‘సైకిల్‌ గర్ల్‌’కు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ | Jyoti Kumari Who Carried Her Father On Cycle Gets PM Award | Sakshi
Sakshi News home page

‘సైకిల్‌ గర్ల్‌’ జ్యోతికి ప్రధాన మంత్రి అవార్డు

Published Tue, Jan 26 2021 11:10 AM | Last Updated on Tue, Jan 26 2021 4:38 PM

Jyoti Kumari Who Carried Her Father On Cycle Gets PM Award - Sakshi

పట్నా: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సైకిల్‌పై తండ్రిని ఎక్కించుకుని సుదీర్ఘ ప్రయాణంతో స్వగ్రామానికి చేరుకున్న జ్యోతి కుమారికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చిన ప్రభుత్వం ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ అందజేసింది. జ్యోతితో పాటు దేశవ్యాప్తంగా మరో 32 మంది చిన్నారులకు కూడా ఈ పురస్కారం లభించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జ్యోతి కుమారిపై ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘‘జ్యోతి చూడటానికి తన తోటి పిల్లల్లాగే కనిపిస్తుంది, కానీ ఆమె చూపిన ధైర్యసాహసాల గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. అనారోగ్యం బారిన పడిన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. బాల్‌ పురస్కార్‌ అందుకున్న బిహార్‌లోని దర్భాంగాకు చెందిన జ్యోతి కుమారికి శుభాకాంక్షలు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి’’ అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
(చదవండి: ఎస్పీ బాలుకు పద్మాంజలి.. 102 మందికి పద్మశ్రీ)

అదే విధంగా... క్రీడా విభాగంలో ఈ పురస్కారం అందుకున్న పదేళ్ల చెస్‌ మాస్టర్‌ ఆర్షియా దాస్‌ను సైతం ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. ‘‘త్రిపుర చెస్‌ మాస్టర్‌ అర్షియా దాస్‌. పదేళ్ల ఈ చిన్నారి అంతర్జాతీయంగా సత్తా చాటింది. గోల్డ్‌ మెడల్‌ సాధించింది. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ టోర్నమెంట్‌లలో పాల్గొంది. శుభాభినందనలు’’ అంటూ అర్షియా దాస్‌ను ప్రశంసించారు. కాగా హర్యానాలోని గుర్‌గ్రాంలో ఇ- రిక్షా నడిపే జ్యోతి కుమారి తండ్రి పాశ్వాన్‌ ప్రమాదానికి గురవడంతో, ఇంటి అద్దె చెల్లించలేకపోతే ఇక్కడనుంచి వెళ్లిపోవాలని యజమాని చెప్పడంతో కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడింది. 

అయితే ఎలాగైనా స్వస్థలానికి వెళ్లిపోదామని, తండ్రికి ధైర్యం చెప్పిన జ్యోతి.. సైకిల్‌పై ఆయనను కూర్చోబెట్టుకుని తమ ఊరు సింగ్వారాకు తీసుకువచ్చింది. కొన్నాళ్లపాటు క్వారంటైన్‌లో ఉన్న తర్వాత వారు తమ ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జ్యోతి కుమారిపై ప్రశంసల జల్లు కురిసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు ఇవాంక ట్రంప్‌ సహా పలువురు ప్రముఖులు ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

दरभंगा, बिहार की 16 साल की ज्योति कुमारी को प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार मिलने पर बहुत बधाई और उज्ज्वल भविष्य के लिए शुभकामनाएं। pic.twitter.com/aRXJp1vgLU

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement