బెంగళూరు: మత మార్పిడుల నిరోధక బిల్లుకు శాసన మండలి మద్దతు లభించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో మత మార్పిడులను అరికట్టడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కర్ణాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ గత ఏడాది డిసెంబర్‌లో కర్ణాటక అసెంబ్లీలో ఆమోదం పొందింది. శాసన మండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో ఉండిపోయింది. మండలిలో అధికార బీజేపీకి తగిన మెజార్టీ లేకపోవడమే ఇందుకు కారణం.
బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఇప్పట్లో లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం చివరకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయానికొచ్చింది. ఈ విషయాన్ని న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల బెంగళూరు ఆర్చిబిషప్ పీటర్ మచాడో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయొద్దంటూ కర్ణాటక గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. ఆర్డినెన్స్ ఆలోచన చాలా బాధాకరమని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ను అసెంబ్లీలో క్రైస్తవ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు.
Comments
Please login to add a commentAdd a comment