శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజౌరీలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో హిందూ కుటుంబాలుండే చోటుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. మారణకాండకు తెగబడి ఆరుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల ఎరివేత కోసం రెండు వేల మంది సిబ్బందితో భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ. అయితే.. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి అప్రమత్తమై మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు మైకేల్. వాడొక పెంపుడు కుక్క!.
స్థానికంగా నివాసం ఉంటున్న నిర్మలా దేవి కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అయితే దాడి జరిగిన రోజు (ఆదివారం).. ముసుగులు తుపాకులతో ఉగ్రవాదుల రాకను దూరం నుంచే గమనించిన మైకేల్.. ఏకధాటిగా మొరుగుతూనే ఉంది. సాధారణంగా కంటే గట్టిగా అది మొరగడం గమనించిన నిర్మలా దేవి మనవరాలు.. ఏం జరిగిందా? అని బయటకు వచ్చి చూసింది. కాలనీ చివరి నుంచి తుపాకులతో ఇద్దరు ఇంటి వైపు వస్తుండడం గమనించింది. వెంటనే విషయాన్ని నిర్మలా దేవికి చెప్పడంతో ఆమె మరో గదిలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకుంది.
ఈలోపు ఆ ఇంటి హాలులోకి వచ్చిన ఉగ్రవాదులు.. ఎవరూ కనిపించపోయేసరికి టీవీ, ఫర్నీచర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుక్క మొరగడం, ఆపై తుపాకుల మోతతో చుట్టుపక్కల వాళ్లు కూడా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు. అంతా అలా అప్రమత్తం కావడానికి కారణం మైకేల్‌గా భావించి.. దాని మీదకు పలు రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే మైకేల్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. సమయానికి అప్రమత్తమై ప్రాణాలతో తాము ఉండడానికి మైకేల్ కారణమని భావించిన కాలనీవాసులు దానికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇక రాజౌరీలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్ర దాడుల్లో(కాల్పుల ఘటన, ఐఈడీ బ్లాస్ట్) ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. తమ ప్రాణాలకు భద్రత కరువైందని హిందువులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. వాళ్లను భద్రతా అధికారులు శాంతింపజేసి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment