సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) సేకరణను నెల రోజుల పాటు పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర వాణిజ్య, ఆహార పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సంజయ్ భేటీ అయ్యారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద దేశవ్యాప్తంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా అందించే రేషన్ బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలలుగా పంపిణీ చేయని కారణంగా కేంద్రం సీఎమ్మార్ సేకరణను నిలిపేసిందని సంజయ్ తెలిపారు. దీంతో రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయని, దాని ప్రభావం ధాన్యం సేకరణపై పడిందని చెప్పారు. రాష్ట్రంలో మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా వివరించారు. దీంతో సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని సంబంధిత శాఖ అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపిన అధికారులు జూన్ 30తో ముగిసిన సీఎమ్మార్ సేకరణను మరో నెలపాటు పొడిగించడంపై సానుకూలంగా స్పందించారు.
రాష్ట్ర సర్కారు మోసకారి తనం వల్లే..
గోయల్‌తో భేటీ అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ మోసకారితనంవల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని మండిపడ్డారు. పీఎంజీకేఏవై పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తే ప్రధాని మోదీకి పేరొస్తుందనే అక్కసుతోనే రాష్ట్రంలోని పేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవాలను కేంద్ర ఆహార పంపిణీ శాఖ మంత్రితో పాటు సంబంధిత శాఖ కార్యదర్శి సుధాంశ్ పాండేతో చర్చించినట్లు తెలిపారు. వాస్తవానికి 2020–21 రబీ ధాన్యం సేకరణ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆరుసార్లు గడువు పొడిగించిందని, తన వినతి మేరకు తాజాగా మరో నెలపాటు పొడిగించే విషయంపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ పీఎంజీకేఏవై బియ్యం పంపిణీ చేయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment