ప్రతి రూపాయీ బాధ్యతగా ఖర్చు
కోవిడ్ వల్ల ప్రభుత్వానికి ఆశించిన రీతిలో ఆదాయం రాలేదు. వ్యయం మాత్రం అనుకోని విధంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితి ఒక కుటుంబానికి వస్తే ఎంతగా తల్లడిల్లుతుందో అర్థం చేసుకుని ప్రభుత్వం కష్టకాలంలో పేదలకు అండగా నిలిచింది. అవినీతి, వివక్షకు తావు లేని విధంగా ప్రతి ఒక్క రూపాయీ ప్రజలకే నేరుగా ఇచ్చాం. మన ప్రభుత్వం ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేస్తోంది. ఈ ప్రభుత్వం మీది. మీరిచ్చిన అధికారంతో నేను సేవకుడిగా మాత్రమే ఇక్కడ ఉన్నా. స్వాతంత్య్రం సిద్ధించిన 74 ఏళ్ల తరవాత కూడా కనిపిస్తున్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దేందుకే ఇక్కడ ఉన్నా.
మార్పు మీరే చూడండి
మన గ్రామం లేదా నగరంలో కేవలం ఈ 26 నెలల్లోనే ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి మీరే గమనించండి. సచివాలయాల్లో 500కి పైగా సేవలతో దేశంలో సరికొత్త విప్లవానికి నాంది పలికాం. 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు సచివాలయాల్లో కనిపిస్తున్నాయి. ఒక్క రూపాయి కూడా లంచాలకు తావులేకుండా ప్రతి నెల 1వతేదీన సూర్యోదయానికి ముందే తలుపు తట్టి మరీ 2.70 లక్షల మంది వలంటీర్లు ఇంటివద్దే పింఛన్లు అందచేస్తున్న వ్యవస్థ కేవలం మనకే సొంతం. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, చకచకా కడుతున్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, డిజిటల్ గ్రంథాలయాలు, ఇంగ్లిష్‌లో బోధించే ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లతో మన గ్రామాల స్వరూపాలు మారుతున్నాయి.
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తన సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా తెలుసుకుని ఈ 26 నెలల పాలనలో రాష్ట్ర గతిని మార్చేలా నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మన రైతులు తమ రెక్కలకు మరింత బలం కావాలని కోరుకున్నారని, వెనకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలు మంచి భవిష్యత్తును, న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా కోసం తపించారని చెప్పారు. అక్కచెల్లెమ్మలు మహిళా సాధికారితను, వైద్యాన్ని ఒక హక్కుగా అందించాలని ప్రజలు కోరుకున్నారని తెలిపారు. మనిషిని మనిషిగా చూస్తూ సమన్యాయంతోపాటు లంచాలు లేని పారదర్శక వ్యవస్థ రావాలని ఆరాటపడ్డారన్నారు.
ఇవన్నీ అందించటమే నిజమైన పరిపాలన, ప్రజాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి అర్థం అని విశ్వసిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పోలీస్ పరేడ్‌ను వీక్షించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలివీ..
కొత్త లక్ష్యాలతో బాటలు వేద్దాం
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తై 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి పౌరుడికి నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నా. ఒక దేశాన్ని మరో దేశం.. ఒక జాతిని మరో జాతి... ఒక మనిషిని మరో మనిషి దోచుకోలేని వ్యవస్థ సాకారం కావాలని ఆనాడు స్వాతంత్య్ర సమర యోధులు కలలుగన్నారు. మన ప్రగతి, వెనుకబాటుతనం, మంచీచెడులపై చర్చ జరగాలి. లోపాలను సరిదిద్దుకునేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భం. ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు ఎగిరే ప్రతి జాతీయ జెండా ఘనమైన, పటిష్టమైన రేపటికి ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి. ప్రజలంతా మనల్ని మనం పరిపాలించుకునే స్వాతంత్య్రంతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణను కచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు చదువుకునే హక్కును ఆర్టికల్ 21–ఏ ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించినా ఒక పేద కుటుంబానికి అలాంటి పరిస్థితుల్ని కల్పించనంత కాలం ఆ హక్కు వల్ల ప్రయోజనం ఉండదు. హక్కుల ప్రకటన, అమలుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు గత 26 నెలలుగా ప్రతి ఒక్కటీ చేశాం.
రైతు రెక్కలకు బలం..
రాష్ట్రంలో 62 శాతం జనాభాకు ఆధారమైన వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి రైతు రెక్కలకు బలం చేకూర్చి అండగా నిలిచాం. ఈ 26 నెలల్లోనే వ్యవసాయానికి దాదాపు రూ.83 వేల కోట్లు వ్యయం చేశాం. 18.70 లక్షల మంది రైతులకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చేందుకు దాదాపు రూ.18,000 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్ల బలోపేతం కోసం మరో రూ.1700 కోట్లు వెచ్చించాం. 52.38 లక్షల మంది రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా దాదాపు రూ.17 వేల కోట్లు అందించగలిగాం. ఆర్బీకేల ఏర్పాటుతో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాం.
వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు రూ.3,788 కోట్లు అందించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 67.50 లక్షల మంది రైతులకు మరో రూ.1,261 కోట్లు ఖర్చు చేసి తోడుగా నిలబడ్డాం. రూ.రెండు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రూ.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ధాన్యం సేకరణ, కొనుగోళ్ల కోసం రూ.33 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. పత్తికి మరో రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.6,434 కోట్లు వ్యయం చేశాం. ఏ ఒక్క రైతన్నకూ ఇబ్బంది రాకూడదని తపించాం.
స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆకట్టుకున్న రైతు శకటం ప్రదర్శన
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలూ చెల్లించాం..
గత సర్కారు ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.9000 కోట్ల ఉచిత విద్యుత్తు బకాయిలు, రూ.384 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే భరించి చిరునవ్వుతో రైతన్నలకు చెల్లించింది. సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రక్రియకు నాంది పలుకుతూ రూ.1,039 కోట్ల చెల్లింపులు చేశాం. అమూల్ పాలవెల్లువ, వైఎస్సార్ జలకళ, ఆక్వా రైతుకు కరెంటు సబ్సిడీకి రూ.1,500 కోట్లు ఇచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ముందడుగు వేశాం. నవరత్నాల పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నాం.
ఒక హక్కులా విద్య
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి ఎదిగేలా విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం. చదువుకోవటాన్ని ఒక హక్కులా చేశాం. నాడు – నేడు ద్వారా తొలి విడతలో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.3,669 కోట్లు వ్యయం చేశాం. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.1,300 కోట్లు ఖర్చు చేశాం. ఫలితంగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 36.89 లక్షల పిల్లలకు మేలు చేస్తూ మార్చిన మెనూ ద్వారా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందుకోసం ఏటా రూ.1,600 కోట్లు చిరునవ్వుతో ఖర్చు చేస్తున్నాం. సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30.16 లక్షల మందికి మేలు చేస్తూ ఏటా రూ. 1,800 కోట్లు వ్యయం చేస్తున్నాం.
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్నాం. టీచర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాం. స్పెషలిస్ట్ టీచర్లతో బోధనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ స్కూళ్లను సీబీఎస్‌ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తున్నాం. ఫీజుల నియంత్రణతోపాటు విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన ద్వారా 100% ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రతి 3 నెలలకోసారి ఎటువంటి బకాయిలు లేకుండా తల్లుల ఖాతాలకే సొమ్మును జమ చేస్తున్నాం. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.5,573 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా 15.57 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఇప్పటివరకు రూ.2270 కోట్లు ఖర్చు చేశాం. పిల్లల చదువుల కోసం ఈ పథకాలకే దాదాపుగా రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దిన వేడుకలు: పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్
95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ
వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఖర్చు రూ.1,000 దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతో 2,434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోసం రూ. 3,900 కోట్లు వ్యయం చేశాం. ఆపరేషన్ తరవాత రోగి కోలుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చొప్పున వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నాం. 108, 104 సేవలకు అర్థం చెబుతూ ఏకంగా 1,068 వాహనాల్ని ప్రతి నియోజకవర్గానికీ పంపాం. పిల్లలు, పెద్దలందరికీ వర్తించేలా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయి.
కోవిడ్‌పై యుద్ధంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తూ ఫోకస్డ్ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టాం. కోవిడ్‌కు ఉచితంగా వైద్యం అందిస్తూ పేదలకు అండగా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్ ఆసుపత్రులే ఉండగా కొత్తగా మరో 16 వైద్య బోధనాసుపత్రులను నిర్మిస్తున్నాం.జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించేందుకు వైద్య రంగంలో నాడు–నేడు అమలు చేస్తున్నాం. వీటికి రూ.16,300 కోట్లు వ్యయం చేస్తున్నాం. కోవిడ్ వల్ల తల్లితండ్రి ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్ చేసి వారి ఆలనా పాలనా చూసుకునే ఏర్పాట్లు చేసిన తొలి ప్రభుత్వం కూడా దేశంలో మనదే. మనిషిని బతికించాలనే ప్రతి ఒక్క ప్రయత్నాన్నీ మనసు పెట్టి చేసే ప్రభుత్వం మనది.
మన కళ్లెదుటే ఉద్యోగాలు..
ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగులకు మేలు చేశాం. మన కళ్ల ఎదుటే దాదాపు 1.30 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీలో 58 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 2.70 లక్షల మంది మన కళ్లెదుటే వలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 95 వేల మందికిపైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా న్యాయం చేశాం. మరో 20 వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలిచ్చాం. ఇలా దాదాపు 6.03 లక్షల మంది ఉద్యోగులు మన కళ్లెదుట కనిపిస్తున్నారు. ఇందులోను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 75 శాతానికి పైగా ఉద్యోగాలు లభించాయని సగర్వంగా చెబుతున్నా.
స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రసంగిస్తున్న సీఎం
ఆధునిక మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచే..
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న సంకల్పంతో కృషి చేస్తోంది. 44.50 లక్షల మంది తల్లులకు తమ పిల్లలను చదివించుకునేందుకు జగనన్న అమ్మ ఒడి ద్వారా రెండేళ్లలో రూ.13 వేల కోట్లు అందజేశాం. వైఎస్సార్ ఆసరా ద్వారా 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు లబ్ధి చేకూరింది. వైఎస్సార్ చేయూత ద్వారా 24.56 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.9,000 కోట్లు సాయం చేశాం. దీనికి తోడు బ్యాంకుల రుణ సదుపాయంతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో అనుసంధానం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు తీసుకుంటున్నాం.
వైఎస్సార్–జగనన్న కాలనీల ద్వారా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. గృహ నిర్మాణం ద్వారా దాదాపు 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి చేకూరుతోంది. తొలిదశలో 15.60 లక్షల గృహ నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇళ్ల ద్వారా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో దాదాపుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద ఉంచుతున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2,509 కోట్లు అందించాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 3.28 లక్షల మందికి రూ.982 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం.
పదవులు, పనుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం
దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్ పదవులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం కచ్చితంగా మహిళలకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది. దీనివల్ల ఇవాళ నామినేటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు, మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల్లో 50 శాతం మంది మహిళలే కనిపిస్తున్నారు. మహిళా రాజకీయ సాధికారతలో భాగంగా ఒక చెల్లిని హోంమంత్రిగా చేశాం. నెల క్రితం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో సగ భాగానికి మించి 58 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వడంతో పాటు సగం పదవులు మహిళలకు ఇచ్చామని సవినయంగా తెలియజేస్తున్నా. అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దిశ బిల్లు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దిశ యాప్‌లకు రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది.
చేతల్లో సామాజిక న్యాయం..
రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సోదర భావానికి(ఫ్రెటర్నిటీ) అర్థం చెబుతూ సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపాం. మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి 60 శాతం పదవులు ఇచ్చాం. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వం మనదే. అటు రాజ్యసభలోనూ, ఇటు కౌన్సిల్‌లోనూ సామాజిక న్యాయం విషయంలో మనం చేసినట్లుగా ఇంతకుముందు జరగలేదు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయటంతోపాటు ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల దిశగా అడుగులు వేశాం. బీసీలకు ప్రత్యేకించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మార్కెట్ యార్డుల ఛైర్మన్లు, దేవస్థానాల కమిటీల ఛైర్మన్లు, సభ్యులుగా ఈ రోజు పేద వర్గాలవారు సగభాగం కనిపిస్తున్నారని సగర్వంగా తెలియజేస్తున్నా.
పెన్షన్లు పెంచాం..
వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత డబ్బులను ఈ నెలలోనే అందించబోతున్నాం. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉంటే మన ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్యను 61 లక్షలకు పెంచి ఇస్తున్నాం. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చిన పెన్షన్ సొమ్మును రూ.2,250కి పెంచింది కూడా మన ప్రభుత్వమే. గత సర్కారు హయాంలో నెలకు రూ.500 కోట్లు మాత్రమే ఉన్న పెన్షన్ బిల్లు నేడు రూ.1,500 కోట్లకు చేరిందని మీ బిడ్డగా సవినయంగా తెలియచేస్తున్నా.
ఉద్యోగులకు రాబోయే రోజుల్లో మరికొన్ని..
ఉద్యోగుల జీతాల విషయానికి వస్తే.. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చాం. అంగన్‌వాడీల్లో పని చేస్తున్నవారికి, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, శానిటరీ వర్కర్లకు, హోంగార్డులకు, 104, 108 సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఇలా అనేక విభాగాల్లో చాలీ చాలని వేతనాలతో బతుకు బండి ఈడుస్తున్న 7,02,656 మందికి లబ్ధి చేకూరుస్తూ వేతనాలు పెంచాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా తీసుకొచ్చాం. ఉద్యోగులకు చేయాల్సినవి మరికొన్ని ఉన్నాయన్నది నాకు తెలుసు. వారందరికీ న్యాయం చేసేలా రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment