సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో కరోనా మహమ్మారి తగ్గే వరకు కొరోనా వైరస్ మందులో తయారు చేయడానికి ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల ఎగుమతిని భారతదేశం నిషేధించింది. భారతదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో దేశంలో కరోనా కేసుల విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి క్రియాశీల కేసుల సంఖ్య 11.08 లక్షలుగా ఉంది. ఈ సంఖ్య క్రమంగా పెరగవచ్చు అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
"కోవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కోసం డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎగుమతులపై నిషేధం విధించినట్లు" కేంద్రం తెలిపింది. ప్రస్తుతం, ఏడు భారతీయ కంపెనీలు అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఉత్పత్తిదారులు నెలకు సుమారు 38.80 లక్షల యూనిట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అందుకే ఆస్పత్రులు, రోగులకు రెమ్‌డెసివిర్ సులువుగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రెమ్‌డెసివిర్ దేశీయ తయారీదారులు తమ స్టాకిస్టులు, పంపిణీదారులు నిల్వల వివరాలను వివరాలను వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని సూచించారు.
డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు స్టాక్లను ధృవీకరించాలని "హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి సమర్థవంతమైన చర్యలు" తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్ ఇన్స్పెక్టర్లతో వెంటనే సమీక్షించాలని కోరింది. రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగం దేశీయ తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ బారిన పడిన రోగుల చికిత్స కోసం ప్రస్తుతం ఉన్న నేషనల్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment