4 శాతం కుప్పకూలింది. భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే అత్యంత ఘోరమైన క్షీణతను చవిచూసింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా, ఎకానమీ దాదాపు 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరినా... ప్రజల్లో ఆర్థిక అసమానతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తలసరి ఆదాయంలో మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌ కూడా మనల్ని అధిగమించింది (2,227 డాలర్లు). ప్రస్తుతం 2100 డాలర్లతో తలసరి ఆదాయం విషయంలో ప్రపంచ దేశాల్లో మన ర్యాంక్‌ 144 స్థాయిలో అట్టడుగున ఉంది. అయితే, దేశ జనాభాలో 35 ఏళ్ల వయస్సు లోపు వారు 65 శాతం ఉండటం.. యువ భారత్‌ భవిష్యత్తుకు ఢోకా లేదనే నమ్మకాన్ని పెంచుతోంది. వచ్చే రెండు దశాబ్దాల పాటు ఏటా 12 లక్షల మంది కార్మిక శక్తి దేశానికి జతవుతుందని... 2030 నాటికి పని చేసే జనాభా (15–60 ఏళ్ల వయస్సు) 100 కోట్లకు చేరుతుందనేది పీడబ్ల్యూసీ తాజా అంచనా. ఇదే గనుక జరిగితే దేశంలో ఆర్థిక అసమానతలు దిగిరావడంతో పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాకారం అవుతుందని, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందనేది ఆర్థికవేత్తల మాట.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement