అమెరికా కోర్టులో భారత ప్రభుత్వంపై పన్నూ దావా
సమన్లు జారీ చేసిన న్యాయస్థానం
న్యూఢిల్లీ: తనను హత్య చేయడానికి భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల అమెరికా కోర్టును ఆశ్రయించాడు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫర్ సదరన్ డి్రస్టిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌లో దావా వేశాడు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. భారత ప్రభుత్వంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత నిఘా సంస్థ ‘రా’ మాజీ అధినేత సమంత్ గోయల్, ఉద్యోగి విక్రమ్ యాదవ్, భారత వ్యాపారవేత్త నిఖిల్‌గుప్తాకు తాజాగా సమన్లు జారీ చేసింది.
సమన్లు అందుకున్న వ్యక్తులు 21 రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 23వ తేదీ దాకా అమెరికాలో పర్యటించనున్నారు. ఇంతలోనే అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గురు పత్వంత్‌సింగ్ పన్నూకు కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం ఉంది.
ఉగ్రవాది వేసిన దావాపై సమన్లా?
గురు పత్వంత్ సింగ్ పన్నూ వేసిన దావాపై తమకు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాది అయిన పన్నూ వేసిన దావాపై భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం పూర్తిగా అసమంజసమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పన్నూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పన్నూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖలిస్తాన్ సంస్థపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 కింద నిషేధం అమల్లో ఉందని గుర్తుచేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ సంస్థకు ప్రమేయం ఉందని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment