న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైల్వే కంపార్టుమెంట్లలో ప్రయాణికులు ధూమపానం (సిగరెట్, బీడీ) చేస్తే భారీ జరిమానా విధించనుంది. ధూమపానం చేసే ప్రయాణికుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటే వారిని అరెస్ట్ కూడా చేయాలని యోచిస్తోంది. ఇటీవల న్యూఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చేటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ట్రైన్ కంపార్టుమెంట్‌లో ధూమపానం చేసిన ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగి పీకలను టాయ్‌లెట్‌లో వేయడంతో అక్కడ ఉన్న టిష్యూ పేపర్‌కు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో భారతీయ రైల్వే ఇటువంటి ప్రమాదకర ఘటనలు జరగకుండా ఉండాలని కీలక నిర్ణయం తీసుకుంది. ధూమాపానం చేసిన వారికి భారీ మొత్తంలో జరిమానా విధించడంతో పాటు అరెస్ట్ కూడా చేస్తామని పేర్కొంది. అయితే ప్రస్తుతం రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం రైల్వే కంపార్టుమెంట్‌లో ధూమపానం చేసిన ప్రయాణికులకు రైల్వే అధికారులు రూ.100 ఫైన్ విధిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ రైళ్లలో ధూమపానం చేసే ప్రయాణికులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జోనల్ జనరల్ మేనేజర్లు, రైల్వే బోర్డు సభ్యులను ఆదేశించిన విషయం తెలిసిందే.
చదవండి: ‘రేంజర్ దీదీ’ ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment