బెంగళూరు: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, శివమొగ్గ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప(74) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని మంగళవారం అధికారికంగా ప్రకటించారాయన. మే నెలలో జరగబోయే ఎన్నికలతో పాటు ఇకపై ఏ ఎన్నికల్లోనూ పార్టీ తరపున పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటానని ప్రకటించారు ఈశ్వరప్ప. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు.
ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్‌గా చెప్పుకునే ఈశ్వరప్ప.. వివాదాలకు కేరాఫ్. ఈ వివాదాల నడుమే ఆయన మంత్రి పదవిని సైతం పొగొట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. అందువల్లే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై పార్టీ జాప్యం చేస్తూ వస్తోందని గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయంగా చర్చ కూడా నడుస్తోంది. ఈ తరుణంలో.. అధిష్టానం టికెట్ తిరస్కరించడం కంటే ముందే తానే గౌరవప్రదంగా తప్పుకోవాలని ఆయన భావించినట్లు అనుచరులు చెప్తున్నారు.
పార్టీ గత నలభై ఏళ్లుగా ఎన్నో బాధ్యతలు అప్పజెప్పింది. బూత్ ఇంఛార్జి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సముచిత స్థానం కల్పించింది. డిప్యూటీ సీఎంగా పని చేయడం కూడా నాకు గౌరవానిచ్చింది అని లేఖలో పేర్కొన్నారాయన.
ఈశ్వరప్ప వివాదాలకు కేరాఫ్. వివాదాల నడుమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు కూడా. సంతోష్ పాటిల్ అనే ఓ కాంట్రాక్టర్‌ను కమీషన్ కోసం వేధించిన ఆరోపణలపై కన్నడనాట పెద్ద రాజకీయ దుమారమే రేగింది. ఫలితంగా.. ఆయన కిందటి ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో కేవలం రాజీనామా మాత్రమే కాదని.. ఈశ్వరప్పను అరెస్ట్‌చేయాలంటూ విపక్షాలు బలంగా డిమాండ్ చేశాయి.
అంతకు ముందు.. జాతీయ జెండా స్థానంలో ఏదో ఒకరోజు కాషాయపు జెండా ఎర్రకోటపై ఎగిరి తీరుతుందని కే.ఎస్.ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలకు దారి తీశాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా విధానసౌధ(విధాన సభ)లో ధర్నాకు దిగింది. ఇంతేకాదు..
మధుర, కాశీలలో ఆలయాలను కూల్చేసి మరీ మసీదులను నిర్మించారంటూ వ్యాఖ్యలు చేసి పెనుదుమారమే రేపారాయన. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అయోధ్యలో బాబ్రీ మసీదులాగే అన్నింటినీ కూల్చేసి.. ఆలయాలను పునర్మిస్తామంటూ ప్రకటించాడాయన. ఇది ఇంతటితోనే ఆగలేదు.. ముస్లింల నమాజ్‌పైనా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించిందన్న ప్రచారమూ అక్కడ నడిచింది.
కూలీ పనులు చేసుకునే కుటుంబంలో పుట్టిన ఈశ్వరప్ప.. సామాజిక ఉద్యమకారుడిగా, అటుపై ఆరెస్సెస్‌తో అనుబంధం కొనసాగించారు. వీహెచ్‌పీ, ఏబీవీపీలో పని చేసి.. అటుపై రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రతిపక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పలు బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment