స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఏ ఒడిదుడుకులు లేకుండా నిరంతరం విస్తరిస్తూ వచ్చిన పరిశ్రమ ఏదైనా వుందా అంటే అది సినిమా పరిశ్రమ మాత్రమే. 1947లో టర్నోవర్‌కు, యిప్పటి టర్నోవర్‌కు పోల్చి చూస్తే వందల రెట్లు పెరిగి వుంటుంది. సినిమా పరిశ్రమ అంటే దాని నిర్మాణం మాత్రమే లెక్క వేయకూడదు. పంపిణీ, ప్రదర్శనా రంగాలు, పార్కింగ్, క్యాంటీన్లు, బయట కాచుకున్న రిక్షాబళ్ల వరకు, బ్లాక్ మార్కెట్టు టిక్కెట్లు అమ్మేవారితో సహా అది చూపిన ఉపాధిని, ఆదాయాన్ని పరిగణించాల్సి ఉంటుంది.
పంపిణీ, పబ్లిసిటీరంగాల కొస్తే రీళ్లు (ఇటీవల లేకపోవచ్చు, మొన్నటిదాకా వున్నాయి) రవాణా చేయడాలు, పోస్టర్లు డిజైన్ చేసేవారు, గోడకి అతికించేవారు, సినిమా సమీక్షలు, ఇంటర్వ్యూలు, చరిత్రలు రాసేవారు, సినిమా వార్తలతో పేపర్లు ప్రచురించేవారు, టీవీలకై కవర్ చేసేవారు, సినిమా పాటలతో సంగీత విభావరులు నిర్వహించేవారు, టీవీలో కార్యక్రమాలు చేసేవారు, సినిమా నటుల్ని అనుకరించే మిమిక్రీ కళాకారులు, సినీ నటుల్ని ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించేవారు, పాటల పోటీలు పెట్టేవారు.. యిలా ఎన్నో రంగాలకు చెందినవారు, ఎన్నో కుటుంబాలు సినీరంగంపై పరోక్షంగా ఆధారపడుతున్నాయి.
థియేటర్లో చూపించే సినిమాలే కాక, టీవీ సినిమాలు, టీవీలో సినిమా సంబంధిత కార్యక్రమాలు, షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ఓటీటీకై చేసే చిత్రాలు – వీటన్నిటినీ కూడా కలుపుకుంటే దీనిపై ఆధారపడే కుటుంబాల సంఖ్య మరీ పెరిగిపోతుంది. మరే దేశంలోనో అయితే ఒకటి, రెండు భాషల్లో సినిమాలు తయారయ్యేవి. కానీ భారతదేశంలో దాదాపు పది భాషల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు తయారవుతున్నాయి.
ఏ పరిశ్రమా యీ స్థాయిలో విస్తరించి వుండదు. సినిమాల్లో సంపాదించిన డబ్బును నటీనటులు వేరే పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టి దేశపారిశ్రామికాభివృద్ధికి తోడ్పతున్నారు. నిజానికి సినిమా నిత్యావసర వస్తువు కాదు. అయినా ఎందుకీ స్థాయి వృద్ధి? తక్కిన పరిశ్రమలు వస్తువులు ఉత్పత్తి చేస్తాయి. అవి కొంతకాలానికి అనవసరమనిపించవచ్చు, లేదా డిమాండు పోగొట్టుకొనవచ్చు. కానీ సినిమాలు ఉత్పత్తి చేసేది ఆలోచనల్ని, కలల్ని! ప్రతి మనిషికీ ఊపిరున్నంతకాలం అవి కావాల్సిందే! చుట్టూ పరిస్థితులు దుర్భరమౌతున్న కొద్దీ భవిష్యత్తు గురించి కలలు కనడం పెరుగుతుంది. ఆ కలలకు ముడిసరుకును సినిమాలు సరఫరా చేస్తాయి.
సినిమాకైతే ఆ బాధ లేదు
ఒక నాటకం ప్రదర్శించాలంటే దానిలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఆ ప్రదేశానికి వెళ్లాలి. సినిమాకైతే ఆ బాధ లేదు. స్వాతంత్య్రానంతరం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం రావడంతో పల్లెటూళ్లలో కూడా థియేటర్లు వెలిశాయి. జనాలు సినిమాలు చూడడం యిబ్బడిముబ్బడిగా పెరిగింది. తర్వాతి రోజుల్లో వీడియో క్యాసెట్లు, డీవీడీలు వచ్చాయి, బ్లూరే సీడీలూ వచ్చాయి. ఇప్పుడు సెల్‌ఫోన్లలోనే సినిమా చూసేసే సౌకర్యం వచ్చింది. ఈ విధంగా సినిమా ప్రజలకు మరీమరీ చేరువౌతూ వచ్చింది.
సినిమా థియేటర్ అనేది ఊరిలో వుండవలసిన ముఖ్యమైన ప్రదేశంగా మారింది.
కుటుంబమంతా సరదాగా సమయం గడపడానికి అతి చౌకగా వెళ్లగలిగేది సినిమా థియేటరుకు మాత్రమే. అందుకే అది ఒక సామాజిక అవసరంగా మారింది. కట్టూబొట్టూపై, సంభాషణ తీరుపై, భావప్రకటనపై సినిమా ప్రభావం పడింది. స్వాతంత్య్రానంతరం దేశమంతా ఒక్కటే అనే భావన పెంపొందడానికి కారణం హిందీ సినిమాలు అని చెప్పినా తప్పులేదు. ఈశాన్య రాష్ట్రాల నుంచి, లక్షద్వీప్ దాకా హిందీ పాటలు మారుమోగుతూనే వుంటాయి. హిందీలో అంత్యాక్షరి నిర్వహిస్తే, దేశంలోని ఏ ప్రాంతంవారైనా పాల్గొనగలుగుతారు.
అది ఒక చైతన్య మాధ్యమం
హాలీవుడ్‌తో స్ఫూర్తి పొందిన భారతీయ సినిమా క్రమంగా భారతీయ ప్రేక్షకుడికి తగినట్టుగా రూపు మార్చుకుంటూ వెళ్లింది. ప్రతిష్ఠాత్మక స్టూడియోల చేతుల్లో నుంచి కదిలి వ్యక్తిగత నిర్మాతల వరకూ విస్తరించింది. హిందీ రంగంలో మార్కెట్ కోసం రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ వంటి స్టార్స్‌కు ఇమేజ్ వచ్చేలా చూశారు. దక్షిణాదిలో ఎన్.టి.ఆర్, ఎం.జి.ఆర్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ వంటి స్టార్స్ ప్రేక్షకుల ఇలవేల్పులయ్యారు. కాంచనమాలతో మొదలెట్టి మధుబాల, సావిత్రి వరకూ అద్భుతమైన స్టార్‌డమ్‌ను చూసిన హీరోయిన్లూ ఉన్నారు.
కాని సినిమా అంటే కాలక్షేపం మాత్రమే కాదని అది ఒక చైతన్య మాధ్యమం అని ‘పారలల్ సినిమా మూవ్‌మెంట్’ మొదలైంది. సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, ఎం.ఎస్.సత్యు, ఋత్విక్ ఘటక్, శ్యామ్ బెనెగళ్, బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్, కె.ఎన్.టి.శాస్త్రి, బి.ఎస్.నారాయణ వంటి దర్శకులు సినిమా ధోరణిని మార్చారు. మలయాళం ఈ విషయంలో అద్భుతమైన వికాసం చూపింది. అడూర్ గోపాలకృష్ణన్, అరవిందన్ వంటి దర్శకులు ప్రపంచ స్థాయి సినిమాలు తీశారు.
తెలుగులో వీరు..
తెలుగులో మాదాల రంగారావు, టి.కృష్ణ తదితరులు చైతన్యవంతమైన సినిమాను ప్రేక్షకులకు హిట్ ఫార్ములాగా అందించారు. కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి దర్శకులు మధ్యతరగతి డ్రామాను తెర మీద రక్తి కట్టించారు. అయితే నేటికీ సినిమా కమర్షియల్ మాధ్యమమే అని వినోదం అందిస్తూ లాభాలు గడించే వ్యాపార కళ అని నిరూపితం అవుతూనే ఉంది. హిందీలోగాని దక్షిణాది భాషల్లోగాని హీరోలే కేంద్రంగా కాలక్షేప కథలతో కొనసాగుతూ ఉంది.
మరోవైపు సాంకేతిక అభివృద్ధి జరిగి సినిమాస్కోప్, 70 ఎంఎం, డాల్బీ సిస్టమ్.. అంటూ అనేక హంగులు వచ్చి చేరుతూ సినిమాను వీక్షించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారిపోయింది. తమిళ ప్రాంతంలో ద్రవిడ ఉద్యమం తన భావప్రచారానికి సినిమాను సాధనంగా వాడుకుని అధికారంలోకి వచ్చింది. దక్షణాదిలో సినిమా రంగం ఏకంగా ముఖ్యమంత్రులను ఇచ్చే స్థాయికి రాజకీయాలను ప్రభావితం చేసింది.
సినిమాను దేశభక్తి పెంపొందించడానికి, సోషలిస్టు లేదా కమ్యూనిస్టు భావవ్యాప్తికి, భక్తి కలిగించడానికి, ఆలోచన రగిలించడానికి.. యిలా పలువిధాలుగా వాడుకున్నారు. పెద్దగా ప్రచారం లేని దేవుడికి పబ్లిసిటీ తేవాలంటే ఆ దేవుడి మహిమలపై సినిమా తీస్తే లేదా పేరున్న సినీగాయకుల చేత పాటలు పాడిస్తే చాలు అనే ధోరణి కూడా వచ్చింది. సినిమా సమాజాన్ని, సమాజం సినిమాను అనుకరిస్తూ పోవడం వలన జనాభాతో బాటు సినీపరిశ్రమ కూడా నిరంతరంగా పెరుగుతూ పోతోంది.
నిజానికి స్వాతంత్య్రానంతరం సమాజ దృక్పథంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి దశాబ్దాల వారీగా సినిమా థీమ్స్‌ను విశ్లేషిస్తే సరిపోతుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో సోషలిస్టు సమాజంపై ఆశలు, స్వతంత్ర భావాలు, మంచి కోసం తలిదండ్రులను ఎదిరించినా తప్పులేదనే ఆలోచన, కష్టపడి పని చేస్తూ నీతి, నిజాయితీలతో బతికితే జీవితంలో పైకి వస్తామన్న ఆశావహ దృక్పథం కథాంశాలుగా వుండేవి.
పోనుపోను సమాజంలో హింసాత్మక విధానాలతోనైనా మార్పు తేవాల్సిందే అనే తీవ్రవాదం థీమ్‌గా మారింది. ఆ తర్వాతి రోజుల్లో సన్మార్గాన్ని నమ్ముకుంటే లాభం లేదు, ఈ సమాజంలో ఎలాగోలా పైకి వచ్చేవాడే మొనగాడు అనే ఆలోచన, విదేశాలు వెళ్లి డబ్బు సంపాదిద్దాం, ఎలాగోలా సంపాదించి, ఖర్చు పెట్టడంలోనే మజా వుంది అనే దృక్పథం.. ఇలా అన్నీ సినిమాల్లో ప్రతిఫలించాయి. అందుకే ప్రేక్షకులు సినిమా హీరోలతో మమేకమౌతున్నారు. వారిని ఆరాధిస్తున్నారు.
60, 70 ఏళ్ల క్రితం సినిమా కళాకారులను సంఘబాహ్యులుగా చూసే రోజుల్నుంచి, యింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్లను ఆహ్వానించడం ప్రతిష్ఠాత్మకమైన విషయంగా పరిగణించే వరకూ మార్పు వచ్చింది. సినిమావారు ప్రేక్షక ఓటర్ల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేయగల స్థితిలో వున్నారని గ్రహించిన రాజకీయ నాయకులు వారిని ప్రచారానికి, తమ మీటింగుల జనసమీకరణకు వాడుకుంటున్నారు. క్రమేపీ వేరెవరి కోసమో పని చేయడమెందుకనుకుని నటీనటులు తామే నాయకులుగా ఎదుగుతున్నారు. కొందరు సఫలం కావడం, మరి కొందరు విఫలం కావడం సహజం.
‘బాహుబలి’ వంటి సినిమాల వల్ల..
ఇవాళ భారతీయ సినిమా ప్రపంచ ప్రేక్షకులను సంపాదించుకుంది. భారతదేశంలోనే కాక అనేక దేశాలలో భారతీయ సినిమాలు విడుదల అవుతున్నాయి. జపాన్, చైనాలలో మన సినిమాలు డబ్ అయ్యి విడుదలై ఘన విజయాలు సాధిస్తున్నాయి. సినిమా వ్యాపారం ఒకప్పుడు పది వేల రూపాయలతో మొదలయ్యి ఇవాళ ఒక పెద్ద సినిమా తీయాలంటే బడ్జెట్ 50 కోట్ల నుంచి 100 కోట్ల స్థాయికి పెరిగింది.
‘బాహుబలి’ వంటి సినిమాలు 500 కోట్ల పెట్టుబడి వరకూ వెళ్లి దాదాపు 2000 కోట్ల కలెక్షన్ల దాకా సాధించవచ్చని నిరూపించాయి. ‘పాన్ ఇండియా’ సినిమా అంటూ ఇవాళ దేశం మొత్తం తెలిసే నటీనటులతో సినిమాలు తీసి రెండు, మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోసమే సినిమా కంటెంట్ వృద్ధి జరిగి ఓటీటీ బిజినెస్ ఒకటి కొత్త ఆర్థిక లావాదేవీలు నెరుపుతోంది.
ఈ మొత్తం వృద్ధిలో ప్రాంతీయ అసమానత గమనార్హం. సినీ నిర్మాణం కొన్ని రాష్ట్రాలలోనే జరుగుతోంది. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాలలో (ఆంధ్రలో యింకా పుంజుకోవాలి), ముంబయిలో, తక్కువ స్థాయిలో కోల్‌కతాలో సాగుతోంది. జనబాహుళ్యం ఎక్కువగా వున్న ఉత్తరాది రాష్ట్రాలలో, పశ్చిమ రాష్ట్రాలలో సినీ నిర్మాణం ఎదగడానికి ఎంతో అవకాశం వుంది. అలాగే అనేక మాండలిక భాషల్లో సినిమాలు నిర్మించడానికి మార్కెట్ వుంది.
సినిమా నిర్మాణం అంతా ఒకే చోట పోగుపడడం అభిలషణీయం కాదు. దీని వలన కొందరి దగ్గరే పెత్తనం ఉండిపోతుంది. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న కొద్దీ ఆ ప్రాబల్యం తగ్గుతుంది, సంపద పంపిణీ అవుతుంది, స్థానికులకు అవకాశాలు పెరుగుతాయి, సినీనిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. వచ్చే దశాబ్దాలలో ఆ పని జరుగుతుందని ఆశిద్దాం.
-ఎమ్బీయస్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment