
ముంబై : మహారాష్ట్రలో పాలక శివసేనతో తలపడిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంగళవారం మరోసారి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్‌పై విరుచుకుపడ్డారు. హరియాణాకు చెందిన యూట్యూబర్ సాహిల్ చౌదరి అరెస్ట్ వ్యవహారంలో ఆమె మహారాష్ట్ర సర్కార్‌ను తప్పుపట్టారు. ముంబైలో గూండా రాజ్యం సాగుతోందని..మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రపంచంలోనే అత్యంత అసమర్థ సీఎం అని మండిపడ్డారు. సాహిల్ చౌదరి అరెస్ట్ వార్తాంశాన్ని షేర్ చేస్తూ కంగనా ట్వీట్ చేశారు. అసమర్ధ సీఎంను ఆయన బృందాన్ని ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదా అని నిలదీశారు. అసలు వారు మనకేం చేశారు..?
మన ఇళ్లను పగలకొట్టి మనల్ని చంపడమేనా..? దీనికి ఎవరు బదులిస్తారని కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేస్తూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. సర్కార్‌ను ప్రశ్నించడం సాహిల్ చౌదరి ప్రజాస్వామిక హక్కని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సాహిల్‌పై ఎవరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే దాని ఆధారంగా ఆయనను తక్షణమే జైలుకు పంపారని, మరోవైపు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి పాయల్ ఘోష్ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినా ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఇదేం చోద్యమంటూ ఆమె ప్రశ్నించారు.