ఢిల్లీలోని ఓ శ్మశానవాటికలో కోవిడ్ బాధితుల మృతదేహాలను దహనం చేస్తున్న దృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్రమణ దేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వైరస్ సంక్రమిస్తున్న కొత్త రోగులు, మరణాల సంఖ్య ప్రతీరోజు రికార్డుస్థాయిలో పెరుగుతోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,52,991 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో దేశంలో కరోనా సోకిన మొత్తం రోగుల సంఖ్య 1.73,13,163 కు పెరిగింది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్‌లతో సహా మొత్తం పది రాష్ట్రాల్లోనే 74.5% కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 66,191, ఉత్తర్‌ప్రదేశ్‌లో 35,311, కర్ణాటకలో 34,804 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాతో 2,812 మంది తుదిశ్వాస విడిచారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,95,123 కు చేరుకుంది. అయితే గతేడాది మన దేశంలో కోవిడ్–19 సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే రోజులో అత్యధికంగా కొత్త కరోనా రోగులు, మరణాల సంఖ్య ఆదివారం నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 832 మంది, ఢిల్లీలో 350 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్యలో పెరుగుదల కారణంగా శ్మశానవాటికల్లో దహన సంస్కారాల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేకచోట్ల శ్మశానవాటికల్లో స్థలం లేకపోవడం కారణంగా మృతదేహాలను పార్కుల్లోనే దహనం చేస్తున్నారు. మరోవైపు దేశంలో యాక్టివ్ రోగుల సంఖ్య సైతం రోజు రోజుకి పెరుగుతోంది. ఈ సంఖ్య 28,13,658 కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 16.25 శాతం.
ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక యాక్టివ్ కేసులు భారత్‌లోనే ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లోనే 69.67% యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే సమయంలో వైరస్ నయం అయిన వారి సంఖ్య సైతం పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,19,272 కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1,43,04,382 మంది రోగులు కరోనా వైరస్‌ను జయించారు.
అయితే గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో నమోదవుతున్న రోగుల సంఖ్యతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగా ఉండడం కాస్త ఆందోళన కలిగించే విషయం. మరోవైపు దేశంలో రెండవదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 14,19,11,223 మందికి వ్యాక్సిన్లు వేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మూడవ దశ మే 1 నుంచి ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment