
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దూకుడు పెంచిన చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సన్నద్ధమైంది. సరిహద్దుల్లో ఇప్పటికే సమర సన్నద్ధతను పెంచిన భారత్ తాజాగా వివాదానికి కేంద్ర బిందువైన తూర్పు లడఖ్‌లో టీ-90, టీ-72 యుద్ధ ట్యాంకులను మోహరించింది. చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి యుద్ధ బలగాలతో పాటు ట్యాంకులను తరలించింది. 14,500 అడుగుల ఎత్తులో చైనా సైనికులతో తలపడేందుకు భారత సేన సాయుధ బలగాలు సిద్ధమయ్యాయి. భారత్ టీ-72, టీ-90 ట్యాంకులను మోహరించగా చైనా తేలికపాటి టైప్ 15 ట్యాంకులను మోహరించింది.
సరిహద్దు ప్రతిష్టంభనతో భారత్-చైనాల మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి. ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ చైనా పలుమార్లు భారత భూభాగంలోకి చొచ్చుకురావడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం చైనా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ దీటుగా స్పందిస్తోంది. సరిహద్దు వెంబడి చైనా సైన్యం కుయుక్తులను తిప్పికొడుతూ భారత సేనలు పలుమార్లు డ్రాగన్‌ను నిలువరించాయి. మరోవైపు చైనాతో దౌత్య, సైనిక సంప్రదింపులు జరుపుతూనే డ్రాగన్ దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టేందుకు భారత సైన్యం అప్రమత్తమైంది. చదవండి : కరోనా మూలాలు తేలాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment