సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్ తీవ్రత క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు జాడలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసులు 44 రోజుల తరువాత అత్యల్పంగా నమోదయ్యాయి. రోజువారీ కొత్త కేసులు తగ్గుతున్న క్రమంలోనే వరుసగా 12 రోజులుగా కొత్త కేసులు 3 లక్షలలోపే ఉంటున్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,660 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 2,75,55,457కు, మరణాల సంఖ్య 3,18,895కు చేరింది.
90.34%కి చేరిన రికవరీ రేటు
కరోనా బారిన పడిన 2,59,459 మంది రోగులు గత 24 గంటల్లో కోలుకున్నారు. రికవరీ రేటు దేశంలో ప్రస్తుతం 90.34%గా ఉంది. రోజువారీ రికవరీలు పెరుగుతూ, 15 రోజులుగా కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో వైరస్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,48,93, 410కు చేరి, మరణాల రేటు 1.16 శాతానికి పెరిగింది. ప్రస్తుతం, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23,43,152గా నమోదైంది. మే 10వ తేదీన యాక్టివ్ కేసులు అత్యధికంగా నమోదు కాగా, అప్పటి నుంచి కేసుల్లో తగ్గుదల నమోదు చేసుకుంటోంది. గత 24 గంటల్లో 76,755 కేసులు తగ్గాయి.
9 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు
24 గంటల్లో మొత్తం 20,70,508 కోవిడ్ శాంపిల్స్ పరీక్షలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షల మొత్తం 33.9 కోట్లు దాటాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెంచగా రోజువారీ పాజిటివిటీ 9 శాతానికి చేరింది. నాలుగు రోజులుగా పాజిటివిటీ రేటు 10% లోపే ఉంది. మరోవైపు దేశవ్యాప్త కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 20.57 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. తక్కువ సమయంలో 20 కోట్ల మైలురాయి దాటటంలో అమెరికా తరువాత భారత్ రెండో స్థానంలో ఉంది.
44 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు
Published Sat, May 29 2021 2:57 AM | Last Updated on Sat, May 29 2021 12:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment