
బనశంకరి: వందలాది కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త కేజీఎఫ్ బాబుపై ఐటీ, ఈడీ సోదాలు దాడులు చేశాయి. బెంగళూరు వసంతనగరలోని రుక్సానా ప్యాలెస్, ఉమ్రా డెవలపర్స్, ఉమ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ, ఈడీ అధికారులు ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులను, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేజీఎఫ్ బాబు పలు చోట్ల వందలాది కోట్ల విలువచేసే భూములు, స్థలాలు, అపార్టుమెంట్లు, భవనాలు కలిగి ఉన్న పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
కుటుంబసభ్యుల అకౌంట్లలో భారీగా నగదు
మొదటి భార్య రుక్సానా, కుమారుడు అఫ్ఘాన్‌తో పాటు కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న మొత్తం 23 బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నారు. కేజీఎఫ్ బాబు తన పేరుతో 12 బ్యాంకు అకౌంట్లు తెరిచారు. కుటుంబసభ్యుల అకౌంట్లలో రూ.70 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తనిఖీలో తెలిసింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు చెందిన విలాసవంతమైన రూ.6 కోట్ల విలువచేసే రోల్స్‌రాయ్స్ కారును కేజీఎఫ్ బాబు ఒక మధ్యవర్తి ద్వారా కొనుగోలు చేశారు. గత ఏడాది ఆగస్టులో యుబీ సిటీ వద్ద కారును ఆర్‌టీఓ అధికారులు సరైన పత్రాలు లేవని సీజ్ చేశారు.
ఈడీ సమన్లు జారీ
ఉమ్రా డెవలప్‌మెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా వందలాది కోట్ల నగదు లావాదేవీల గురించి ఈడీ అధికారులకు ఒకనెల క్రితమే సమాచారం అందింది. విచారణకు రావాలని కేజీఎఫ్ బాబుకు ఈడీ సమన్లు జారీచేసింది. మైసూరులో కేజీఎఫ్ బాబు బంధువు రెహమాన్‌ఖాన్ ఇంటిలోనూ సోదాలు సాగాయి. మరికొన్ని రోజులు సోదాలు కొనసాగే అవకాశముంది.
(చదవండి: KGF Babu: ‘కేజీఎఫ్ బాబు’కు ఐటీ షాక్ )
Comments
Please login to add a commentAdd a comment