
‘దేఖో అప్నా దేశ్’. ఐఆర్‌సీటీసీ సరికొత్త నినాదం ఇది. కోవిడ్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో కొత్త సంవత్పరం వచ్చిందంటే చాలు నగరవాసులు ‘చలో టూర్’ అంటూ రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బ్యాంకాక్, దుబాయ్, శ్రీలంక వంటి విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈసారి కోవిడ్ కారణంగా మూసివేసిన అంతర్జాతీయ సరిహద్దులు ఇంకా తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ‘మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిద్దాం’ అనే లక్ష్యంతో ఐఆర్‌సీటీసీ ‘దేఖో అప్నా దేశ్’ ప్యాకేజీలను సిద్ధంచేసింది. లాక్‌డౌన్, వర్క్ ఫ్రం హోం, పిల్లల ఆన్‌లైన్ చదువులు వంటి వివిధ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్న నగరవాసులకు ఈ ప్యాకేజీలు సరికొత్త ఉత్సాహాన్నివ్వనున్నాయి. మధ్యప్రదేశ్, అండమాన్, మేఘాలయ, హంపీ తదితర ప్రాంతాల కోసం ఐఆర్‌సీటీసీ తాజాగా డొమెస్టిక్ ఫ్లైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.
– సాక్షి, సిటీబ్యూరో
చలో హంపీ..
హంపీ– బాదామి– ఐహోల్– పట్టడక్కల్ ప్రాంతాల పర్యటన జనవరి (2021) 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉంటుంది. ఈ పర్యటనలో మొదటి రోజు (29) ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 9.25 గంటలకు విద్యానగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోస్పేట్‌కు రోడ్డు మార్గంలో వెళ్తారు. అనెగుండి, పంపానది, తుంగభద్ర డ్యామ్ తదితర ప్రాంతాల పర్యటన అనంతరం హోస్పేట్ చేరుకుంటారు. రెండోరోజు హోస్పేట్ నుంచి హంపీ వెళ్తారు. విఠల, విరూపాక్ష ఆలయాలు, క్వీన్స్‌బెత్, లోటస్ మహల్ తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. మూడోరోజు బాదామి గుహలను సందర్శిస్తారు. అనంతరం ఐహోల్, పట్టడక్కల్ చారిత్రక కట్టడాల సందర్శన అనంతరం నాలుగోరోజు హోస్పేట్ మీదుగా తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు విద్యానగర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 6.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అన్ని వసతులతో కలిపి ఒక్కొక్కరికి రూ.15,750 చొప్పున చార్జీ ఉంటుంది. 11 ఏళ్లలోపు పిల్లలకు రూ.12,750 చొప్పున ఉంటుంది. చదవండి: మంచు ముసుగులో అరకు అందాలు
అందాలలో అహో మహోదయం ..
– అసోం, మేఘాలయలోని అందమైన ప్రదేశాలను వీక్షించేందుకు మరో ప్యాకేజీ. ఇది మార్చి (2021) 12 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 12న ఉదయం5.20 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 8 గంటలకు గౌహతి చేరుకుంటారు. 17న ఉదయం 8.40 గంటలకు గౌహతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 11.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అన్ని సదుపాయాలతో పెద్దవాళ్లకు రూ.44,683, పిల్లలకు రూ.26,353 చొప్పున చార్జీలు ఉంటాయి. చదవండి: సిక్కోలు ‘నయాగరా’
అమేజింగ్ అండమాన్..
అండమాన్, నికోబార్ పర్యటన ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు ఉంటుంది. ఈ టూర్‌లో సెల్యూలర్ జైల్, రాస్, హావ్‌లాక్ ఐలాండ్స్, అందమైన సాండీ బీచెస్, వివిధ రకాల జంతువులు, పక్షులతో కూడిన వైవిధ్య ప్రదేశాలను వీక్షించవచ్చు. పెద్దవాళ్లకు రూ.43,416, పిల్లలకు రూ.29,686 చొప్పున చార్జీ ఉంటుంది. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇండోర్, ఉజ్జయిని, మాండు తదితర ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు కొనసాగుతుంది. కాలభైరవ టెంపుల్, మంగళ్‌నాథ్ మందిర్, జంతర్‌మంతర్, తదితర ప్రాంతాలను పర్యటిస్తారు. పెద్దవాళ్లకు రూ.25,250, పిల్లలకు 17,100 చొప్పున చార్జీ ఉంటుంది.