దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్‌ | Telangana CM KCR Participated Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్‌

Published Mon, Aug 16 2021 2:43 AM | Last Updated on Mon, Aug 16 2021 9:08 AM

Telangana CM KCR Participated Independence Day Celebrations - Sakshi

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి, సామాజిక వివక్ష నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా నేనే దళితబంధు పథకానికి రూపకల్పన చేసిన. అణగారిన దళితజనం స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహా సంకల్పానికి ఆచరణ రూపమే ‘దళిత బంధు ఉద్యమం’. 

వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కొత్త జోనల్‌ విధానం మేరకు పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. ఆ ప్రక్రియ తదనంతరం ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘దళితులను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తేనుంది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్‌ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్, మెడికల్‌ షాపులు, హాస్పిటళ్లు, హాస్టళ్లు, సరుకుల సరఫరా, ఇతర కాంట్రాక్టులు, వైన్స్, బార్‌షాపుల లైసెన్సుల వంటి విషయాల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయనుంది..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

సోమవారం (ఆగస్టు 16) నుంచే ఈ పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తామని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే, బీఆర్‌ అంబేద్కర్‌ల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని తీసుకువస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సీఎం ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే.. 
 
దేశంలోనే ప్రథమంగా.. 
‘‘మన దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం పథకాలను తెస్తోంది. దళిత బంధు కింద రూ.10లక్షలు ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా పూర్తిగా గ్రాంటు రూపంలో అందజేస్తుంది. నచ్చిన రంగంలో జీవనోపాధిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కొందరు లబ్ధిదారులు సమూహంగా ఏర్పడి, పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్‌ పెట్టుకొనే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది.

లబ్ధిదారులు, వారి కుటుంబాలు ఆపదకు గురైతే రక్షణ కవచంగా ఉండేందుకు ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేసింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు సమితుల నేతృత్వంలో దానిని నిర్వహిస్తారు. లబ్ధిదారుల ప్రగతి ఫలితాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన, పటిష్టమైన విధానాన్ని రూపొందించాం. దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పథకాలన్నీ యథాతథంగా అందుతాయి. రేషన్‌ కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కొనసాగిస్తుంది. దళిత బంధు పథకాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పథకం దేశానికి దారి చూపుతుంది. 

ఈర్ష్య, అసూయలకు తావివ్వొద్దు 
అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. ఈర్ష్య, అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటిమీద నిలవాలి. కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి. 
 
వ్యవసాయం పండుగగా మారింది 
ఒకప్పుడు తెలంగాణ అంటేనే కరువు కాటకాలు, రైతు ఆత్మహత్యలకు చిరునామాగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుత కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణ అభివృద్ధి నమోదైంది. 2020–21లో 3.45 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు, రైతుబంధు, రైతుబీమా పథకాలు, రైతువేదికలు, కల్లాల నిర్మాణం, గోదాముల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయం రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది. 

రూ.50వేలలోపు రుణమాఫీ మొదలు 
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3లక్షల మంది రైతులకు రూ.25 వేల వరకూ ఉన్న పంట రుణాలను ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసింది. సోమవారం నుంచే మరో 6 లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తోంది. నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీనితో 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులవుతున్నారు. మిగతా వారికి కూడా దశలవారీగా రుణమాఫీ అమలవుతుంది. 

అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం 
విద్యుత్, తాగునీటి, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు.. ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 

రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, నేతన్నలకు బీమా, డబుల్‌ బెడ్రూం ఇళ్లు వంటి పథకాలను అమలు చేస్తోంది. చివరి లబ్ధిదారుడికి ఇల్లు అందే వరకూ డబుల్‌బెడ్రూం పథకం అమలవుతుంది. కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 

కుల వృత్తుల వారి ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, నాయీ బ్రాహ్మణ, రజక వృత్తులవారికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రజకులకు అధునాతన దోభీ ఘాట్లు, నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేస్తోంది. 

కొత్త పారిశ్రామిక విధానం టీఎస్‌–ఐపాస్‌ ద్వారా గత ఏడేళ్లలో 16,671 పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చాయి. వాటితో 15 లక్షల 86 వేల 500 ఉద్యోగాల కల్పన జరిగింది. 2020–21 నాటికి రాష్ట్రం నుంచి ఐటీ దిగుమతులు రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. 
 
కరోనా అదుపులో ఉంది 
రాష్ట్ర పౌరుల డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వివరాల సేకరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27,996 కోవిడ్‌ బెడ్లు ఉండగా, 17,114 బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయం ఉండగా.. త్వరలో అన్నిబెడ్లను ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చబోతోంది. బస్తీ దవాఖానాల స్ఫూర్తితో ‘పల్లె దవాఖానాలు’ ఏర్పాటు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ నలుదిక్కులా నాలుగు మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. మూడో దశ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది. 

హైదరాబాద్‌.. ట్రీ సిటీ 
తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతంపైగా పెరిగింది. ట్రీ సిటీగా హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ట్రాఫిక్‌ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా నిలిచింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. 

ప్రభుత్వ కృషితో రామప్పకు గుర్తింపు 
కాకతీయ కళావైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం వెనక రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉంది. తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వవైభవం తేవడానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. అందులో భాగంగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది.   

నేడు ‘దళితబంధు’కు శ్రీకారం
హుజూరాబాద్‌లోని శాలపల్లిలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ 
సాక్షి,హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక తెలంగాణ దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కేసీఆర్‌ బయలుదేరి జమ్మికుంట మండలంలోని శాలపల్లికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో దళితబంధు పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులతోపాటు దళితబంధు ఎలక్ట్రానిక్‌ కార్డులను అందజేయనున్నారు. ఎలక్ట్రానిక్‌ కార్డుపై పథకం పేరు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫొటో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు పయనమవుతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement