అమిత్‌షాకు కండువా కప్పుతున్న బండి సంజయ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రానున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ కుమార్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు మరింత దూకుడుగా వ్యవహరించాలని చెప్పారు. సోమవారం ఢిల్లీలో తనను కలిసిన బండి సంజయ్‌తో సుమారు 30 నిమిషాలపాటు రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై అమిత్ షా చర్చించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించిన తర్వాత మొదటిసారి బండి సంజయ్ అమిత్ షాను కలిశారు.
ఈ సందర్భంగా పారీ్టకి సంబంధించిన వ్యవహారాలు, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు తదితర అంశాలపై అమిత్ షా పలు సూచనలు చేశారు. అంతేగాక ఇటీవల కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల స్వీకరణ రోజు బండి సంజయ్ సహా పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారని సమాచారం. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ వేదికలపై, మీడియాతో మాట్లాడరాదని అమిత్ షా సూచించారని తెలిసింది.
బండితో భేటీకి సంబంధించిన సమాచారాన్ని అమిత్ షా స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను బండితో చర్చించినట్లు చెప్పారు. అనంతరం షాతో భేటీకి సంబంధించి బండి సైతం ట్వీట్ చేశారు. రాజకీయ చాణక్యుడు అమిత్ షాను కలవడం సంతోషంగా ఉందని, ఆయన మార్గదర్శనంలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని బండి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment