సాక్షి, బెంగళూరు: ఉప ఎన్నికలు, విధాన పరిషత్తు పోరు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వం పునరాలోచనలో పడింది. వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ముఖ్య మార్పులు చేయాలని చూస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత బొమ్మై సర్కారుకు భారీ సర్జరీ చేస్తారని అంచనా. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సారీ పదవులు అనుభవిస్తున్న సుమారు పది మంది సీనియర్ నేతలను మంత్రివర్గం నుంచి తప్పించాలని హైకమాండ్ యోచిస్తోంది. వారిని పార్టీ బలోపేతానికి వాడుకుంటూ, జనాదరణ ఉన్న కొత్త నేతలకు మంత్రి పదవుల్ని కట్టబెడితే వచ్చే ఎన్నికల్లో పుంజుకోవచ్చని ఆశిస్తోంది.
గ్రూపులతోనే చిక్కు..
బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గ్రూపులు ఏర్పడ్డాయి. సీఎం వర్గం.. మాజీ సీఎం వర్గం.. సీఎం వ్యతిరేక వర్గం.. వలస వచ్చిన వారు.. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారులు, పార్టీ పెద్దల ఆశీస్సులున్న వారు తదితర గ్రూపులతో చిక్కు ఏర్పడుతోంది. ఒకే పార్టీలో మూడు నాలుగు తలుపులు ఉండటంతో ఏ కార్యక్రమం సవ్యంగా సాగడం లేదనే విమర్శలున్నాయి. ఓ వర్గానికి న్యాయం చేస్తే.. మరో వర్గం నుంచి వ్యతిరేకత వస్తోంది. ఫలితంగా ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడుతోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు సమర్థులకు బాధ్యతలు అప్పజెప్పేందుకు అధిష్టానం సిద్ధమైంది.
8, 9న నంది బెట్టలో సభ..
ఈ నెల 8, 9వ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇన్‌చార్జ్ అరుణ్‌సింగ్, సీనియర్ నేత బీఎల్ సంతోష్, సీఎం బొమ్మై తదితరులతో కలిసి నంది హిల్స్‌లో మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాల గురించి వివరిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా విశ్లేషణ ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment