త్యాగధనులను దేశం స్మరించుకుంటోంది: ప్రధాని మోదీ | 75th Independence Day: PM Modi Address Nation From Red Fort | Sakshi
Sakshi News home page

త్యాగధనులను దేశం స్మరించుకుంటోంది: ప్రధాని మోదీ

Published Sun, Aug 15 2021 7:57 AM | Last Updated on Sun, Aug 15 2021 7:38 PM

75th Independence Day: PM Modi Address Nation From Red Fort - Sakshi

సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోటలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు  స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు తెలిపారు. కరోనా మహమ్మారిపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానమని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 54 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారని.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అని మోదీ అన్నారు.

‘‘భారత అథ్లెట్లు నవయువతకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలి. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌.. మన రణనినాదం కావాలి. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలని’’ ప్రధాని మోదీ అన్నారు.

‘‘సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి. పోషకాహారంతోపాటు వైద్యం కూడా అత్యంత కీలకమైంది. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రికి వైద్య వసతులతోపాటు ఆక్సిజన్‌ ప్లాంటుకు చర్యలు తీసుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం వైద్యుల సంఖ్యను పెంచాల్సి ఉంది. వైద్యుల సంఖ్యను పెంచేందుకు వైద్యవిద్యలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ఓబీసీల్లో ఎవరు ఉండాలనే దానిపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చాం. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగేలా చూడాలి. చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాల్సిన అవసరం ఉందని’’ ప్రధాని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ వికాసానికి చర్యలు చేపట్టామని మోదీ అన్నారు. లద్ధాఖ్‌లో సింధూ సెంట్రల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్‌నెట్‌ను గ్రామస్థాయికి అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

‘‘ఫసల్‌ బీమా యోజనతో చిన్న రైతులకు మేలు జరుగుతోంది. కిసాన్‌ రైల్‌తో చిన్నకారు రైతులకు మేలు జరుగుతోంది. ప్రతి ఈశాన్య రాష్ట్ర రాజధానిని రైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తాం. 25 ఏళ్లలో నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలి. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. లద్దాఖ్‌ అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయి. ఆన్‌లైన్ ద్వారా మన ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయిస్తున్నాం.

డిజిటల్‌ విప్లవంతో ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు అవసరం. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గుతోంది. దేశంలో 80శాతం రైతులు ఐదెకరాల లోపు భూమి కలిగినవారే. చిన్న, సన్నకారు రైతులు దేశానికి గర్వకారణం అయ్యేలా పథకాలు ఉండాలి. రైతు పంటకు మంచి ధర లభించే సౌకర్యం కల్పించాలి. దేశంలో కొత్త సంపద సృష్టికర్తల తరం ప్రారంభమైంది. నూతన ఆవిష్కరణలతో నవీన పారిశ్రామికవేత్తలు ఎదుగుతున్నారని’’ ప్రధాని మోదీ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement