నాగ్‌పూర్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే సిక్కు పైలట్ ఆనంద్‌సింగ్ డ్యూటీలో తన వెంట కిర్పన్(చిన్నకత్తి)ని తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని కోర్టుకెక్కారు. కిర్పన్‌ను క్యారీ చేయడం సిక్కు సంప్రదాయంలో ఒక భాగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద కిర్పన్ తీసుకెళ్లడం తన ప్రాథమిక హక్కు అని నాగ్‌పూర్ హైకోర్టు బెంచ్ ముందు వేసిన పిటిషన్‌లో తెలిపారు.
ఈ మేరకు తనకు అనుమతిచ్చేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పైలట్ కోరారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నితిన్ సాంబ్రే, అభయ్ మంత్రిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రప్రభుత్వంతో పాటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు నోటీసులు పంపింది.
‘విమానాల్లో కిర్పన్‌ను తీసుకెళ్లడానికి ప్రయాణికులకు అనుమతిస్తూ విమానయాన శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులకు మాత్రం కిర్పన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని అందులో తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి విరుద్ధం’ అని పైలట్ న్యాయవాది చెప్పారు. సంప్రదాయంలో భాగంగా సిక్కులు ధరించే వాటిలో కిర్పన్ కూడా అతి ముఖ్యమైనది. చిన్న సైజులో ఉన్న కిర్పన్‌ను సిక్కులు తమ వెంటే ఉంచుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment